న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఈ ఆర్థికసంవత్సరంలో క్యాపిటల్ మార్కెట్ నుంచి నిధులు సమీకరణకు సిద్ధమవుతోంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) లేదా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని ఎస్‌బీఐ తెలిపింది. ఎఫ్‌పీఓ/క్విప్‌కు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. కనీసం ఆరు సంస్థలను నియమించాలని బ్యాంకు భావిస్తోంది.
'కేపిటల్ మార్కెట్స్‌లో క్యూఐపీ/ఎఫ్‌పీఓలను ఆఫర్ చేసేందుకు బ్యాంక్ సిద్ధమవుతోంది. ఎంతమేర నిధులను సమీకరించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మేనేజ్మెంట్ నిర్ణయాలు, షేర్ హోల్డర్ల అనుమతులను అనుసరించి ఇష్యూ సైజ్ నిర్ణయిస్తాం' అంటూ ఎస్‌బీఐ వర్గాలు వెల్లడించాయి. వివిధ అంశాల ఆధారంగా ఎంత మొత్తం నిధులు సమీకరించాలో తర్వాత నిర్ణయిస్తామని తెలియజేసింది. బ్యాంకు ఇప్పటికే రూ.15,000 కోట్లు సమీకరించానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదాన్ని కూడా పొందింది. బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ కోసం నలుగురు డైరెక్టర్లను ఎన్నుకోవడానికి వచ్చే నెల 15న వాటాదారుల సాధారణ సమావేశం జరగనున్నట్లు ఎస్‌బీఐ స్టాక్ ఎక్స్చేంజ్‌లకు అందించిన సమాచారంలో వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15వేల కోట్లను పబ్లిక్ ఆఫర్స్, విదేశాల నుంచి సేకరణ ద్వారా సమీకరించేందుకు ఎస్‌బీఐ ఇప్పటికే ఆర్బీఐ నుంచి అనుమతులు పొందింది. 6గురు మర్చంట్ బ్యాంకర్స్ ఈ ఇష్యూని నిర్వహిస్తారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్గాలు వెల్లడించాయి.
భారీ నిధుల సమీకరణ బాటలో ఎస్‌బీఐ
Published Wed, May 10 2017 8:23 AM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM
Advertisement