
న్యూఢిల్లీ: రెండు సంవత్సరాలుగా పెరుగుతూ వస్తున్న స్టీల్ ధరలు తిరిగి తిరోగమన బాట పట్టే అవకాశం ఉందని క్రిసిల్ తాజా నివేదిక అంచనావేసింది. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చి చివరినాటికి టన్నుకు గరిష్ట స్థాయిలో రూ.70,000కు చేరిన స్టీల్ ధర, 2023 మార్చి నాటికి రూ.60,000కు దిగిరావచ్చని పేర్కొంది. అయితే ధరలు నిట్టనిలువునా పడిపోయే పరిస్థితి లేదని, క్రమంగా దిగిరావచ్చని అంచనావేసింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
- స్టీల్ ధర ఇంకా అధికంగానే, కరోనా ముందస్తుకన్నా ఎక్కువ స్థాయిలోనే ఉంది. సరఫరాల్లో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చైనాలో డీకార్బనైజేషన్ చర్యలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నుండి ఉత్పన్నమయ్యే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అధిక స్థాయిలో ఉన్న ముడిసరుకు ధర దీనికి కారణం. ఎగుమతుల్లో ఇప్పటి వరకూ ఉన్న సానుకూల పరిస్థితులూ అధిక ధరలకు మద్దతునిస్తున్నాయి.
- వచ్చే నెలలో రుతుపవనాల ప్రారంభం కారణంగా ధరల సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. నిర్మాణాలు నిలిచిపోయే అవకాశం వల్ల, డిమాండ్ తగ్గడం ఇందుకు ఒక కారణం కావచ్చు. అలాగే దేశీయ మిల్లులు ఎగుమతుల నుండి పొందే తక్కువ ప్రీమియం ధరల తగ్గుదలకు దారితీసే వీలుంది.
- కాగా ఒక్క ఫ్లాట్ స్టీల్ విషయానికి వస్తే, 2021–22లో 50 శాతానికి పైగా పెరిగాయి. ఈ పెరుగుదల ఈ ఆర్థిక సంవత్సరంలో 3–5 శాతానికి పరిమితం కావచ్చు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూలై) ఈ రంగం కొంత రికవరీని చూడవచ్చు. అయితే ఈ రికవరీ (శాతాల్లో)కి లో బేస్ కారణం అవుతుంది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. నిజానికి వినియోగ సెంటిమెంట్ బలహీనంగానే ఉంది. అదిక ఇన్‌పుట్ వ్యయాల వల్ల వినియోగదారు కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు. ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణం సమస్యలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ భవిష్యత్తులో ధరల తగ్గుదలకు దరితీసే అంశాలే.
- ఏప్రిల్ నుండి హాట్–రోల్డ్ కాయిల్ ధరలు యూరప్, అమెరికాల్లో 25 శాతంపైగా క్షీణించాయి, మార్చి మధ్యన టన్నుకు 1,600 గరిష్ట స్థాయికి చేరిన ధర తర్వాత 1,150–1,200 డాలర్లకు తగ్గింది.
- స్టీల్ తయారీలో కీలక ముడి పదార్థమైన కోకింగ్ కోల్ ధర భారీగా పెరడం గమనార్హం. గత ఫిబ్రవరిలో టన్నుకు 455 డాలర్లు పలికిన కోకింగ్ కోల్ ధర కేవలం మూడు వారాల్లో టన్నుకు 47 శాతం ఎగసి 670 డాలర్లకు చేరింది. గరిష్ట స్థాయిల నుంచి ధర తగ్గినా, ప్రస్తుతం 500 డాలర్ల వద్ద పటిష్ట డిమాండ్ ఉంది. ఆయా అంశాలు దేశీయంగా స్టీల్ ధర తీవ్రతకు కారణం. కోవిడ్–19ను మహమ్మారిగా ప్రకటించిన 2020 మార్చితో పోల్చితే 2022 ఏప్రిల్ నాటికి ధ ర 95% ఎగసి టన్నుకు రూ.76,000కు చేరింది.
- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుండి బలమైన దేశీయ డిమాండ్ నేపథ్యంలో భారతీయ ఉక్కు రంగ అవుట్‌లుక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఉండనుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) ఇటీవలి తన తాజా నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ డిమాండ్ అనిశ్చితి ఆందోళనల నేపథ్యంలోనూ దేశీయ పరిశ్రమ దృఢంగా ఉంటుందన్న భరోసాను ఇండ్–రా వెలిబుచ్చింది.
చదవండి: వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు