సౌదీ నిర్ణయంపై ఆశ్చర్యం..
రియాద్: గత కొన్ని రోజులుగా ఖతర్‌తో సంబంధాలు తెగదెంపులు చేసుకున్న సౌదీ అరేబియా కాస్తంత మెత్తబడింది. ఖతర్ నుంచి హజ్ యాత్రికులు వచ్చేందుకు వీలుగా రెండు దేశాల సరిహద్దు పోస్టులను తెరచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక తమ ఎయిర్‌లైన్స్ విమానాలను దోహాకు పంపి హజ్ యాత్రికులను మక్కాకు దగ్గర్లోని జెడ్డా వరకు రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రకటనను ఖతర్ స్వాగతించింది. ఈ నిర్ణయాన్ని శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా అమలయ్యేలా చూడాలని సౌదీ అరేబియాను కోరింది. సౌదీ యువరాజు సల్మాన్, ఖతర్‌కు చెందిన రాజ కుటుంబ సభ్యునితో బుధవారం సమావేశమైన అనంతర ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే సదరు రాజకుటుంబం 1972లో జరిగిన కుట్రలో పదవులు కోల్పోయిందని సమాచారం. సరిహద్దు- పోస్టులు తెరుచుకోవటంతో ఇప్పటికే 100 మంది ఖతర్ వాసులు సౌదీ అరేబియాలోకి ప్రవేశించారని అధికారులు తెలపారు.
దాదాపు గత 10 వారాలుగా సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టు కలిసి ఖతర్‌తో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నాయి. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఖతర్‌పై ఆరోపణలు చేస్తూ వివిధ అంశాలకు సంబంధించి 13 డిమాండ్లను నెరవేర్చాలని తమ దేశాల సరిహద్దులు మూసివేశాయి. విమాన సర్వీసులను కూడా రద్దు చేశాయి. దీంతో ఖతర్ ఒంటరిగా పోరాడుతోంది. వచ్చే వారంలో సౌదీ అరేబియాలో హజ్ యాత్ర మొదలుకానుంది. ఇందులో భాగంగా కోట్లాది మంది ముస్లింలు పవిత్ర మక్కా, మదీనాలను సందర్శించుకుంటారు.