
కంగారు మొత్తం పోయింది : అవసరాల శ్రీనివాస్
‘‘ ‘జ్యో అచ్యుతానంద’ చిత్రకథ రాసుకునేటప్పుడు, చిత్రీకరణ సమయంలో కాన్ఫిడెన్స్‌తో ఉండేవాణ్ణి. కానీ, సినిమా విడుదల టైమ్‌లో బాగా ఒత్తిడికి గురయ్యా. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించిన తీరు చూసి ఆ కంగారు మొత్తం పోయింది. రిలీఫ్ అనిపించింది’’ అని దర్శకుడు శ్రీనివాస్ అవసరాల అన్నారు. నాగశౌర్య, నారా రోహిత్, రెజీనా ప్రధాన పాత్రల్లో అవసరాల దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ‘జ్యో అచ్యుతానంద’ ఇటీవల విడుదలైంది.
ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ -‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’కి ఎంతటి ప్రేక్షకాదరణ లభించిందో, ఈ చిత్రానికీ అంత రెస్పాన్స్ రావడం హ్యాపీ. ఈ చిత్రం చూసిన కొందరు ‘నాకూ ఓ అన్నయ్య.. తమ్ముడు ఉండుంటే బాగుండేది’ అని మెసేజ్‌లు పంపారు’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి చూశా. వారు ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీలయ్యా’’ అని రెజీనా అన్నారు. కెమెరామ్యాన్ వెంకట్ సి.దిలీప్, సంగీత దర్శకుడు కల్యాణి రమణ తదితరులు పాల్గొన్నారు.