అంగన్వాడీ ఉద్యోగులకు తీపి కబురు
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం హైదరాబాద్లో జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో జీతాల పెంపు నిర్ణయానికి ఆమోదం లభించింది. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సును ఆమోదించిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తాజా నిర్ణయం ప్రకారం అంగన్ వాడీ టీచర్లకు 7,200 రూపాయలు, వర్కర్లకు 5,460రూపాయల చొప్పున జీతాలు పెరగనున్నాయి. దీని వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 315 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని మంత్రి వర్గం తెలిపింది. మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు, పీతల సుజాత తదితర కేబినెట్ మంత్రులు హాజరయ్యారు.