గతవారం బిజినెస్‌ | last week business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Jan 23 2017 1:49 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

గతవారం బిజినెస్‌

గతవారం బిజినెస్‌

నియామకాలు
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మణి పల్వేశన్‌ బాధ్యతలు స్వీకరించారు.
టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఇటీవలే ఎంపికైన ఎన్‌.చంద్రశేఖరన్‌ తాజాగా టాటా మోటార్స్‌ చీఫ్‌గా నియమితులయ్యారు. అదనపు డైరెక్టర్‌గా, బోర్డు చైర్మన్‌గా ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చింది.

సమగ్రాభివృద్ధిలో 60వ స్థానంలో భారత్‌
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న 79 ఆర్థిక వ్యవస్థల్లో... పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్‌ల కంటే దిగువున 60వ స్థానంలో భారత్‌ ఉందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌
(డబ్ల్యూఈఎఫ్‌) నివేదిక వెల్లడించింది. చాలా దేశాలు అసమానత్వాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ఆర్థిక వృద్ధికి వచ్చిన అవకాశాలను జార విడుచుకుంటున్నాయని డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. దశాబ్దాలుగా విధాన కర్తలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా, ప్రమాణాలను తిరిగి సర్దుబాటు చేసుకోవాల్సి ఉందని సూచించింది. సమగ్రాభివృద్ధి సూచీలో లిత్వేనియా ప్రథమ స్థానంలో ఉంది. భారత్‌ 60వ స్థానంలో ఉండగా, చైనా (15), నేపాల్‌ (27), బంగ్లాదేశ్‌ (36), పాకిస్తాన్‌ (52) మనకంటే మెరుగైన స్థానాల్లో నిలిచాయి.

టోకు ధరలకు ఇంధన సెగ!
పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభావం డిసెంబర్‌ టోకు ధరల బాస్కెట్‌పై పడింది. 2016 డిసెంబర్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2015 డిసెంబర్‌తో పోల్చితే 2016 డిసెంబర్‌లో టోకు ధరల బాస్కెట్‌ ధర 3.39 శాతం పెరిగిందన్నమాట. కాగా నవంబర్‌లో ఈ రేటు 3.15 శాతం. గత ఏడాది ఇదే కాలంలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా 1.06 క్షీణతలో ఉంది.

కేజీ బేసిన్‌లో కెయిర్న్‌ తవ్వకాలకు ఓకే!
కేజీ బేసిన్‌లోని కేజీఓఎస్‌ఎన్‌2009/3 బ్లాక్‌లో ఇంధనాల వెలికితీత కోసం 64 బావులు తవ్వడానికి కెయిర్న్‌ ఇండియాకు పర్యావరణ శాఖ కమిటీ అనుమతులు ఇచ్చింది. ప్రాజెక్టు ప్రతిపాదనకు సంబంధించి నిర్దిష్ట షరతులతో నిపుణుల కమిటీ (ఈఏసీ) ఈ అనుమతులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని కేజీ బేసిన్‌లో 1,988 కి.మీ. మేర ఈ బ్లాక్‌ విస్తరించింది. ఇందులో చమురు, గ్యాస్‌ నిక్షేపాల వెలికితీతకు సంబంధించి 55 ఇంధన అన్వేషణ బావులు, నిల్వల మదింపునకు 11 బావులు తవ్వేందుకు అనుమతుల కోసం కెయిర్న్‌ ఇండియా దరఖాస్తు చేసుకుంది.

రెన్యూ పవర్‌కు ఏడీబీ రుణం
ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తాజాగా పునరుత్పాదక విద్యుత్‌ రంగ సంస్థ రెన్యూ పవర్‌ వెంచర్స్‌కి 390 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 2,650 కోట్లు) మేర దీర్ఘకాలిక రుణం అందజేయనుంది. ఈ నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోని కార్యకలాపాలను విస్తరించేందుకు ఉపయోగించుకోనున్నట్లు రెన్యూ పవర్‌ తెలిపింది.

