jyo achyutananda
-
జోలపాటా.. నీకు జోహార్!
జో అచ్యుతానంద జో.. జో.. ముకుందా! లాలి పరమానంద రామగోవిందా.. జో..! జో..!! అంటూ తల్లిపాడే జోలపాట వినందే నిద్రపోనివారు మనలో ఎంతోమంది ఉంటారు. ఇప్పటిదాకా ఈ జోలపాట బుజ్జి పాపాయిని నిద్రపుచ్చడానికే ఉపయోగపడుతుందని అనుకున్నాం. కానీ.. ఈ జోలపాటతో మరెన్నో లాభాలున్నాయని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. అవేంటంటే.. బుజ్జిపాపాయిని బజ్జోపెట్టే జోలపాటలో పదాలు వేరైనా, రాగం వేరైనా మాధుర్యం మాత్రం ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఒకేలా ఉంటుంది. అసలు ఈ ప్రపంచం గురించి ఏమీ తెలియని ఆ చిన్నారి జోలపాట వినగానే నిద్రపోతుంది. అదీ తల్లిపాడిన పాటైతే మరింత ఆస్వాధిస్తూ నిద్రిస్తుంది. ఇంతకీ జోలపాటలో అంత గొప్పదనమేముంది? శిశువును ఊరుకోబెట్టే మంత్రశక్తి జోలపాటకు ఎక్కడిది? జోలపాటవల్ల ఇంకా ఏయే ఉపయోగాలున్నాయి? అనే విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు బోలెడు ఉపయోగాలు తెలిసొచ్చాయట. బిడ్డను నిద్రపుచ్చే జోలపాట... తల్లిలోని ఎన్నో భావోద్వేగాలను నియంత్రిస్తుందట. జోలపాట పాడేటప్పుడు తల్లి అన్నీ మర్చి.. కేవలం పిల్లాడిపైనే దృష్టినంతా కేంద్రీకరించి పాట పాడడం వల్ల ప్రతికూల భావాలను నియంత్రించుకునే శక్తిని పొందుతుందట. ఒత్తిడిని కూడా అధిగమిస్తుందట. అదే సమయంలో ఈ పాట ద్వారా శిశువు అనేక రకాల జ్ఞానాన్ని పొందుతాడని, తల్లిపట్ల ఆకర్షితుడవుతాడని, పలురకాల ప్రేరేపణలను అర్థం చేసుకునే శక్తిని పొందుతాడనితేలింది. తల్లిపాటలోని హెచ్చుతగ్గులు పిల్లల్లో అనేక భావాలను కలుగజేస్తాయని మియామి వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షానన్ తెలిపారు. భావయుక్తంగా, రాగయుక్తంగా జోలపాట పాడేం దుకు తల్లి ప్రొఫెషనల్ సింగరే కావాల్సిన అవసరం లేదని, పిల్లల మీద చూపే ప్రేమాప్యాయతలు జోలపాటను మధురంగా మార్చేస్తాయన్నారు. అందుకే ప్రపంచంలోని అన్ని జోలపాట లూ మధురంగానే అనిపిస్తాయని చెప్పారు. - సాక్షి, స్కూల్ ఎడిషన్ -
ప్రముఖ నిర్మాత కార్యాలయంపై ఐటీ దాడులు
హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత కొర్రపాటి సాయి కార్యాలయంపై బుధవారం ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో తొమ్మిది చోట్ల దాడులు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఐటీశాఖ అధికారులు తనిఖీ చేసినట్లు సమాచారం. కాగా నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ’ జ్యో అచ్యుతానంద’ చిత్రాన్ని కొర్రపాటి సాయి నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా వారాహి చలన చిత్రం బ్యానర్‌పై కొర్రపాటి సాయి 'ఈగ', 'అందాల రాక్షసి', 'లెజెండ్', 'ఉహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్యా', 'తుంగభద్ర' వంటి హిట్ చిత్రాలను అందించారు. ఇక ఐటీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కంగారు మొత్తం పోయింది : అవసరాల శ్రీనివాస్
