
జోలపాటా.. నీకు జోహార్!
జో అచ్యుతానంద జో.. జో.. ముకుందా! లాలి పరమానంద రామగోవిందా.. జో..! జో..!! అంటూ తల్లిపాడే జోలపాట వినందే నిద్రపోనివారు మనలో ఎంతోమంది ఉంటారు. ఇప్పటిదాకా ఈ జోలపాట బుజ్జి పాపాయిని నిద్రపుచ్చడానికే ఉపయోగపడుతుందని అనుకున్నాం. కానీ.. ఈ జోలపాటతో మరెన్నో లాభాలున్నాయని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. అవేంటంటే..
బుజ్జిపాపాయిని బజ్జోపెట్టే జోలపాటలో పదాలు వేరైనా, రాగం వేరైనా మాధుర్యం మాత్రం ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఒకేలా ఉంటుంది. అసలు ఈ ప్రపంచం గురించి ఏమీ తెలియని ఆ చిన్నారి జోలపాట వినగానే నిద్రపోతుంది. అదీ తల్లిపాడిన పాటైతే మరింత ఆస్వాధిస్తూ నిద్రిస్తుంది. ఇంతకీ జోలపాటలో అంత గొప్పదనమేముంది? శిశువును ఊరుకోబెట్టే మంత్రశక్తి జోలపాటకు ఎక్కడిది? జోలపాటవల్ల ఇంకా ఏయే ఉపయోగాలున్నాయి? అనే విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు బోలెడు ఉపయోగాలు తెలిసొచ్చాయట.
బిడ్డను నిద్రపుచ్చే జోలపాట... తల్లిలోని ఎన్నో భావోద్వేగాలను నియంత్రిస్తుందట. జోలపాట పాడేటప్పుడు తల్లి అన్నీ మర్చి.. కేవలం పిల్లాడిపైనే దృష్టినంతా కేంద్రీకరించి పాట పాడడం వల్ల ప్రతికూల భావాలను నియంత్రించుకునే శక్తిని పొందుతుందట. ఒత్తిడిని కూడా అధిగమిస్తుందట. అదే సమయంలో ఈ పాట ద్వారా శిశువు అనేక రకాల జ్ఞానాన్ని పొందుతాడని, తల్లిపట్ల ఆకర్షితుడవుతాడని, పలురకాల ప్రేరేపణలను అర్థం చేసుకునే శక్తిని పొందుతాడనితేలింది. తల్లిపాటలోని హెచ్చుతగ్గులు పిల్లల్లో అనేక భావాలను కలుగజేస్తాయని మియామి వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షానన్ తెలిపారు. భావయుక్తంగా, రాగయుక్తంగా జోలపాట పాడేం దుకు తల్లి ప్రొఫెషనల్ సింగరే కావాల్సిన అవసరం లేదని, పిల్లల మీద చూపే ప్రేమాప్యాయతలు జోలపాటను మధురంగా మార్చేస్తాయన్నారు. అందుకే ప్రపంచంలోని అన్ని జోలపాట లూ మధురంగానే అనిపిస్తాయని చెప్పారు.
- సాక్షి, స్కూల్ ఎడిషన్