
ఎస్‌బీహెచ్ ‘ప్లాటినమ్’ సేవింగ్స్ ఖాతా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అధికాదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ‘ప్లాటినమ్’ పేరుతో కొత్త సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. ఇండియాలో ఉన్న వారితోపాటు ఎన్నారైలు కూడా ప్రారంభించడానికి అవకాశం ఉన్న ఈ ఖాతాలో మూడు నెలల కనీస నిల్వను లక్ష రూపాయలు లేదా రూ.10 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఎస్‌బీహెచ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ ఖాతా ప్రారంభించిన వారికి నగదు బదిలీలపై ఎటువంటి రుసుములు లేకపోవడం, ఉచిత అంతర్జాతీయ డెబిట్ కార్డు, రూ. 5లక్షలకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా, రుణాలపై ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు బ్యాంకు పేర్కొంది. రుణాలపై ప్రోసెసింగ్ ఫీజులో పావు శాతం తగ్గింపుతోపాటు, చెక్‌బుక్స్‌పై ఎటువంటి రుసుములు కూడా వసూలు చేయడం లేదు. ఈ సౌకర్యాలు ప్రస్తుత ఖాతాదారులకు కూడా వర్తిస్తాయని, కాని కనీస నిల్వ లక్ష రూపాయల నిబంధనను పాటించాలి.