‘‘ ‘జ్యో అచ్యుతానంద’ చిత్రకథ రాసుకునేటప్పుడు, చిత్రీకరణ సమయంలో కాన్ఫిడెన్స్‌తో ఉండేవాణ్ణి. కానీ, సినిమా విడుదల టైమ్‌లో బాగా ఒత్తిడికి గురయ్యా. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించిన తీరు చూసి ఆ కంగారు మొత్తం పోయింది. రిలీఫ్ అనిపించింది’’ అని దర్శకుడు శ్రీనివాస్ అవసరాల అన్నారు. నాగశౌర్య, నారా రోహిత్, రెజీనా ప్రధాన పాత్రల్లో అవసరాల దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ‘జ్యో అచ్యుతానంద’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ -‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’కి ఎంతటి ప్రేక్షకాదరణ లభించిందో, ఈ చిత్రానికీ అంత రెస్పాన్స్ రావడం హ్యాపీ. ఈ చిత్రం చూసిన కొందరు ‘నాకూ ఓ అన్నయ్య.. తమ్ముడు ఉండుంటే బాగుండేది’ అని మెసేజ్‌లు పంపారు’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి చూశా. వారు ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీలయ్యా’’ అని రెజీనా అన్నారు. కెమెరామ్యాన్ వెంకట్ సి.దిలీప్, సంగీత దర్శకుడు కల్యాణి రమణ తదితరులు పాల్గొన్నారు. -
‘జ్యో అచ్యుతానంద’ కలెక్షన్స్ అదుర్స్
‘జ్యో అచ్యుతానంద’ సినిమా అమెరికాలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా దూసుకెళుతోంది. మొదటి మూడు రోజుల్లోనే కలెక్షన్లు కోటిన్నర రూపాయలు దాటేశాయి. ఈనెల 8న విడుదలైన ఈ సినిమా అమెరికాలో మొదటి మూడు రోజుల్లో రూ. 1.82 కోట్లు కలెక్షన్లు సాధించినట్టు సినీ విమర్శకుడు, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. గురువారం 30,864, శుక్రవారం 90,539, శనివారం 149,927 డాలర్లు వసూలు చేసినట్టు తెలిపారు. ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్యపాత్రల్లో నటించారు. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ తో విడుదలైన ‘జ్యో అచ్యుతానంద’కు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తోంది. #JyoAchyuthananda [Telugu] maintains a STRONG GRIP in USA: Thu $ 30,864, Fri $ 90,539, Sat $ 149,927. Total: $ 271,330 [₹ 1.82 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) 11 September 2016 -
తిరుమలలో జ్యో అచ్చుతానంద టీమ్
-
జ్యో... అచ్యుత... ఆనంద... జో...
నటుడిగా మొదలై ‘ఊహలు గుసగుసలాడే’తో దర్శకుడిగా విస్తరించిన కెరీర్ అవసరాల శ్రీనివాస్‌ది. సాహిత్యం, సంగీతం మీద అభిరుచితో ఆయన దర్శకుడిగా రెండో ప్రయత్నం చేశారు. జో... అచ్యుతానంద జో జో ముకుంద! అన్నమయ్య కీర్తన అని తెలియకుండానే దశాబ్దాలుగా తెలుగునాట జనం నోట నిలిచిన లాలిపాట. అలాంటి కమ్మటి లాలిపాట లాంటి సినిమా తీయాలనుకున్నారేమో, దర్శక - నిర్మాతలు వెరైటీగా ‘జ్యో అచ్యుతానంద’ అంటూ ముందుకొచ్చారు. ఇది నిజానికి, ‘జ్యో’త్స్న (రెజీనా) అనే అమ్మాయికీ, అన్నదమ్ములు ‘అచ్యుత’ రామారావు (నారా రోహిత్), ‘ఆనంద’వర్ధనరావు (నాగశౌర్య)లకీ మధ్య నడిచే కథ. వాళ్ళ పేర్లలోని మొదటి కొన్ని అక్షరాలు కలిపితే ‘జ్యో అచ్యుతానంద’. సినిమా మొదలయ్యేసరికే అన్నదమ్ములు ఇద్దరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. తండ్రి పోవడంతో, తల్లి (సీత)తో కలసి, అందరూ ఒకే ఇంట్లో ఉంటుంటారు. అన్నయ్య ఓ కంపెనీలో హెచ్.ఆర్. మేనేజర్‌గా పెద్ద ఉద్యోగి. తమ్ముడు మెడికల్ రిప్రంజెటేటివ్గా కష్టపడుతున్న చిరుద్యోగి. ఈ అన్నదమ్ములకు పెద్దగా పడదు. కారణం ‘జ్యో’ అని పిలుచుకొనే జ్యోత్స్న (రెజీనా). ఎవరా ‘జ్యో’ అన్నది భార్యల అనుమానం. ఫ్లాష్‌బ్యాక్‌లో ఆరేళ్ళ క్రితానికి వెళితే దంతవైద్యం చదువుతున్న హీరోయిన్ ఈ అన్నదమ్ముల ఇంట్లో పై వాటాలో అద్దెకు దిగుతుంది. పై చదువులకు అమెరికా వెళ్ళాలనుకుంటున్న ఆ అమ్మాయిని పోటాపోటీగా అన్నదమ్ములిద్దరూ ప్రేమిస్తారు. ప్రేమలో తమ్ముడి మీద పై చేయి సాధించడానికి అన్న పెయైత్తులూ వేస్తాడు. అది వికటిస్తుంది. ఇద్దరిలో ఎవరినీ ప్రేమించ ట్లేదంటూ హీరోయిన్ అమెరికా వెళ్ళిపోతుంది. ఇక, వర్తమానానికి వస్తే సెకండాఫ్‌లో హీరోయిన్ మళ్ళీ ఈ ఇంటికొస్తుంది. పెళ్ళయిన అన్నదమ్ము లతో ఆడుకోవడం మొదలెడుతుంది. తర్వాతేమైందన్నది మిగతా సిన్మా. సినిమాలు, పాత్రలపై ధ్యాసలో శారీరక స్పృహను వదిలేసిన నారా రోహిత్ డైలాగ్ డెలివరీ బలంతో నెట్టుకొచ్చారు. నాగశౌర్య సహజంగా ఉన్నారు. క్లెమాక్స్ సీన్ లాంటి చోట్ల ఉద్వేగపూరిత నటన చూపెట్టారు. పాత్రలో క్లారిటీ తక్కువైనా, రెజీనా ఉన్నంతలో బాగా చేశారు. మిగిలిన అందరిదీ సందర్భోచిత నటన. ‘ఊహలు గుసగుసలాడే’ కెమేరామన్ వెంకట్ ఈసారీ ముద్ర వేశారు. ఇక శ్రీకల్యాణ్ రమణ అనే కొత్త పేరుతో వచ్చిన కల్యాణీమాలిక్ బాణీల్లో ‘ఒక లాలన’ (గానం శంకర్ మహదేవన్) లాంటివి పదేపదే వినాలనిపిస్తాయి. ‘సువర్ణ’ పాట మాస్‌ను మెప్పిస్తుంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘మనమంతా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మిస్తూ వస్తున్న సాయి కొర్రపాటి ఆ ధోరణికి తగ్గట్లే చేసిన తాజా సమర్పణ ఇది. తోబుట్టువుల మధ్య ఉండే ఈర్ష్య, అసూయలనే కామన్ పాయింట్ ఆసక్తికరమే. అయితే, ఒకే అమ్మాయి కోసం ఇద్దరి పోటీ అనే పదునైన కత్తిని దర్శకుడు పట్టుకున్నారు. విభిన్నంగా తీయాలనే ప్రయోగస్పృహా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఒకే అంశం రెండు పాత్రల దృష్టి నుంచి రెండు రకాలుగా రావడమనేది పావుగంట సా..గినా, ఫస్టాఫ్ సరదాగానే గడిచిపోతుంది. అసలు కథ నడపాల్సిన సెకండాఫ్‌లోనే చిక్కంతా. దృష్టి అంతా అన్నదమ్ముల పాత్రలు, బలవంతపు ఎమోషన్లు, అనవసరమైన ఫైట్ల మీదకు మళ్ళించేసరికి ట్రాక్ మారింది. ఈ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ సినిమా సకుటుంబంగా చూడదగ్గదే! సాధారణ కమర్షియల్ హీరో సినిమాల్లా కాకుండా, పాత్రల మధ్య నడిచే కథగా ముందుకు సాగడం మరికొంత రిఫ్రెషింగ్ ఫీలింగ్! దర్శక - రచయిత సెన్సాఫ్ హ్యూమర్ చాలా చోట్ల డైలాగ్సగా నవ్విస్తుంది. ఆలోచించి మరీ రాయడంతో, ఒక్కోసారి ఆలోచించే వ్యవధి ఇవ్వకుండా ఒకదాని మీద మరొకటి వచ్చి పడే డైలాగ్ పంచ్‌లు ఉక్కిరిబిక్కిరీ చేస్తాయి. కెమేరా వర్క్, ఒకట్రెండు పాటలు గుర్తుంటాయి. కానీ, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆది నుంచి చూపకపోవడం, అప్పటికప్పుడు తెచ్చిపెట్టిన ఉద్వేగాల క్లైమాక్స్, సెకండాఫ్‌లో సాఫీగా సాగని ‘జ్యో’ పాత్ర ప్రయాణం, ఆమె నిశ్చితార్థానికీ - ఆఖరికి అదీ వద్దనుకోవడానికీ కారణం లేకపోవడం లాంటివీ మర్చిపోవడం కష్టమే. వెరసి, ఫస్టాఫ్‌లో ‘జ్యో’ అచ్యుతానందగా మొదలై, సెకండాఫ్‌లో ‘జో...