విమాన శకలాలను కనుగొన్న తరువాత విలేకరులకు వివరిస్తున్న ఆస్ట్రేలియన్ వైమానిక దళ లెఫ్టినెంట్ రస్సెల్ ఆడమ్స్
కౌలాలంపూర్: తప్పిపోయిన మలేషియా విమానం జాడ ఇంకా తెలియరాలేదు. 15 రోజులు గడిచినా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో ఇది మిస్టరీగానే మిగలనుందా? కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్370 ఈ నెల 8వ తేది అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇందులో అయిదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విమానం కోసం 26 దేశాలకు చెందిన వైమానిక, నావికా దళాలు గాలిస్తూనే ఉన్నాయి. భారతదేశానికి చెందిన సిబ్బంది కూడా వెతుకుతున్నారు. విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారని, ప్రమాదానికి గురైందని, హిందూ మహాసముద్రంలో దాని శకలాలు కనిపించాయని ...పలు రకాల కథనాలు వినవచ్చాయి.
ఈ విమానంపై ప్రపంచవ్యాప్తంగా రోజుల తరబడి వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ విమానం ఏమై ఉంటుందీ అనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది. గడిచిన వందేళ్లుగా కనబడకుండా పోయిన విమానాలు, ఓడల్లాగా ఇది కూడా ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుందా? లేకపోతే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాని జాడను కనిపెడతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు.
ఈ విమాన శకలాలను చైనా శాటిలైట్లు గుర్తించాయి. హిందూమహాసముద్రంలో తేలుతున్న ఒక పెద్ద శకలం మలేషియా విమానానికి చెందినదిగా భావిస్తున్నారు. ఆ శకలం ఫొటోలను కూడా చైనా టెలివిజన్ విడుదల చేసింది. చైనా కనుగొన్న ప్రాంతంలోనే ఆస్ట్రేలియా కూడా శకలాలను గుర్తించింది. ఆస్ట్రేలియన్ వైమానిక దళం వారు ఒక చెక్క ప్యాలెట్, ఇతర శకలాలు కనుగొన్నారు. ఫ్రాన్స్ కూడా ఆ ప్రాంతంలోనే కొన్ని శకలాలను కనుగొన్నట్లు తెలియజేస్తూ ఉపగ్రహ చిత్రాలను ఈరోజు విడుదల చేసింది. ఆ శకలాలు తప్పిపోయిన విమానానివిగా భావిస్తున్నారు. దాంతో విమానం ప్రమాదానికి గురైనట్లుగానే స్పష్టమవుతోంది. ఏడు చైనా నౌకలు, రెండు మలేషియా షిప్లు ఆ శకలాల కోసం వెతుకుతున్నాయి. ఈ విమానం ఆచూకీ తెలుసుకునేందుకు నాసా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.