raise
-
రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇచ్చేలా ప్రణాళికలు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిa
హుజూర్నగర్ (సూర్యాపేట): రాష్ట్రంలో రేషన్ షాపుల్లో పూర్తిస్థాయిలో సన్న బియ్యం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కొనసా గుతున్న అభివృద్ధి పనులపై ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులతో ఆది వారం హుజూర్‌నగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాల యంలో ఎమ్మెల్యే పద్మావతితో కలిసి సమీక్ష నిర్వ హించారు.అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ... ఉమ్మడి ఏపీలో ఏర్పాటైన లిఫ్టుల్లో పని చేయని వాటిని పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామ న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కోట్ల రూపా యలతో లిఫ్టులు మంజూరు చేశారు కానీ వాటిని సరిగ్గా నిర్వహించలేదని ఆరోపించారు. అటువంటి వాటిని సరిగ్గా నిర్వహించేందుకు, మరమ్మతులు చేపట్టేందుకు ప్రతి మూడు నాలుగు లిఫ్టులకు కలిపి ఫిట్టర్ ఆపరే టర్‌తో పాటు ఎలక్ట్రీషియన్‌ను కూడా నియమించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నీటి సౌకర్యం ఉండి లిఫ్టులు లేని ప్రాంతాల్లో లిఫ్టులు మంజూరు చేయిస్తామని, అలాగే నూతన ఆయకట్టు సామర్థ్యాన్ని పెంచే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. -
Fixed Deposits: శుభవార్త.. వడ్డీ రేట్లు పెరిగాయ్..
స్థిరమైన ఆదాయంతోపాటు భవిష్యత్తుకు భద్రతనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి ఉన్న వారికి శుభవార్త. ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తమ వద్ద చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీని పెంచాయి. మెరుగైన వడ్డీ రేటు కోసం చూస్తున్నవారికి ఇదే మంచి సమయం. పలు బ్యాంకులు వివిధ కాల వ్యవధులు, డిపాజిట్ మొత్తాన్ని బట్టి 8 శాతం వరకూ వార్షిక వడ్డీని అందిస్తున్నాయి. కీలకమైన రెపో రేటును 6.5 వద్దే యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ రానున్న నెలల్లోనూ అలాగే ఉంచుతుందన్న అంచనాల నేపథ్యంలో కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఆయా బ్యాంకులు తమ వెబ్సైట్లలో ప్రకటించిన ఎఫ్డీ రేట్లు ఇక్కడ అందిస్తున్నాం.. వివిధ బ్యాంకుల ఎఫ్డీ రేట్లు ఇవే.. డిసెంబర్లో ఎఫ్డీలపై వడ్డీ రేటును పెంచిన మొదటి బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిసెంబర్ 1 నుంచి తమ ఎఫ్డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్లు, ఆపైన, రూ. 10 కోట్ల లోపు డిపాజిట్ చేసే దేశీయ కస్టమర్లకు ఒక సంవత్సరం కాలవ్యవధికి 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు డిపాజిట్లపై ఎఫ్డీ రేట్లను సవరించింది. ఏడు నుంచి 14 రోజుల వ్యవధికి కనిష్టంగా 4.75 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల వరకు వ్యవధిపై గరిష్టంగా 7.25 శాతం వడ్డీ అందిస్తోంది. ఇవి డిసెంబరు 13 నుంచి అమలులోకి వస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా రూ. 5 కోట్లకు మించిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఏడు నుంచి 14 రోజుల కాలవ్యవధికి కనిష్టంగా 4.75 శాతం, ఏడాది నుంచి 15 నెలల వరకు గరిష్టంగా 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. డిసెంబర్ 13 నుంచి మారిన రేట్ల ప్రకారం.. రూ. 100 కోట్ల నుండి రూ. 500 కోట్లకు మించిన ఎఫ్డీలపై వడ్డీ ఇప్పుడు 7.35 శాతం నుండి 7.30 శాతానికి చేరుకుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ డిసెంబర్ 11 నుంచి రూ. 