జో’ అచ్యుతానందగా అనిపిస్తుంది. యువత, ముఖ్యంగా నవ దంపతులు లీనమయ్యే అంశాలతో, డైలాగ్‌లతో అర్బన్ ఆడియన్స్ మల్టీప్లెక్స్ మూవీ గుర్తుంటుంది! - రెంటాల జయదేవ చిత్రం: ‘జ్యో అచ్యుతానంద’, పాటలు: భాస్కరభట్ల, కెమేరా: వెంకట్ సి. దిలీప్, ఎడిటింగ్: కిరణ్ గంటి, కథ - మాటలు - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్ -
జ్యో అచ్యుతానందపై రాజమౌళి రివ్యూ
తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో స్పందించే దర్శక ధీరుడు రాజమౌళి, తాజాగా జ్యో అచ్యుతానందపై సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సినిమా రాజమౌళికి అత్యంత సన్నిహితులైన వారాహి చలన చిత్ర బ్యానర్ పై రూపొందటంతో రిలీజ్ రోజు తొలి షోనే చూసిన జక్కన సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పేరు పేరునా ప్రశంసించాడు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో స్పందించిన రాజమౌళి, ' వారాహి చలన చిత్ర, అవసరాల శ్రీనివాస్, కళ్యాణ్ రమణల కాంబినేషన్ జ్యో అచ్యుతానంద సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. సినిమాలో ఎక్కడా కావాలని ఇరికించిన సీన్స్ లేవు. సినిమా అంతా ఆరోగ్యకరమైన హాస్యం, గుండెలకు హత్తుకునే ఎమోషన్స్ అలరిస్తాయి. ముఖ్యంగా చివరి 10 నిమిషాలు కంట తడి పెట్టిస్తోంది. నారా రోహిత్, నాగశౌర్యలు అన్నదమ్ములుగా బాగున్నారు. రెజీనా నటన తొలిసారిగా చూశా. ఎంతో నచ్చింది. వెంకట్ ఫోటోగ్రఫి సినిమాకు ప్లస్, చిన్న చిన్న డిటెయిలింగ్ విషయంలో కూడా ఆర్ట్ డైరెక్టర్ రమ జాగ్రత్తలు తీసుకున్నారు. 'చివరకు మిగిలేది' నవలను వయసైనట్టుగా చూపించటం ఓ ఉదాహరణ. అందరికీ శుభాకాంక్షలు'. అంటూ ట్వీట్ చేశాడు. Combination of @VaaraahiCC Avasarala Srinivas and @Kalyanramana delivers yet another family youthful entertainer #JyoAchyuthananda. Never— rajamouli ss (@ssrajamouli) 9 September 2016Over the top, never forced- the film generates super fun through out and warms your heart in the last 10 mins of climax.Nara Rohith and— rajamouli ss (@ssrajamouli) 9 September 2016Nagashourya are very good as brothers. Watched regina for the first time. Very impressed. Venkat's photography is an asset. Appreciate the— rajamouli ss (@ssrajamouli) 9 September 2016amount of detail art director Rama put in. The aging of the novel "chivaraku migiledhi" in the film is a small example.Congratulations all!— rajamouli ss (@ssrajamouli) 9 September 2016 -
స్నేహం కోసం నాని..?
