సాక్షి, గుంటూరు: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి గృహ నిర్మాణంపై ప్రత్యేక ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పటి వరకు గృహ నిర్మాణంపై దృష్టి సారించని సర్కారు రాబోయే రెండు నెలల్లో లక్ష్యాలు పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల ఓట్లకు గాలం వేస్తూ ఇళ్లు నిర్మించుకోలేని వారికి గృహ నిర్మాణ సామగ్రి పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. నిబంధనల మేరకు 250 చదరపు అడుగుల్లో నిర్మించుకునే లబ్ధిదారులకు సామగ్రి అందించాలని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
శ్లాబు దశకు చేరుకున్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకొనేందుకు లబ్ధిదారులకు అవసరమైన సిమెంటు, ఇసుక, చిప్స్, స్టీల్ తదితర మెటీరియల్‌ను అందించనున్నారు. జిల్లాలో శ్లాబు దశ(రూఫ్ లెవల్)లో ఉన్న గృహాలు 4,729 వరకు ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకొనేందుకు అవసరమైన మెటీరియల్ అందించనున్నారు. అయితే జిల్లాలో లబ్ధిదారులు తమ స్థోమతను బట్టి ఇంటి విస్తీర్ణం పెంచుకునేందుకు అదనపు సొమ్ము వెచ్చిస్తున్నారు. 250 చదరపు అడుగుల్లో నిర్మించే ఇంటికి మాత్రమే అవసరమైన సామగ్రిని అందిస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. మామూలుగా అయితే ముందుగా లబ్ధిదారులు తమ సొమ్ము వెచ్చిస్తేనే బిల్లులు మంజూరు చేస్తారు. ప్రభుత్వం అందించే నిర్మాణ సామగ్రికి అయ్యే ఖర్చును మినహాయించుకుని బిల్లులు మంజూరు చేయనున్నారు.
జిల్లాలో 60 వేలకు పైగా నిర్మాణం ప్రారంభం కాని గృహాలు
జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణం నత్తనడకన సాగుతుంది. ఇందిరమ్మ గృహ నిర్మాణం ప్రారంభమై ఏడేళ్లు దాటుతోంది. అన్ని దశల్లోనూ ఇప్పటివరకు 2,84,574 గృహాలు మంజూరు చేయగా, 2,24,541 గృహాలు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. ఇంకా 60,033 గృహాలు ఇంతవరకు నిర్మాణాలు ప్రారంభించలేదు. 2009 వరకు ఇందిరమ్మ గృహ నిర్మాణం మూడు దశల్లోనూ వేగవంతంగా జరిగి ఆ తర్వాత మందగించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓసీ, బీసీలకు గృహ నిర్మాణం యూనిట్‌కు రూ.70 వేలు, అర్బన్‌లో రూ.80 వేలు, ఎస్సీలకు గ్రామీణ, అర్బన్‌లో కలిపి రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షలు మంజూరు చేస్తున్నారు. రచ్చబండ-1, 2లలో గృహ నిర్మాణం కింద 1.26 లక్షలు దరఖాస్తులు అందాయి.
వీటిలో ఇప్పటికే 76 వేల దరఖాస్తులకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల జరిగిన రచ్చబండ-3లో జిల్లాలో మరో 86వేల దరఖాస్తులు అందాయి. రచ్చబండ-1, 2లలో అందిన దరఖాస్తుల్లో 76 వేలకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వగా, మిగిలిన 50 వేల దరఖాస్తులకు మంజూరు ఇవ్వాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి. గ్రామసభల ద్వారా గృహ నిర్మాణం వేగవంతం చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. గృహాలకు ప్రభుత్వ నిర్మాణ సామగ్రిపై రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని, జిల్లాలో రూఫ్ లెవల్లో ఉన్న గృహాలకు ప్రాధాన్యం ఇస్తూ సర్వే నిర్వహిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ పీడీ సురేష్‌కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. శ్లాబు దశలో ఉన్న గృహాలు 4,729 గుర్తించామని వీటికి నిర్మాణ సామగ్రి అందించేందుకు నిర్ణయించామన్నారు.
ఎన్నికల వేళ..గృహనిర్మాణ హేల
Published Mon, Jan 6 2014 12:02 AM | Last Updated on Tue, Mar 19 2019 6:15 PM
Advertisement