2 కోట్ల లోపు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 85 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సాధారణ కస్టమర్ల కోసం కూడా ఎఫ్డీ రేట్లు వివిధ కాల వ్యవధులకు 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి. సీనియర్ సిటిజన్లు ఇప్పుడు 23 నెలల నుండి రెండు సంవత్సరాల వరకు 7.80 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చు. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ చేసే సాధారణ కస్టమర్లకు 23 నెలల ఒక రోజు నుంచి రెండేళ్ల లోపు కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఫెడరల్ బ్యాంక్ కూడా తన డిపాజిట్ రేట్లను సవరించింది. రెసిడెంట్ , నాన్-రెసిడెంట్ డిపాజిట్లకు వర్తించే 500 రోజుల కాలవ్యవధికి 7.50 శాతం రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే 8.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. డీసీబీ బ్యాంక్ డీసీబీ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచింది. డిసెంబరు 13 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రేట్ల ప్రకారం.. 25 నెలల నుండి 26 నెలల కాలవ్యవధితో సాధారణ డిపాజిట్లపై 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.60 శాతం అత్యధిక వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. -
రాజస్థాన్ రాజకీయాలను శాసిస్తున్న ఓటింగ్ శాతం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 199 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈసారి 0.9 శాతం అధికంగా ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 74.96 శాతం ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిన ప్రతిసారీ బీజేపీకి, తగ్గినప్పుడు కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతూ వచ్చింది. మరి ఈసారి ఏం జరుగుతుందనే దానిపై విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. రాజస్థాన్‌లో గత ఐదు సంవత్సరాల రికార్డును పరిశీలిస్తే, ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం వస్తోంది. గత 20 ఏళ్ల ఓటింగ్ ట్రెండ్ కూడా ఓటింగ్ శాతం తగ్గినప్పుడు కాంగ్రెస్ లాభపడిందని, ఓటింగ్ పెరిగినప్పుడు బీజేపీకి లబ్ధి చేకూరిందని తెలుస్తోంది. దీంతో డిసెంబరు 3న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాత ట్రెండ్ కొనసాగుతుందో లేదో అనేది ఆరోజున తేలిపోనుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని 20 ఏళ్ల రాజస్థాన్ ఎన్నికల చరిత్ర చెబుతోంది. 1998 ఎన్నికల్లో 63.39 శాతం ఓటింగ్ రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. గెహ్లాట్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2003 ఎన్నికల్లో ఓటింగ్ 3.79 శాతం పెరిగింది. 67.18 శాతం ఓటింగ్ జరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. వసుంధర రాజే తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2008లో రాష్ట్రంలో 66.25 శాతం ఓటింగ్ నమోదై, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఓటింగ్ శాతం 0.93 శాతం తగ్గింది. గెహ్లాట్ రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 2013 ఎన్నికల్లో మరోసారి 8.79 శాతం ఎక్కువ ఓటింగ్ రావడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. రాజే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో 0.98 శాతం తక్కువ ఓటింగ్ నమోదైంది. మొత్తం 74.06 శాతం ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో తక్కువ ఓటింగ్ శాతం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో బీజేపీకే విజయావకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? -
దిగంతారా రూ.82 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: అంతరిక్ష సాంకేతిక రంగంలోని అంకుర సంస్థ దిగంతారా తాజాగా రూ.82 కోట్ల నిధులను అందుకుంది. సిరీస్-ఏ1 రౌండ్లో పీక్ ఎక్స్‌వీ పార్ట్నర్స్, కలారీ క్యాపిటల్, గ్లోబల్ బ్రెయిన్స్, క్యాంపస్ ఫండ్‌తోపాటు ఐఐఎఫ్ఎల్ వెల్త్ వ్యవస్థాపకులు ఈ మొత్తాన్ని సమకూర్చారు. స్పేస్-మిషన్ అష్యూరెన్స్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. భూమి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష వ్యర్థాలను ఈ నిఘా ఉపగ్రహాలు గుర్తిస్తాయని వివరించింది. త్వరలో కంపెనీ వీటిని ప్రవేశపెట్టనుంది. (హైదరాబాద్‌లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు) కాన్ ఫిన్ హోమ్స్ నిధుల సమీకరణ గృహ రుణ సంస్థ కాన్ ఫిన్ హోమ్స్ రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ లేదా రైట్స్ ఇష్యూ ద్వారా మరో రూ. 1,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. పీఎస్ యూ కెనరా బ్యాంక్ ప్రమోట్ చేసిన కంపెనీ బోర్డు నిధుల సమీకరణ ప్రణాళికలకు సోమవారం ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. మారి్పడిరహిత డిబెంచర్లు తదితర రుణ సెక్యూరిటీల కేటాయింపు ద్వారా రూ. 4,000 కోట్లు, క్విప్ లేదా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లేదా రైట్స్ ద్వారా మరో రూ. 1,000 కోట్లు అందుకోవాలని భావిస్తోంది. బీఎస్ఈలో 0.6 శాతం నీరసించి రూ. 745 వద్ద ముగిసింది. (WhatsApp Latest Features: స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్) -
భారత్‌కు మాల్వేర్ ముప్పు.. సైబర్‌సెక్యూరిటీ సంస్థ నివేదికలో కీలక విషయాలు
న్యూఢిల్లీ: మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు మాల్‌వేర్‌పరమైన ముప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022లో ఇవి ఏకంగా 31 శాతం ఎగిశాయి. అలాగే రాన్సమ్వేర్ దాడులు 53 శాతం పెరిగాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ సోనిక్‌వాల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్ వంటి దేశాల్లో సైబర్ నేరగాళ్లు తమ దాడుల పరిధిని మరింతగా పెంచుకుంటున్నారని, కొత్త టార్గెట్లను ఎంచుకోవడం, కొంగొత్త విధానాలు అమలు చేస్తున్నారని సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేబాశీష్ ముఖర్జీ తెలిపారు. వారు అవకాశాల కోసం నిరంతరం అన్వేషిస్తూ, ఒకసారి విజయవంతమైతే మళ్లీ మళ్లీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంటారని వివరించారు. ఈ నేపథ్యంలో కంపెనీలకు సైబర్ నేరగాళ్ల వ్యూహాలను ఆకళింపు చేసుకుని, వారి దాడులను ఎదుర్కొనగలిగే నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2022లో 173.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇది వార్షికంగా 8.9 శాతం వృద్ధి చెందుతూ 2027 నాటికి 266.2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనాలు ఉన్నాయి. సోనిక్‌వాల్ సర్వీసులు అందించే క్లయింట్లలో 55 శాతం పెద్ద సంస్థలు ఉండగా, 45 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలు ఉన్నాయి. ఇదీ చదవండి: టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం! -
మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు..
