జ్యో... అచ్యుత... ఆనంద... జో...
నటుడిగా మొదలై ‘ఊహలు గుసగుసలాడే’తో దర్శకుడిగా విస్తరించిన కెరీర్ అవసరాల శ్రీనివాస్‌ది. సాహిత్యం, సంగీతం మీద అభిరుచితో ఆయన దర్శకుడిగా రెండో ప్రయత్నం చేశారు. జో... అచ్యుతానంద జో జో ముకుంద! అన్నమయ్య కీర్తన అని తెలియకుండానే దశాబ్దాలుగా తెలుగునాట జనం నోట నిలిచిన లాలిపాట. అలాంటి కమ్మటి లాలిపాట లాంటి సినిమా తీయాలనుకున్నారేమో, దర్శక - నిర్మాతలు వెరైటీగా ‘జ్యో అచ్యుతానంద’ అంటూ ముందుకొచ్చారు. ఇది నిజానికి, ‘జ్యో’త్స్న (రెజీనా) అనే అమ్మాయికీ, అన్నదమ్ములు ‘అచ్యుత’ రామారావు (నారా రోహిత్), ‘ఆనంద’వర్ధనరావు (నాగశౌర్య)లకీ మధ్య నడిచే కథ. వాళ్ళ పేర్లలోని మొదటి కొన్ని అక్షరాలు కలిపితే ‘జ్యో అచ్యుతానంద’.
సినిమా మొదలయ్యేసరికే అన్నదమ్ములు ఇద్దరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. తండ్రి పోవడంతో, తల్లి (సీత)తో కలసి, అందరూ ఒకే ఇంట్లో ఉంటుంటారు. అన్నయ్య ఓ కంపెనీలో హెచ్.ఆర్. మేనేజర్‌గా పెద్ద ఉద్యోగి. తమ్ముడు మెడికల్ రిప్రంజెటేటివ్‌గా కష్టపడుతున్న చిరుద్యోగి. ఈ అన్నదమ్ములకు పెద్దగా పడదు. కారణం ‘జ్యో’ అని పిలుచుకొనే జ్యోత్స్న (రెజీనా). ఎవరా ‘జ్యో’ అన్నది భార్యల అనుమానం. ఫ్లాష్‌బ్యాక్‌లో ఆరేళ్ళ క్రితానికి వెళితే దంతవైద్యం చదువుతున్న హీరోయిన్ ఈ అన్నదమ్ముల ఇంట్లో పై వాటాలో అద్దెకు దిగుతుంది. పై చదువులకు అమెరికా వెళ్ళాలనుకుంటున్న ఆ అమ్మాయిని పోటాపోటీగా అన్నదమ్ములిద్దరూ ప్రేమిస్తారు. ప్రేమలో తమ్ముడి మీద పై చేయి సాధించడానికి అన్న పెయైత్తులూ వేస్తాడు. అది వికటిస్తుంది. ఇద్దరిలో ఎవరినీ ప్రేమించ ట్లేదంటూ హీరోయిన్ అమెరికా వెళ్ళిపోతుంది. ఇక, వర్తమానానికి వస్తే సెకండాఫ్‌లో హీరోయిన్ మళ్ళీ ఈ ఇంటికొస్తుంది. పెళ్ళయిన అన్నదమ్ము లతో ఆడుకోవడం మొదలెడుతుంది. తర్వాతేమైందన్నది మిగతా సిన్మా.
సినిమాలు, పాత్రలపై ధ్యాసలో శారీరక స్పృహను వదిలేసిన నారా రోహిత్ డైలాగ్ డెలివరీ బలంతో నెట్టుకొచ్చారు. నాగశౌర్య సహజంగా ఉన్నారు. క్లెమాక్స్ సీన్ లాంటి చోట్ల ఉద్వేగపూరిత నటన చూపెట్టారు. పాత్రలో క్లారిటీ తక్కువైనా, రెజీనా ఉన్నంతలో బాగా చేశారు. మిగిలిన అందరిదీ సందర్భోచిత నటన. ‘ఊహలు గుసగుసలాడే’ కెమేరామన్ వెంకట్ ఈసారీ ముద్ర వేశారు. ఇక శ్రీకల్యాణ్ రమణ అనే కొత్త పేరుతో వచ్చిన కల్యాణీమాలిక్ బాణీల్లో ‘ఒక లాలన’ (గానం శంకర్ మహదేవన్) లాంటివి పదేపదే వినాలనిపిస్తాయి. ‘సువర్ణ’ పాట మాస్‌ను మెప్పిస్తుంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘మనమంతా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మిస్తూ వస్తున్న సాయి కొర్రపాటి ఆ ధోరణికి తగ్గట్లే చేసిన తాజా సమర్పణ ఇది.
తోబుట్టువుల మధ్య ఉండే ఈర్ష్య, అసూయలనే కామన్ పాయింట్ ఆసక్తికరమే. అయితే, ఒకే అమ్మాయి కోసం ఇద్దరి పోటీ అనే పదునైన కత్తిని దర్శకుడు పట్టుకున్నారు. విభిన్నంగా తీయాలనే ప్రయోగస్పృహా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఒకే అంశం రెండు పాత్రల దృష్టి నుంచి రెండు రకాలుగా రావడమనేది పావుగంట సా..గినా, ఫస్టాఫ్ సరదాగానే గడిచిపోతుంది. అసలు కథ నడపాల్సిన సెకండాఫ్‌లోనే చిక్కంతా. దృష్టి అంతా అన్నదమ్ముల పాత్రలు, బలవంతపు ఎమోషన్లు, అనవసరమైన ఫైట్ల మీదకు మళ్ళించేసరికి ట్రాక్ మారింది.
ఈ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ సినిమా సకుటుంబంగా చూడదగ్గదే! సాధారణ కమర్షియల్ హీరో సినిమాల్లా కాకుండా, పాత్రల మధ్య నడిచే కథగా ముందుకు సాగడం మరికొంత రిఫ్రెషింగ్ ఫీలింగ్! దర్శక - రచయిత సెన్సాఫ్ హ్యూమర్ చాలా చోట్ల డైలాగ్‌సగా నవ్విస్తుంది. ఆలోచించి మరీ రాయడంతో, ఒక్కోసారి ఆలోచించే వ్యవధి ఇవ్వకుండా ఒకదాని మీద మరొకటి వచ్చి పడే డైలాగ్ పంచ్‌లు ఉక్కిరిబిక్కిరీ చేస్తాయి. కెమేరా వర్క్, ఒకట్రెండు పాటలు గుర్తుంటాయి.
కానీ, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆది నుంచి చూపకపోవడం, అప్పటికప్పుడు తెచ్చిపెట్టిన ఉద్వేగాల క్లైమాక్స్, సెకండాఫ్‌లో సాఫీగా సాగని ‘జ్యో’ పాత్ర ప్రయాణం, ఆమె నిశ్చితార్థానికీ - ఆఖరికి అదీ వద్దనుకోవడానికీ కారణం లేకపోవడం లాంటివీ మర్చిపోవడం కష్టమే. వెరసి, ఫస్టాఫ్‌లో ‘జ్యో’ అచ్యుతానందగా మొదలై, సెకండాఫ్‌లో ‘జో...జో’ అచ్యుతానందగా అనిపిస్తుంది. యువత, ముఖ్యంగా నవ దంపతులు లీనమయ్యే అంశాలతో, డైలాగ్‌లతో అర్బన్ ఆడియన్స్ మల్టీప్లెక్స్ మూవీ గుర్తుంటుంది! - రెంటాల జయదేవ
చిత్రం: ‘జ్యో అచ్యుతానంద’, పాటలు: భాస్కరభట్ల, కెమేరా: వెంకట్ సి. దిలీప్, ఎడిటింగ్: కిరణ్ గంటి, కథ - మాటలు - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్