న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఉన్న హెచ్‌యూఎల్, విప్రో వంటి ప్రముఖ సంస్థలు సబ్బుల ధరలను దాదాపు 7–8 శాతం పెంచాయి. సబ్బుల తయారీలో కీలక ముడిసరుకు అయిన పామాయిల్ ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గడంతో హెచ్‌యూఎల్, టాటా కంజ్యూమర్ వంటి కంపెనీలు ఇటీవల టీ ధరలను పెంచాయి.
సెప్టెంబరు త్రైమాసికం ఎర్నింగ్ కాల్స్ సందర్భంగా అనేక లిస్టెడ్ కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి ప్రస్తుత త్రైమాసికంలో సబ్బుల ధరల సవరణ ఉంటుందని సూచనగా తెలిపాయి. పామాయిల్, కాఫీ, కోకో వంటి ముడిసరుకు ప్రియం కావడమే ఇందుకు కారణం. పామాయిల్ డెరివేటివ్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి 30 శాతం దూసుకెళ్లాయని విప్రో కంజ్యూమర్ కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ ఖత్రీ తెలిపారు.
ఇతర ఉత్పత్తులు సైతం..
దిగుమతి సుంకం అధికం కావడం, అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా సెప్టెంబర్ మధ్య నుండి పామాయిల్ ధరలు దాదాపు 35–40 శాతం ఎగశాయి. హెచ్‌యూఎల్ కంపెనీకి చెందిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు సైతం ప్రియం అయ్యాయి. టీ వంటి విభాగాలలో దశలవారీగా ధరలను 25–30 శాతం పెంచినట్టు టాటా కంజ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజా గత వారం వెల్లడించారు.
వినియోగదార్లపై ఒకేసారి భారం మోపకూడదని తమ యాజమాన్యం నిర్ణయించినట్టు గోద్రెజ్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ వెల్లడించింది. 5 యూనిట్ల ప్యాక్ లక్స్ సబ్బుల ధర రూ.145 నుంచి రూ.155కి, లైఫ్‌బాయ్ రూ.155 నుంచి రూ.165కి చేరాయి. 4 యూనిట్ల పియర్స్ ప్యాక్ రూ.149 నుండి రూ.162కి దూసుకెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment