
న్యూఢిల్లీ: కొత్త కేవైసీ నిబంధనలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు)ఊరటనిచ్చే నిర్ణయాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ శనివారం తీసుకుంది. ఈ కొత్త కేవైసీ నిబంధనలపై ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్. ఆర్. ఖాన్ అధ్యక్షతన గల అత్యున్నత స్థాయి సంఘం పలు వివాదాస్పద విషయాలపై చాలా మార్పులను సూచించింది. ఈ సిఫార్సుల ప్రకారం ఎన్నారైలు, ఓసీఐలు (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా), ఆర్‌ఐలు (రెసిడెంట్ ఇండియన్స్) విదేశీ ఫండ్స్‌లో 50 శాతం లోపువాటాను కలిగివుండవచ్చు.
ఆ ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఆయా ఇన్వెస్టర్లపై ఎటువంటి నియంత్రణలూ వుండవు. అలాగే ఆయా ఇన్వెస్టర్ల కెవైసీకి అదనపు డాక్యుమెంట్లను సమర్పించనక్కర్లేదని సూచించింది. కొత్త మార్గదర్శకాలకు తుది రూపు ఇచ్చే ముందు ఈ మార్పులపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని సెబీ నిర్ణయించింది. ఈ నెల 17 వరకూ హెచ్.ఆర్. ఖాన్ కమిటీ నివేదికపై ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని సెబీ పేర్కొంది.
నివాస భారతీయులు, ప్రవాసభారతీయులు...విదేశీ ఫండ్స్ ద్వారా నిధుల్ని దేశీయ మార్కెట్లోకి తరలిస్తున్నారన్న కారణంగా కొత్తగా కైవైసీ నిబంధనల్ని గతంలో సెబి జారీచేసింది. సెబీ కేవైసీ నిబంధనల కారణంగా 7,500 కోట్ల డాలర్ల విదేశీ నిధులు తరలిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.