చెట్టు మీద పిట్ట.. చేతిలో పిట్ట
కాంగ్రెస్ పార్టీ అంటే ఓ మహా సముద్రం లాంటిదని తలపండిన ఆ పార్టీ నేతలు వీలు చిక్కినప్పుడల్లా సెలవిస్తుంటారు. ఎదిగాలనే కాంక్ష ఉన్న నేతలకు శక్తి సామర్ధ్యాలు ఉండాలే కాని కాంగ్రెస్ మహాసముద్రాన్ని అవలీలగా ఈదేయవచ్చు అని ఆపార్టీ సీనియర్ నేతలను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. సముద్రం లాంటి కాంగ్రెస్ ను బాగా అర్ధం చేసుకున్నాడు కాబట్టే సర్వే సత్యనారాయణ ఓ సాధారణ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి పదవి దాకా ఎగబాకాడు. కేంద్రమంత్రి పదవిని సర్వే వరించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం కాకపోయినప్పటికి.. కావూరి లాంటి సీనియర్ నేతలను కాదని సర్వేకు మంత్రి పదవి లభించడం కాంగ్రెస్ సీనియర్ నేతలను నివ్వెర పోయేలా చేసింది.
సర్వే లాంటి నేతలకు మంత్రి పదవి దక్కడం వెనుక అతిపెద్ద క్వాలిఫికేషన్ సోనియా గాంధీకి విధేయుడిగా ఉండటం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ వేదికల మీద, మీడియా ముందు, అపర విధేయుడిగా అవతారమెత్తాల్సిన ప్రతిచోట సర్వే తనదైన శైలిలో అమ్మ జపం చేయడంలో మాస్టర్ డిగ్రీ ఉందా అన్నంతగా ఉంటుంది ఆయన ప్రవర్తన. అమ్మ నామస్మరణలో మునిగి తేలిన సర్వేకు మంత్రి పదవి దక్కడం న్యాయమే అనిపిస్తుంది. కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న సర్వేకు ఇక లక్ష్యం ముఖ్యమంత్రి అన్నట్టు కనిపిస్తోంది. ఏ ఉద్దేశం ఉందో ఏమో కానీ.. ఇటీవల అందరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తన మదిలో మాటను బయటపెట్టారు.
ఇటీవల లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఎక్స్‌పో టెల్ హోటల్లో గురువారం క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ 26వ వార్షికోత్సవ సమావేశంలో మాట్లాడుతూ.. 'నేను ముఖ్యమంత్రిని కావాలని చాలామంది అంటున్నారు. సీఎం పదవి చెట్టుమీదున్న పిట్ట, కేంద్ర మంత్రి పదవి చేతిలోనున్న పిట్ట. చెట్టు మీద ఉన్న పిట్ట కోసం ఆరాటపడితే చేతిలో ఉన్న పిట్ట తుర్రుమనే అవకాశం ఉంది’ అని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే తొలి ముఖ్యమంత్రి పదవిని దళితుడికే ఇవ్వాలని మెజారిటీ పార్టీలు మొగ్గు చూపుతున్న తరుణంలో తనకున్న అర్హతను సర్వే ఉపయోగించుకోవాలని పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. అమ్మ అండదండలున్న సర్వేకు ముఖ్యమంత్రి పదవి లభించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే కదా!