సీమాంధ్రలో .. సమర దీక్షా బంధన్ | Samaikyandhra movement continues on Raksha bandhan festival for three weeks | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో .. సమర దీక్షా బంధన్

Published Thu, Aug 22 2013 1:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

సీమాంధ్రలో .. సమర దీక్షా బంధన్

సీమాంధ్రలో .. సమర దీక్షా బంధన్

పండగల్లేవ్.. పర్వదినాల్లేవ్... ఒకటే లక్ష్యం సమైక్యాంధ్ర పరిరక్షణ. సీమాంధ్రలో మూడువారాలకు పైగా విరామం లేకుండా హోరెత్తుతున్న సమైక్య ఉద్యమం శ్రావణపౌర్ణమి రక్షాబంధన్ నాడు బుధవారం వినూత్నరీతిలో ముందుకు సాగింది. సీమాంధ్రలో నివసిస్తున్న , ఉద్యోగరీత్యా పనిచేస్తున్న తెలంగాణ వారికి సమైక్యవాదులు రాఖీలు కట్టి రాష్ట్రం ముక్కలు కాకుండా కలిసుండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని వారికీ రక్షాబంధన్‌లు కట్టి విభజన వద్దని అందరూ కలిసుందామని కోరారు.
 - సాక్షి నెట్‌వర్క్
  సీమాంధ్ర జిల్లాల్లో బుధవారం సమైక్య గర్జన మార్మోగింది. యధావిధిగానే ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, సోనియా, చంద్రబాబు, బొత్స, చిరంజీవి, కేసీఆర్‌ల దిష్టిబొమ్మల దహనాలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అడుగడుగునా కనిపించాయి.
 
 పోటెత్తిన గోదావరి తీరం
 అఖండ గోదావరితీరం సమైక్య నినాదంతో మార్మోగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అన్ని జేఏసీలూ కలిసి ‘గోదావరి సమైక్య నాదం’ పేరుతో చేపట్టిన ప్రదర్శనలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. గజల్ శ్రీనివాస్ హాజరై రాష్ట్ర సమైక్యతను చాటి చెప్పే గీతాలు ఆలపించారు. సమైక్యవాదులు లాలాచెరువు వద్ద  జాతీయ రహదారిని ముట్టడించారు.
 
 కౌన్సెలింగ్ వద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నినాదాలు
 కాకినాడ జేఎన్‌టీయూకేలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు సమైక్యవాదులు ప్రయత్నించగా పోలీసులు చుట్టుముట్టారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కౌన్సెలింగ్ నిలుపు చేయాలని నినాదాలు చేశారు. కడియంలో రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. రాష్ట్ర సమైక్యత ఆవశ్యకతను చాటుతూ వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం అమలాపురం పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని కొత్తపేట, కాకినాడ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో జరిగింది.
 
 నెల్లూరులో అధికారుల పెన్‌డౌన్
 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా అధికారులు పెన్‌డౌన్ చేపట్టి సమైక్యఉద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు.  కావలిలో జరిగిన ఆందోళనల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి వైఎస్సార్ విగ్రహం వద్ద జరిగిన వంటావార్పులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
 విజయ‘వాడ’వాడలా మానవహారాలు
 ఎన్జీవోల నేతృత్వంలో బుధవారం మధ్యాహ్నం విజయవాడ నగరవ్యాప్తంగా మానవహారాలు నిర్మించారు. నగరంలో రాత్రి కాగడాల ప్రదర్శన జరిపారు. రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విద్యుత్ దీపాలు ఆర్పివేసి నిరసన తెలిపారు. జగ్గయ్యపేటలో  మానవహారం నిర్వహించగా వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఉదయభాను, వివిధ పార్టీల  నాయకులు పాల్గొన్నారు. వత్సవాయిలో జిల్లా సరిహద్దు వద్ద తెలంగాణవాదులకు రాఖీలు కట్టి  కలిసి ఉండాలని కోరారు.
 
 రోడ్డుపై మాక్ కోర్టు
 విజయనగరం జిల్లా గజపతినగరంలో న్యాయవాదులు రోడ్డుపై మాక్ కోర్టు నిర్వహించారు.  అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో న్యాయవాదులు మాక్ కోర్టు నిర్వహించి సోనియా గాంధీకి దేశ బహిష్కరణ, ఆమెకు సహకరించిన సీమాంధ్ర మంత్రులకు రాజకీయ బహిష్కరణ విధిస్తూ తీర్పునిచ్చారు.  ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉద్యోగులు విజయనగరం  ఎత్తుబ్రిడ్జిపై భారీ మానవహారం నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు.   ఎస్‌కోటలో సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు పురందేశ్వరి, చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్సల దిష్టిబొమ్మలకు పిండ ప్రదానం చేశారు.
 
 మూడురోజులు గూడెం బంద్
 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం నుంచి 72 గంటల బంద్‌కు నాన్ పొలిటికల్, ఎన్జీవో జేఏసీలు పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌గేట్, ఆశ్రం ఆసుపత్రుల వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్ బుధవారం నుంచి నిరవధిక దీక్షకు కూర్చున్నారు.
 
 రైతుల ర్యాలీ
 అనంతపురంలో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల అధికారులు, ఉద్యోగులు.. రైతులతో కలసి పరికరాలతో వినూత్న ర్యాలీ నిర్వహించారు. నగరంలో రిలే దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం వాహనాలకు జై సమైక్యాంధ్ర స్టిక్కర్లు అతికించారు. ఎస్కేయూలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
 
 30న విశాఖలో సమైక్యమార్చ్
 ఈనెల 30న వేలాది మందితో విశాఖలో సమైక్య మార్చ్ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రాయూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ప్రకటించింది.  ఈ మేరకు బుధవారం పోస్టర్ రిలీజ్ చేశారు. విశాఖనగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం నేత గవిరెడ్డి రామానాయుడు చేపట్టిన ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది.
 
 జోరు వర్షంలోనూ
 వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వేలాది మంది విద్యార్థులు వర్షంలోనే జాతీయ జెండాలు చేతబూని సమైక్య నినాదాలతో భారీప్రదర్శన చేపట్టారు. జమ్మలమడుగు, రాయచోటిలలో న్యాయవాదులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని సత్యాగ్రహం చేపట్టారు. ఒంగోలు నగరంలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
 
 శ్రీకాకుళం కలెక్టర్ అడ్డగింత
 శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏలో బుధవారం జరుగుతున్న అధికారిక సమావేశానికి వెళుతున్న  కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను సమైక్యవాదులు పాలకొండ ఏలాం సెంటర్‌లో అడ్డుకున్నారు. దాదాపు అరగంటసేపు ఆయన వాహనాన్ని నిలిపివేసి  కలెక్టర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు వందలాది మందితో బుధవారం చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి తిరుమలకు మహాపాదయాత్రను ప్రారంభించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వరదయ్యపాళెంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు చిన్న, అడ్వొకేట్ దశరథయ్యయ ఆమరణ నిరాహార దీక్ష ఐదవ రోజుకు చేరింది.
 
 సమైక్యవాదుల రక్తదానం
 విభజన పరులకు సమైక్యరక్తాన్ని ఎక్కించాలని కోరుతూ చంద్రగిరిలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. తిరుపతి ఆయుర్వేద కళాశాలలో తెలంగాణ ఉద్యోగులకు రాఖీలు కట్టారు.
 
 సీమాంధ్రలో జాతీయ వార్తా చానె ళ్ల నిషేధానికి తీర్మానం
 సమైక్య ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వని జాతీయ వార్తా చానెళ్ల ప్రసారాలను ఆపివేయాలని తిరుపతి కేబుల్ ఆపరేటర్లు బుధవారం తీర్మానించారు. ఈ మేరకు సీమాంధ్రలోని 13 జిల్లాల ఎంఎస్‌వోలకు తీర్మానం పంపి సహకరించాలని కోరనున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఆర్టీసీ కార్మికులు వెనక్కు నడిచి నిరసన ప్రదర్శన చేశారు. తెనాలి, వినుకొండల్లో సమైక్యవాదులు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు వాహనాల్ని అడ్డగించారు. కర్నూలులో టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తిని సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. రెండు కళ్ల సిద్ధాంతం కలిగిన చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
 
 రాలిన మరో ఎనిమిది ప్రాణాలు
 రాయదుర్గంలో నిరశన దీక్షా శిబిరంలోనే గుండెపోటుతో ఒకరి మృత్యువాత
 సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభ‘జనా’ందోళన బుధవారం ఒక్కరోజే మరో ఏడుగురిని బలిగొంది. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాపు భారతి చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరంలో ఉన్న తిమ్మప్ప(55) గుండెపోటుతో మృతి చెందాడు. దీక్ష శిబిరంలో సమైక్యనినాదాలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన తిమ్మప్పను పార్టీ కార్యకర్తలు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటివరకు తమతోపాటు శిబిరంలో ఉన్న వ్యక్తి హఠాన్మరణం చెందడంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. ఇక విభజన వార్తలపై కలత చెంది ఓడీ చెరువుకు చెందిన బీడీ కార్మికుడు బాబ్‌జాన్(65), నార్పలలోని ఉయ్యాలకుంట కాలనీకి చెందిన రైతు మర్తాడు శివయ్య(46) గుండెపోటుతో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామానికి చెందిన సొసైటీ మాజీ ప్రెసిడెంట్  వీరవల్లి సత్తయ్య(65) గుండెఆగి మరణించారు.
 
  హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరి పిల్లల భవితవ్యంపై ఆయన తీవ్రఆందోళనకు లోనై మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం సంగం డెయిరీ పాలకేంద్రం అధ్యక్షుడు బత్తుల కృష్ణ(42) టీవీలో విభజన నేపథ్యంపై వార్తలు చూస్తూ గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడని బంధువులు తెలిపారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన మారేపల్లి నాగభూషణం (60), కర్నూలు జిల్లా కల్లూరు మండలం గోకులపాడుకు చెందిన కుమ్మరి రామదాసు(54) విభజన వార్తలతో కలతచెంది మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి భవానీపేటకు చెందిన వెలగంటి రామకృష్ణ (39) రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో గుండెపోటుతో మృతి చెందాడు.
 
 కొరముట్ల దీక్ష భగ్నం
 రైల్వేకోడూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరుతూ ఏడు రోజులుగా వైఎస్‌ఆర్ జిల్లా రైల్వేకోడూరులో ఆమరణ నిరశన చేస్తున్న ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు దీక్షను బుధవారం పోలీసులు భగ్నం  చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బలవంతంగా దీక్షను భగ్నం చేసి 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఎమ్మెల్యేతో పాటు మిగిలిన నలుగురికి సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి కొరముట్ల శ్రీనివాసులుకు కొబ్బరినీళ్లు తాగించి దీక్షను విరమింపజేశారు. కాగా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి దీక్షను మంగళవారం రాత్రే పోలీసులు భగ్నం చేసినప్పటికీ ఆయన బుధవారం ఉదయం వరకు ఆస్పత్రిలో దీక్ష కొనసాగించారు.  వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు మధ్యాహ్నం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement