పుస్తకాలే కంచాలుగా మధ్యాహ్న భోజనం
'టంగ్..' అంటూ లంచ్ బెల్ మోగింది. విద్యార్థులంతా పరుగున వచ్చి వరుసగా కూర్చున్నారు. అప్పటికే సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనం వడ్డింపు మొదలైంది. ఒక్కొక్కరు తమ నోటు పుస్తకాల్లోని మధ్య పిన్నుపేజీని చింపి, నేలపై ఉంచారు. ఆ పేపర్లలోకి అన్నం, పప్పు వచ్చి పడ్డాయి. ఆకలితో ఉన్న ఆ పిల్లలు.. అన్నంలోకి రాళ్లు చేరకుండా జాగ్రత్తగా ఒక్కో ముద్ద కలుపుకొని తిన్నారు. లంచ్ పూర్తయిన తర్వాత ఆ పేపర్లను చెత్తబుట్టలో పారేసి, మరో పేపర్తో చెయ్యి, మూతి తుడుచుకున్నారు. ఇది.. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా పర్సౌరియా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో నిత్యకృత్యం!
మొత్తం 375 మంది విద్యార్థులున్న ఆ స్కూలులో మధ్యాహ్నభోజనం చేసేందుకు పిల్లలకు కంచాలు లేవు. ఇంటి నుంచి తెచ్చుకుందామా అంటే స్కూల్ ఆవరణలో నీళ్లు లేవు! దీంతో వారు నోటు పుస్తకాల పేజీలు, న్యూస్ పేపర్లలో మధ్యాహ్నభోజనం చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమంటే గోధుమ పిండి సరఫరా ఆగిపోవడంతో గడిచిన రెండు నెలల నుంచి మధ్యాహ్నం భోజనంలో వాళ్లకు బాగా అలవాటైన రొట్టెలకు బదులు అన్నం, పప్పు అందిస్తున్నారు. ఇది విద్యార్థుల బాధలను మరింత రెట్టింపు చేసింది.
అసలు ఇంతటి ఆటవిక పరిస్థితులు ఎలా తలెత్తాయని ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎంఎల్. ఆశీర్వర్ను అడిగితే.. 'నేను ఈ స్కూలులో చేరి మూడేళ్లయింది. ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలైంది. పిల్లలు పేపర్లలో భోజనం చేయడం నాకూ బాధగానే ఉంటుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశా. పప్పు భోజనం రోజైతే మరీ సమస్యగా ఉంటుంది. వెంటనే గోధుమ పిండి పంపాలని కూడా అభ్యర్థించా' అని సమాధానమిచ్చారు.
ఇదే విషయాన్ని మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్టు అధికారి ప్రద్యుమ్నా చౌర్యా వద్ద ప్రస్తావించగా ఆయన మరోలా స్పందించారు. 'ఆ పాఠశాలలో కంచాలు లేవని ఇదివరకే ఫిర్యాదు అందింది. దీంతో వాటి కొనుగోలు కోసం రూ. 2,400 మంజూరు చేశాం కూడా. ఆ నిధులు ఏమయ్యాయో తేలాలి. తాజా ఘటనపై విచారణ చేయిస్తాం' అని చెప్పారు.
'ఆ స్కూలు విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రభుత్వం కంచాలు ఇవ్వలేదు. సరే, ఇంట్లో నుంచైనా తీసుకువెళదామంటే నీళ్ల సమస్య. తాగడానికి ఒక్క చుక్క దొరికితేనే గగనం, అలాంటిది కంచాలు కడుక్కోవడానికి ఎక్కడి నుంచి వస్తాయి. అందుకే మరో దారి లేక పిల్లలు ఇలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో భోజనాలు చేస్తున్నారు' అని స్థానిక సామాజిక కార్యకర్త హర్గోవింద్ ప్రజాపతి చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పిల్లలకు కంచాలు, స్కూల్లో తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.