పదవులను పట్టుకునే ఉంటారా?
- ఢిల్లీలో బొత్సకు సమైక్య సెగ
- మీడియా సమావేశంలోకి చొచ్చుకొచ్చిన విద్యార్థులు, విశాలాంధ్ర మహాసభ నేతలు
- నెలరోజులుగా ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోరేమని మండిపాటు
- సమైక్యం కోసం 30 కాదు.. మూడు వేల రోజులు ఉద్యమించాల్సి వస్తుంది: బొత్స
- చంద్రబాబు గుంటనక్క అని విమర్శ
సాక్షి, న్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఢిల్లీలో విభజన సెగ తగిలింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన బొత్స మంగళవారం మధ్యాహ్నం ఏపీభవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికే శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ విద్యార్థులు, విశాలాంధ్ర మహాసభ నేతలు సమావేశ మందిరంలోకి చొచ్చుకువచ్చి, విజయనగరంలో విద్యార్థులపై జరిగిన దాడికి జవాబు చెప్పాలంటూ బొత్సను నిలదీశారు. ‘‘విద్యార్థులను మీరే కొట్టించారు. మీ అనుచరులే దాడులు చేశారు. ప్రజల పక్షాన ఉండాల్సిన మీరు ఏం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజలు నెల రోజులుగా ఉద్యమిస్తున్నా స్పందించరా? పదవులు పట్టుకునే వేలాడతారా? అంటూ నిలదీశారు. బొత్స స్పందిస్తూ.. ‘‘సీమాంధ్ర వారంతా సమైక్యం కోరుకుంటున్నారు. మేమూ మా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర సమైక్యం కోసం ముైప్పై రోజులు కాదు.. 3,400 రోజులు పోరాడే రోజులు వస్తాయి. తెలంగాణవారు 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు.
వారిలా ఓపిక ఉండాలి’’ అని అన్నారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు యాత్రల పేరిట ప్రజలను మోసగించేందుకు బయల్దేరారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా సోనియా పెంపుడు కుక్కలంటూ బాబు చేసిన విమర్శలపై మండిపడ్డారు. ‘‘పెంపుడు కుక్కలకు విశ్వాసం ఉంటుంది. అవి గుర్తించిన పార్టీకి, ఓటిచ్చిన ప్రజలకు విశ్వాసంగా ఉంటాయి. మరి గుంటనక్కలు అలా ఉండవు. అవి పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడుస్తాయి. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను మరిచి యాత్రలు చేస్తాయి’’ అని విరుచుకుపడ్డారు. ‘‘సమైక్యమే కావాలని పార్టీలు వుళ్లీ లేఖలు ఇస్తే కాంగ్రెస్ తన నిర్ణయూన్ని వూర్చుకునే అంశంపై ఆలోచిద్దాం’’ అని బొత్స ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.