
సాక్షి, వెబ్‌డెస్క్: అద్దె ఇళ్లలో ఉండే సవాలక్ష నిబంధనలకు తోడు కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో సొంతిళ్లు అవసరమనుకునే వారి సంఖ్య పెరిగింది. అప్పు చేసైనా సరే ఇది నా ఇల్లు అనిపించుకుందామనే ప్రయత్నాలు పెరిగాయి. అయితే అంతకు ముందే ఇంటి నిర్మాణ రంగంలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సొంతింటికి కల మరోసారి మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతోంది.
స్టీలు ధరలకు రెక్కలు
ఇంటి నిర్మాణ రంగంలో కీలకమైన స్టీలు ధరలు ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. లాక్‌డౌన్ కంటే ముందు హోల్‌సేల్ మార్కెట్‌లో 8 మిల్లీమీటరు స్టీలు టన్ను ధర రూ.42,000 ఉండగా ఇప్పుడు టన్ను స్టీలు ధర రూ.57,00లకు చేరుకుంది. ఇదే తరహాలో సిమెంటు బ్యాగు ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. వీటితో పాటు ఇంటి నిర్మాణంలో కీలకమైన కాపర్ ధర 40 శాతం, అల్యుమినియం ధర 60 శాతం పెరిగినట్టు డెవలపర్లు చెబుతున్నారు.
డిమాండ్ పెరిగింది
కరోనా కల్లోల సమయంలో అద్దె ఇళ్లలో ఎదురైన ఇబ్బందులతో సొంత ఇల్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్‌మెంట్లకు డిమాండ్ పెరిగింది. అయితే పెరిగిన ధరలు వారికి షాక్ ఇస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే సేవింగ్స్ చాలా ఖర్చుకావడం, ఎక్కువ మందికి జీతాల్లో కోతలు పడ్డాయి. ఈ తరుణంలో లోన్లు తీసుకుని ఇళ్లు కొందామనుకునే వారికి పెరుగుతున్న ధరలు అశనిపాతంలా మారాయి.
కట్టాలన్నా కష్టమే
డెవలపర్లు ఒకేసారి పెద్ద ఎత్తున సిమెంటు, స్టీలు కొనడం వల్ల హోల్‌సేల్ ధరలకు లభిస్తున్నాయి. కానీ జిల్లా కేంద్రాలు, ఇతర చిన్న పట్టణాల్లో ఇంటి నిర్మాణం స్వంతంగా చేపట్టాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్‌లో టన్ను స్టీలు ధర 65,000 దగ్గర ఉంది. సిమెంటు బ్యాగు రూ. 400 దగ్గర లభిస్తోంది. దీంతో సొంతింటి కల భారంగా మారుతోంది.
పెరిగిన లేబర్ కష్టాలు
గతంలో బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిషాల నుంచి లేబర్ పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌తో పాటు పెద్ద ప్రాజెక్టులు, జిల్లా కేంద్రాల్లో పనికి వచ్చే వారు. లోకల్ లేబర్‌తో పోల్చితే వీరు తక్కువ కూలీలకే పనులకు వచ్చేవారు. వరుస లాక్‌డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన లేబర్‌లో చాలా మంది అక్కడే ఉండి పోయారు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల కొరత ఏర్పడింది. డబుల్ కూలీ ఇస్తే తప్ప లేబర్ దొరికే పరిస్థితి లేదంటున్నారు డెవలపర్స్.
30 శాతం పెరుగుతాయి
కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. మరోవైపు క్రమంగా నిర్మాణ రంగం కూడా గాడిన పడుతోంది. ధీర్ఘకాలం పాటు మధ్యలో ఆగిపోయిన భవనాల్లో తిరిగి పనులు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్‌మెంట్ల ధరలు పెరిగిన మాట వాస్తవమేని, అయినా సరే ఇప్పుడు ఇళ్లు కొనడమే మంచిందని, పెరిగిన ముడి పదార్థాల ధరల వల్ల రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు కనీసం 30 శాతం వరకు పెరగవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు అంటున్నారు.
స్టీలు ధరల పెరుగుదల (టన్ను ధర )
స్టీలు సైజు 2020 ఫిబ్రవరి 2021 ఆగస్టు
8 ఎంఎం రూ.42,000 రూ.57,000
10 ఎంఎం రూ. 41,000 రూ.56,000
12 ఎంఎం రూ.40,5000 రూ 56,000
14 ఎంఎం రూ.41,000 రూ.56,000
16 ఎంఎం రూ.41,000 రూ. 56,000
Comments
Please login to add a commentAdd a comment