ఉక్కు కంపెనీలు ఉక్కు ఉత్పత్తుల ధరలను పెంచాలని యోచిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఉక్కు కంపెనీలు ఉక్కు ఉత్పత్తుల ధరలను పెంచాలని యోచిస్తున్నాయి. టన్నుకు రూ. 1,000 చొప్పున వచ్చే నెల నుంచే ధరలు పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాల సమాచారం. ఇనుప ఖనిజం ధరలు, రవాణా వ్యయాలు, ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటంతో ధరలు పెంచక తప్పదనేది కంపెనీల వాదన. హాట్ రోల్డ్ కాయిల్(హెచ్‌ఆర్‌సీ) ఉత్పత్తుల ధరలు ప్రస్తుతమున్న రూ. 37,500ల స్థాయి నుంచి రూ. 38,500కు (టన్నుకు) పెరగవచ్చు.
సెయిల్, ఎస్సార్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ తదితర ఉక్కు కంపెనీలు ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ధరలను టన్నుకు రూ. 2,500 చొప్పున పెంచాయి. ఆ తర్వాత ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ధరలను పెంచింది. ఇక రైల్వేలు కూడా టన్నుకు రూ. 100 చొప్పున రవాణా వ్యయాన్ని పెంచాయి. ఈ రెండు కారణాల వల్ల టన్ను ఉక్కు వ్యయం రూ. 700 వరకూ పెరుగుతుందని ఒక ప్రైవేట్ ఉక్కు కంపెనీ అధికారి పేర్కొన్నారు. అయితే మార్కెట్ మందగమనంలో ఉండడం, నిర్మాణ, వాహన, ఎలక్ట్రానిక్స్ రంగాల నుంచి డిమాండ్ తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఉక్కు కంపెనీలు ధరలను పెంచడానికి సాహసించలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా కూడా ఉక్కు ధరలు కూడా పెరుగుతున్నాయి.