స్థిరమైన ఆదాయంతోపాటు భవిష్యత్తుకు భద్రతనిచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆసక్తి ఉన్న వారికి శుభవార్త. ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తమ వద్ద చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీని పెంచాయి. మెరుగైన వడ్డీ రేటు కోసం చూస్తున్నవారికి ఇదే మంచి సమయం. పలు బ్యాంకులు వివిధ కాల వ్యవధులు, డిపాజిట్ మొత్తాన్ని బట్టి 8 శాతం వరకూ వార్షిక వడ్డీని అందిస్తున్నాయి.
కీలకమైన రెపో రేటును 6.5 వద్దే యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ రానున్న నెలల్లోనూ అలాగే ఉంచుతుందన్న అంచనాల నేపథ్యంలో కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఆయా బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లలో ప్రకటించిన ఎఫ్‌డీ రేట్లు ఇక్కడ అందిస్తున్నాం..
వివిధ బ్యాంకుల ఎఫ్‌డీ రేట్లు ఇవే..
- డిసెంబర్‌లో ఎఫ్‌డీలపై వడ్డీ రేటును పెంచిన మొదటి బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిసెంబర్ 1 నుంచి తమ ఎఫ్‌డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్లు, ఆపైన, రూ. 10 కోట్ల లోపు డిపాజిట్ చేసే దేశీయ కస్టమర్లకు ఒక సంవత్సరం కాలవ్యవధికి 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
- ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు డిపాజిట్లపై ఎఫ్‌డీ రేట్లను సవరించింది. ఏడు నుంచి 14 రోజుల వ్యవధికి కనిష్టంగా 4.75 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల వరకు వ్యవధిపై గరిష్టంగా 7.25 శాతం వడ్డీ అందిస్తోంది. ఇవి డిసెంబరు 13 నుంచి అమలులోకి వస్తాయి.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా రూ. 5 కోట్లకు మించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఏడు నుంచి 14 రోజుల కాలవ్యవధికి కనిష్టంగా 4.75 శాతం, ఏడాది నుంచి 15 నెలల వరకు గరిష్టంగా 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. డిసెంబర్ 13 నుంచి మారిన రేట్ల ప్రకారం.. రూ. 100 కోట్ల నుండి రూ. 500 కోట్లకు మించిన ఎఫ్‌డీలపై వడ్డీ ఇప్పుడు 7.35 శాతం నుండి 7.30 శాతానికి చేరుకుంది.
- కోటక్ మహీంద్రా బ్యాంక్ డిసెంబర్ 11 నుంచి రూ. 2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 85 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సాధారణ కస్టమర్ల కోసం కూడా ఎఫ్‌డీ రేట్లు వివిధ కాల వ్యవధులకు 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి. సీనియర్ సిటిజన్లు ఇప్పుడు 23 నెలల నుండి రెండు సంవత్సరాల వరకు 7.80 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చు. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ చేసే సాధారణ కస్టమర్లకు 23 నెలల ఒక రోజు నుంచి రెండేళ్ల లోపు కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది.
- ఫెడరల్ బ్యాంక్ కూడా తన డిపాజిట్ రేట్లను సవరించింది. రెసిడెంట్ , నాన్-రెసిడెంట్ డిపాజిట్లకు వర్తించే 500 రోజుల కాలవ్యవధికి 7.50 శాతం రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే 8.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
- డీసీబీ బ్యాంక్ డీసీబీ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచింది. డిసెంబరు 13 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రేట్ల ప్రకారం.. 25 నెలల నుండి 26 నెలల కాలవ్యవధితో సాధారణ డిపాజిట్లపై 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.60 శాతం అత్యధిక వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment