
విదేశీ ఇన్వెస్టర్లకు సెబీ గాలం
ముంబై: విదేశీ ఇన్వెస్టర్లను భారత మార్కెట్లవైపు ఆకర్షించే దిశగా మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) తరగతికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసింది. నేడు (శనివారం) జరిగే బోర్డు సమావేశంలో సెబీ వీటిని మరోసారి చర్చించనుంది. ప్రస్తుతం వేర్వేరు తరగతులుగా ఉన్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ), క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్వెస్టర్లను (క్యూఎఫ్‌ఐ) కలిపి ఎఫ్‌పీఐ పేరిట కొత్త తరగతి ఏర్పాటు అవుతుంది.
రిస్కు సామర్థ్యాన్ని బట్టి ఇందులో ఇన్వెస్టర్లు మూడు కేటగిరీలుగా విభజిస్తారు. మొదటి కేటగిరీలో తక్కువ రిస్కు ఇన్వెస్టర్లు ఉంటారు. ఈ జాబితాలో బహుళ ఏజెన్సీలు, ప్రభుత్వరంగ సంస్థలు వంటివి ఉంటాయి. రెండో కేటగిరీలో ఒక మోస్తరు రిస్కు ఉండే బ్యాంకులు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు, బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్లు ఉంటాయి. మూడో కేటగిరీలో హెడ్జ్ ఫండ్స్ వంటి అధిక రిస్కు ఇన్వెస్టర్లు ఉంటారు. కేటగిరీ 1 ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్‌కి ఎలాంటి ఫీజు ఉండదు. మిగతా కేటగిరీలకు 1,000 డాలర్ల స్థాయిలో ఫీజు ఉంటుంది. క్యాబినెట్ మాజీ కార్యదర్శి కేఎం చంద్రశేఖర్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిబంధనలను రూపొందించారు. ఎఫ్‌పీఐలు ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో సెక్యూరిటీల్లో, దేశీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, ప్రభుత్వ బాండ్లు వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
డీఎస్‌క్యూ సాఫ్ట్‌వేర్, ప్రమోటర్ దాల్మియాపై నిషేధం
షేర్ ధరకు సంబంధించి ట్రేడింగ్ మోసాలకు పాల్పడిన అభియోగాలపై ఏడేళ్ల పాటు క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా డీఎస్‌క్యూ సాఫ్ట్‌వేర్, దాని ప్రమోటర్ దినేష్ దాల్మియాపై సెబీ నిషేధం విధించింది. 1998లో డీఎస్‌క్యూ, దాల్మియా తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వడం ద్వారా షేరు ధర వాస్తవ రేటు కన్నా పెరిగిపోయేలా చేశారని అభియోగాలున్నాయి.