టాటా కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. పెరుగుతున్న తయారీ ఖర్చులు, బీఎస్ నిబంధనల మార్పు కారణంగా పెరిగిన ఆర్థిక భారంతో టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 2023లో కార్ల ధరలను పెంచడం ఇది రెండోసారి. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) తమ ప్యాసింజర్ వాహనాల ధరల సగటు పెరుగుదల 0.6 శాతం ఉంటుందని టాటా మోటర్స్ పేర్కొంది. పెరిగే ధర కార్ మోడల్, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ధరల పెంపు మే 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 సంవత్సరంలో టాటా మోటార్స్ ధరలను పెంచడం ఇది రెండవ సారి. అంతకుముందు జనవరిలో ధరలను 1.2 శాతం పెంచింది. బీఎస్ 6 నిబంధనలను అమలు చేయడం వల్ల ఈ నెల ప్రారంభంలో దేశంలోని అన్ని కంపెనీల్లో అన్ని విభాగాలలో వాహనాల ధరలు పెరిగాయి. ఉద్గారాలను పర్యవేక్షించడానికి వాహన తయారీదారులు వాహనాలకు ప్రత్యేక పరికరాన్ని తప్పనిసరిగా అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా తయారీ ఖర్చు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పలుమార్లు ధరలు పెరిగినప్పటికీ భారతదేశంలో అత్యధిక ప్యాసింజర్ కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. పెద్ద కార్లు, ఖరీదైన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు అధిక డిమాండ్ కారణంగా అమ్మకాలు పెరిగాయి. టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్, పంచ్ ఎస్‌యూవీలు 2022లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచాయి. -
భారీ నిధుల సమీకరణ బాటలో ఎస్బీఐ
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థికసంవత్సరంలో క్యాపిటల్ మార్కెట్ నుంచి నిధులు సమీకరణకు సిద్ధమవుతోంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) లేదా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని ఎస్బీఐ తెలిపింది. ఎఫ్‌పీఓ/క్విప్‌కు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. కనీసం ఆరు సంస్థలను నియమించాలని బ్యాంకు భావిస్తోంది. 'కేపిటల్ మార్కెట్స్‌లో క్యూఐపీ/ఎఫ్‌పీఓలను ఆఫర్ చేసేందుకు బ్యాంక్ సిద్ధమవుతోంది. ఎంతమేర నిధులను సమీకరించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మేనేజ్మెంట్ నిర్ణయాలు, షేర్ హోల్డర్ల అనుమతులను అనుసరించి ఇష్యూ సైజ్ నిర్ణయిస్తాం' అంటూ ఎస్బీఐ వర్గాలు వెల్లడించాయి. వివిధ అంశాల ఆధారంగా ఎంత మొత్తం నిధులు సమీకరించాలో తర్వాత నిర్ణయిస్తామని తెలియజేసింది. బ్యాంకు ఇప్పటికే రూ.15,000 కోట్లు సమీకరించానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదాన్ని కూడా పొందింది. బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ కోసం నలుగురు డైరెక్టర్లను ఎన్నుకోవడానికి వచ్చే నెల 15న వాటాదారుల సాధారణ సమావేశం జరగనున్నట్లు ఎస్బీఐ స్టాక్ ఎక్స్చేంజ్లకు అందించిన సమాచారంలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15వేల కోట్లను పబ్లిక్ ఆఫర్స్, విదేశాల నుంచి సేకరణ ద్వారా సమీకరించేందుకు ఎస్బీఐ ఇప్పటికే ఆర్బీఐ నుంచి అనుమతులు పొందింది. 6గురు మర్చంట్ బ్యాంకర్స్ ఈ ఇష్యూని నిర్వహిస్తారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. -
‘పెరిగిన ఆప్కో విక్రయాలు’
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆప్కో అమ్మకాలు జోరందుకున్నాయని ఆప్కో డీఎంఓ గురుప్రసాద్ శుక్రవారం ఒకప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల 3 నుంచి 50 శాతం రాయితీపై చేనేత వస్త్రాలు ఉంచడంతో అమ్మకాలు పెరిగాయన్నారు. 3 నుంచి 5 వరకు రోజుకు రూ.20 లక్షలు సేల్స్ అయ్యిందన్నారు. 6వ తేదీ మాత్రమే రూ.15 లక్షల విక్రయాలు జరిగాయన్నారు. తమ కేంద్రాలు బెంగుళూరు, మైసూరులో కూడా ఉన్నాయన్నారు. -
ప్రసవ వేదన
– ఏటా పెరుగుతున్న ప్రసూతి మరణాలు – ఆరేళ్లలో 358 కేసులు – తాజాగా మాతాశిశువు మృతి అనంతపురం మెడికల్ : మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కారణంగా మాతాశిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున గుత్తికి చెందిన సువర్ణ (20) మొదటి కాన్పులోనే రక్తహీనతతో ప్రసవ వేదన పడి బిడ్డతో సహా మత్యుఒడికి చేరింది. గుత్తి మండలం బేతాపల్లికి చెందిన ఆమె తన పుట్టిన ఊరు గుత్తికి ఐదు నెలల గర్భం ఉన్నప్పుడే వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడి ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పర్యవేక్షణ చేయాల్సి ఉంది. కానీ సువర్ణ విషయంలో సరిగా పర్యవేక్షణ లేదు. ఈ క్రమంలో ఆమె తీవ్ర రక్తహీనతకు గురైంది. నిబంధనల ప్రకారం ఏడో నెల నుంచి తప్పనిసరిగా ఏఎన్ఎంలు గర్భిణుల ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వివరాలను ఎంసీపీ (మదర్ చైల్డ్ ప్రొటెక్షన్) కార్డులో నమోదు చేయాలి. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. హైరిస్క్ కేసు అని తేలితే క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉంచాలి. 108 వాహనానికి ముందే సమాచారం ఇచ్చి ఉండాలి. ఈడీడీ (ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ) తెలుసుకుని ప్రసవానికి ఐదు రోజుల ముందు ఆస్పత్రిలో చేర్చాలి. సాధారణంగా ప్రసవ సమయానికి 10 ఎంజీ కన్నా ఎక్కువగా హిమోగ్లోబిన్ ఉండాలి. 6 ఎంజీ లోపల ఉంటే తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. 8 నుంచి 10 ఎంజీ మధ్యలో ఉంటే ఐరన్ సిప్రోజ్ ఇంజెక్షన్లు (మూడు నుంచి నాలుగు) వేయించేలా చూడడంతో పాటు ఐరన్ ఫోలిక్ మాత్రలు ఉదయం, రాత్రి వేసుకునేలా చేయాలి. కానీ సువర్ణ విషయంలో అడుగడుగునా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కన్పిస్తోంది. ఈమెకు ప్రసవం చేసే సమయానికి 5 ఎంజీ మాత్రమే హిమోగ్లోబిన్ ఉన్నట్లు సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ వెల్లడించారు. దీన్ని బట్టి ‘బర్త్‌ప్లాన్’ ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. సువర్ణ మతి విషయం తెలియగానే సూపరింటెండెండ్తో పాటు ఆర్ఎంఓ వైవీ రావు కాన్పుల వార్డుకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిద్రమత్తులో వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాలో ఒక బోధనాస్పత్రి, ఒక జిల్లా ఆస్పత్రి, 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో గర్భిణులకు మెరుగైన‡ సేవలు అందడం లేదు. సబ్ సెంటర్లలో కూడా గర్భిణుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపుతున్నారు. పట్టణాలు, నగరాల్లోనే∙ఏఎన్ఎంల పనితీరు ఘోరంగా మారింది. గర్భిణులకు నెలవారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు అందించాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో సక్రమంగా చేయడం లేదు. ఈ క్రమంలో ప్రసూతి మరణాలు కొనసాగుతున్నాయి. ఏడాది ప్రసూతి మరణాలు 2011–12 51 2012–13 58 2013–14 58 2014–15 85 2015–16 71 2016–17 35 (సెప్టెంబర్ వరకు) మొత్తం 358 -
రుణ సెక్యూరిటీల ద్వారా రూ.11 వేల కోట్లు
ముంబై: భారతీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ సెక్యూరిటీల ద్వారా రూ.11 వేలకోట్లకు పైగా సమకూర్చుకోనుంది. మూలధన సమీకరణకు నియమించిన డైరెక్టర్ల కమిటీ ఈమేరకు సమ్మతించిందని ఎస్బీఐ బీఎస్సీ ఫైలింగ్ లో తెలిపింది. ప్రైవేటు ప్లేస్మెంట్ ఆధారంగా రుణ సెక్యూరిటీలను సమీకరించుకోనుంది. ఎడిషనల్ టైర్ 1(ఏటీ1) మూలధనం కోసం బాసెల్-III కంప్లైంట్ డెట్ ఇన్ స్ట్రుమెంట్స్ పెంచనున్నట్టు పేర్కొంది. బుధవారం జరిగిన డైరెక్టర్ల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. విదేశీ లేదా భారతీయ పెట్టుబడిదారులను ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా అంగీకరించినట్టు పేర్కొంది. దీంతో ఎస్ బీఐ షేర్ ధర 0.08 శాతం లాభపడి రూ 254,80 వద్ద ఉంది. -
చైనా ఆ బడ్జెట్‌ను పెంచుతోంది!
బీజింగ్: చైనా తన రక్షణ బడ్జెట్‌ను ఏ ఏటికాఏడూ పెంచుకుంటూ పోతోంది. గత సంవత్సరం రక్షణ బడ్జెట్‌ను 10.1 శాతం పెంచిన చైనా.. ఈ ఆర్థిక సంవత్సరం కూడా రక్షణ రంగానికి భారీగానే కెటాయింపులు జరపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పార్లమెంట్.. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో వార్షిక బడ్జెట్ నివేదికను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అధికార ప్రతినిధి ఫు ఇంగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో 7 నుంచి 8 శాతం వరకు రక్షణ బడ్జెట్ పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ పెరుగుదలకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు శనివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నివేదికలో వెల్లడి కానున్నాయి. -
పన్ను మినహాయింపు పరిమితులు పెంచాలి
కేంద్రానికి బ్యాంకుల వినతి న్యూఢిల్లీ: ఆదాయ పను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు - 2.5 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోరాయి. అలాగే దేశీయంగా పొదుపును పెంచేందుకు.. ట్యాక్స్ ఫ్రీ డిపాజిట్ పథకాల లాకిన్ వ్యవధిని ఏడాదికి కుదించాలని విన్నవించాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన సందర్భంగా బ్యాంకర్లు ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. చౌక ఇళ్లకు ఇన్ఫ్రా రంగ పరిధిలోకి తెచ్చి ప్రాధాన్య హోదా కల్పించే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. మరోవైపు, వైద్యం, విద్య, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన తదితర అంశాలకోసం ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని సామాజిక సేవ సంస్థల ప్రతినిధులు తమ భేటీలో కోరారు. ఇందుకోసం పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాలు మొదలైన వాటిపై మరింత అధిక పన్ను విధించాలని పేర్కొన్నారు. -
అంగన్వాడీ ఉద్యోగులకు తీపి కబురు
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో జీతాల పెంపు నిర్ణయానికి ఆమోదం లభించింది. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సును ఆమోదించిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం అంగన్ వాడీ టీచర్లకు 7,200 రూపాయలు, వర్కర్లకు 5,460రూపాయల చొప్పున జీతాలు పెరగనున్నాయి. దీని వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 315 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని మంత్రి వర్గం తెలిపింది. మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు, పీతల సుజాత తదితర కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. -
ఉక్కు ధరల పెంపు!
న్యూఢిల్లీ: ఉక్కు కంపెనీలు ఉక్కు ఉత్పత్తుల ధరలను పెంచాలని యోచిస్తున్నాయి. టన్నుకు రూ. 1,000 చొప్పున వచ్చే నెల నుంచే ధరలు పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాల సమాచారం. ఇనుప ఖనిజం ధరలు, రవాణా వ్యయాలు, ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటంతో ధరలు పెంచక తప్పదనేది కంపెనీల వాదన. హాట్ రోల్డ్ కాయిల్(హెచ్ఆర్సీ) ఉత్పత్తుల ధరలు ప్రస్తుతమున్న రూ. 37,500ల స్థాయి నుంచి రూ. 38,500కు (టన్నుకు) పెరగవచ్చు. సెయిల్, ఎస్సార్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ తదితర ఉక్కు కంపెనీలు ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ధరలను టన్నుకు రూ. 2,500 చొప్పున పెంచాయి. ఆ తర్వాత ఎన్ఎండీసీ ఇనుప ఖనిజం ధరలను పెంచింది. ఇక రైల్వేలు కూడా టన్నుకు రూ. 100 చొప్పున రవాణా వ్యయాన్ని పెంచాయి. ఈ రెండు కారణాల వల్ల టన్ను ఉక్కు వ్యయం రూ. 700 వరకూ పెరుగుతుందని ఒక ప్రైవేట్ ఉక్కు కంపెనీ అధికారి పేర్కొన్నారు. అయితే మార్కెట్ మందగమనంలో ఉండడం, నిర్మాణ, వాహన, ఎలక్ట్రానిక్స్ రంగాల నుంచి డిమాండ్ తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఉక్కు కంపెనీలు ధరలను పెంచడానికి సాహసించలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా కూడా ఉక్కు ధరలు కూడా పెరుగుతున్నాయి.