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో నిధుల సమీకరణ
దేశీ మూడో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా రూ.350 కోట్లను సమీకరించింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ విధానంలో నాన్‌కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ) జారీ ద్వారా ఈ నిధులను సమీకరించినట్లు సంస్థ పేర్కొంది. వీటి కూపన్‌ రేటు 7.6 శాతంగా ఉందని తెలిపింది. ప్రముఖ దేశీ గృహ రుణాల సంస్థ ’హెచ్‌డీఎఫ్‌సీ’, జర్మనీకి చెందిన మ్యూనిచ్‌ రె గ్రూప్‌ ప్రధాన ఇన్సూరెన్స్‌ సంస్థ ’ఎర్గో ఇంటర్నేషనల్‌ ఏజీ’ల జాయింట్‌ వెంచరే ఈ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌.

ఎస్‌బీఐకు రూ.5,681 కోట్ల నిధులు
స్టేట్‌ బ్యాంక్‌  ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.5,681 కోట్ల నిధులు సమీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరించామని ఎస్‌బీఐ తెలిపింది. కేంద్రానికి 21.07 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపాదికన కేటాయించడానికి తమ క్యాపిటల్‌ రైజింగ్‌ డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపిందని స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు ఎస్‌బీఐ నివేదించింది. రూ. 1 ముఖ విలువ గల షేర్లను రూ.269.59 ధరకు కేటాయించామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐకు ప్రభుత్వం అందించనున్న రూ.7,575 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా ఈ నిధుల సమీకరణ జరిగింది. ఇక మిగిలిన రూ.1,894 కోట్ల నిధులు ఈ ఏడాది మార్చి 31 లోగా ఎస్‌బీఐకి అందుతాయని అంచనా.

శాంసంగ్‌ నుంచి ’గెలాక్సీ సీ9 ప్రొ’
ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ’శాంసంగ్‌ ఇండియా’ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ ’గెలాక్సీ సీ9 ప్రొ’ను దేశీ మార్కెట్‌లో ఆవిష్కరించింది. నలుపు, బంగారం రంగుల్లో లభ్యంకానున్న ఈ ఫోన్ల ధర రూ.36,900గా ఉంది.

డీల్స్‌..
ప్రపంచ టొబాకో పరిశ్రమలో భారీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. అమెరికా దిగ్గజం రేనాల్ట్స్‌ అమెరికన్‌ను చేజిక్కించుకున్నట్లు బ్రిటిష్‌ అమెరికన్‌ టొబాకో (బీఏటీ) ప్రకటించింది. ఇందుకోసం 49.4 బిలియన్‌ డాలర్లను (దాదాపు రూ.3.35 లక్షల కోట్లు) వెచ్చించేందుకు అంగీకరించింది. ఈ డీల్‌ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద లిస్టెడ్‌ టొబాకో (సిగరెట్లు ఇతరత్రా పొగాకు ఉత్పత్తులు) కంపెనీ ఆవిర్భవిస్తోందని బీఏటీ పేర్కొంది. నగదు, షేర్ల రూపంలో ఈ ఒప్పందం ఉంటుందని తెలిపింది.  
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సర్వీసులను అందించే ’ఫినో పేటెక్‌’లో 8.41 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీని కోసం రూ.100 కోట్లు చెల్లించింది.
ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌ పిన్‌కస్‌ సంస్థ మల్టిప్లెక్స్‌ చెయిన్‌ పీవీఆర్‌లో 14 శాతం వాటాను రూ.820 కోట్లకు కొనుగోలు చేసింది.
ఆలీబాబా మొబైల్‌ బిజినెస్‌ గ్రూప్‌లో భాగమైన యూసీవెబ్‌ ..భారత్, ఇండొనేసియాల్లో రూ. 200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులో సుమారు 60 శాతం (దాదాపు రూ. 120 కోట్లు) భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు సంస్థ జీఎం కెనీ యీ తెలిపారు.
మహీంద్రా అండ్‌  మహీంద్రా కంపెనీ టర్కీకి చెందిన వ్యవసాయ పరికరాలు తయారు చేసే హిసర్లర్‌ కంపెనీలో  75.1 శాతం వాటాను రూ.129 కోట్లకు కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement