పన్ను మినహాయింపు పరిమితులు పెంచాలి
కేంద్రానికి బ్యాంకుల వినతి
న్యూఢిల్లీ: ఆదాయ పను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు - 2.5 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోరాయి. అలాగే దేశీయంగా పొదుపును పెంచేందుకు.. ట్యాక్స్ ఫ్రీ డిపాజిట్ పథకాల లాకిన్ వ్యవధిని ఏడాదికి కుదించాలని విన్నవించాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన సందర్భంగా బ్యాంకర్లు ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి.
చౌక ఇళ్లకు ఇన్‌ఫ్రా రంగ పరిధిలోకి తెచ్చి ప్రాధాన్య హోదా కల్పించే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. మరోవైపు, వైద్యం, విద్య, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన తదితర అంశాలకోసం ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని సామాజిక సేవ సంస్థల ప్రతినిధులు తమ భేటీలో కోరారు. ఇందుకోసం పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాలు మొదలైన వాటిపై మరింత అధిక పన్ను విధించాలని పేర్కొన్నారు.