బ్రాంచ్ల మూతకు ఎస్బీఐ ప్లాన్
ముంబై : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన బ్రాంచులను తగ్గించుకునే ప్రణాళికను రచిస్తోంది. తన గ్రూపు నుంచి 30 శాతం బ్రాంచులను పునర్ నిర్మించుకోవడం లేదా మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ మెకిన్సే సూచన మేరకు ఎస్బీఐ ఈ మేరకు అడుగులు వేయనున్నట్టు సమాచారం. బ్రాంచ్ అప్టిమైజేషన్కు మెకిన్సేను సలహాదారుగా నియమించామని ఎస్బీఐ ఎండీ రాజ్నీష్ కుమార్ స్పష్టంచేశారు. అయితే బ్రాంచుల సైజు తగ్గించడంపై మాత్రం వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. బ్రాంచ్ల, ఏటీఎమ్ల అప్టిమైజేషన్ కోసం, వినియోగదారులకు మెరుగైన అనుభవాలు అందించడానికి మెకిన్సేతో కలిశామని కుమార్ వెల్లడించారు. యాక్సేంచర్ ఫైనాన్సియల్ సర్వీసులతో కూడా తాము కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు.
బ్రాంచుల అప్టిమైజేషన్ చర్యలో భాగంగా, ఎస్బీఐ ఇటీవలే తన 400 బ్రాంచులను మూసివేయడం లేదా పునర్ నిర్మించుకోవడం చేసింది. దీంతో బ్యాంకు తన వ్యయాలను తగ్గించుకుంది. కొత్త బ్రాంచులను కలుపుకోవడాన్ని యేటికేటికి తగ్గిస్తూ వస్తున్న ఎస్బీఐ..గతేడాది కేవలం 451 బ్రాంచులనే జోడించుకుంది. ప్రస్తుతం ఈ బ్యాంకు 16,784 బ్రాంచులు కలిగిఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంతో ముగిసే లోపు ఐదు అనుబంధ బ్యాంకుల, భారతీయ మహిళా బ్యాంకు విలీన ప్రక్రియతో మరో 6,978 బ్రాంచులు తనలో కలుపుకోనుంది
అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియతో వ్యయాలు కచ్చితంగా తగ్గుతాయని కుమార్ తెలిపారు. లేకపోతే విలీనాన్ని తామెందుకు ప్రతిపాదిస్తామన్నారు. బ్రాంచుల కొత్త ఫార్మాట్ కోసం బ్యాంకు యోచిస్తోందని వెల్లడించారు. 133 ఇన్ టచ్ బ్రాంచులను సెల్ఫ్ సర్వీసు మోడ్ లో వివిధ రకాల ఆన్లైన్ సేవలు అందించడానికి ఎస్బీఐ ప్రారంభించింది. ఒక్కసారి విలీన ప్రక్రియ పూర్తయితే కంపెనీ రూ.37లక్షల కోట్ల అసెట్ బేస్తో, 24వేల బ్రాంచులు, 58వేల ఏటీఎమ్లుగా బ్యాంకు ఆవిర్భవించనుంది. .