హ్యాట్రిక్ హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లో కూడా నానికి ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేసే నాని, ఇప్పుడు యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యాడు ఓ యంగ్ డైరెక్టర్. ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్, రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన సినిమా జ్యో అచ్యుతానంద. నారా రోహిత్, నాగశౌర్యలు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని, అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అవసరాల శ్రీనివాస్‌తో ఉన్న స్నేహం కారణంగానే నాని ఈ క్యారెక్టర్‌కు అంగీకరించాడు. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే కీలక మైన పాత్రలో నాని అలరించనున్నాడు. కథను మలుపు తిప్పే ఈ పాత్రం సినిమాకే హైలెట్ అన్న టాక్ వినిపిస్తోంది. -
ఊహించని క్లైమాక్స్ ఉంటుందట
'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్. కొంత గ్యాప్ తరువాత 'జ్యో అచ్యుతానంద' పేరుతో ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. జ్యో, అచ్యుత్, ఆనంద్‌ల ప్రేమకథే ఈ 'జ్యో అచ్యుతానంద'. నారా రోహిత్, రెజీనా, నాగ శౌర్యలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆ ఇద్దరు హీరోల్లో ఆమె మనసు ఎవరు గెలుచుకుంటారనేదే ప్రశ్న. అయితే ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం అనే టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులు ఊహించని విధంగా ముగింపు ఉంటుందని, కచ్చితంగా థ్రిల్‌కు గురవుతారని చిత్ర యూనిట్ చెబుతున్న మాట. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందట. వారాహి చలన చిత్ర బ్యానర్‌ఫై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ రమణ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. -
అవసరాలకు మంచి డేట్ దొరికింది
ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, రెండో ప్రయత్నంగా తెరకెక్కిస్తున్న సినిమా జ్యో అచ్యుతానంద. ట్రయాంగులర్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారాహి చలనచిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్న యూనిట్‌కు ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా కలిసొచ్చింది. ముందుగా ఈ సినిమాను భారీ పోటి మధ్య సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే రోజు రిలీజ్ అవుతాయనుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా వెనక్కు తగ్గటంతో ఇప్పుడు జ్యో అచ్యుతానంద సోలోగా బరిలో నిలిచింది. నాగచైతన్య ప్రేమమ్, నాని మజ్ను, సునీల్ వీడి గోల్డెహే సినిమాలు వాయిదా పడ్డాయి. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దీంతో థియేటర్ల సంఖ్యతో పాటు తొలి వారం కలెక్షన్ల విషయంలోనూ జ్యో అచ్యుతానంద సత్తా చాటుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
రొమాంటిక్ కామెడీగా 'జో అచ్యుతానంద'
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన శ్రీని.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ‘జో అచ్యుతానంద’ అనే పేరుతో మరో రొమాంటిక్ కామెడీని అందించేందుకు రెడీ అవుతున్నాడు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. బుధవారం దీని టీజర్ విడుదలై సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఆగష్టు 21న ఆడియో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కల్యాణ్ కోడూరి ఈ చిత్రానికి స్వరాలందించారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమించడమన్న కాన్సెప్ట్‌తో రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్గా నటించారు. సెప్టెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. -
రొమాంటిక్ కామెడీగా 'జ్యో అచ్యుతానంద'