ప్రభుత్వ, ప్రైవేటు జీతాల్లో వ్యత్యాసం ఎంత?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని కొన్ని వర్గాల ఉద్యోగులు ఆనందిస్తుండగా, కొన్ని వర్గాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న ఉద్యోగ వర్గాలు నిరసన కార్యక్రమాలను కూడా రూపొందించుకున్నాయి. ప్రభుత్వం కనీస వేతనాలను మరింత పెంచాలని, కెరీర్ మొత్తంలో ప్రతి ఉద్యోగికి ఐదు పదోన్నతులు కల్పించాలని అఖిల భారత రక్షణ శాఖ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని ఏడు వేల రూపాయల నుంచి ఏకంగా 18 వేల రూపాయలకు పెంచిన విషయం తెల్సిందే. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం రేటును, ఆకాశానంటుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకొని కనీస వేతనాన్ని 26 వేల రూపాయలకు పెంచాలని రక్షణ శాఖ ఉద్యోగులతోపాటు మరో కొన్ని రంగాల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అసంతృప్తితో ఉన్న 32 లక్షల మంది ఉద్యోగులు జూలై 11వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.
అయితే ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకన్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను ఎక్కువగా పెంచామని, ఇక ఈ విషయంలో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీనే స్వయంగా ప్రకటించారు. ప్రతి రంగంలో ఎంట్రీ దశలోనే ప్రైవేటు సెక్టార్‌కన్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను ఎక్కువగా పెంచారు. ప్రొఫెసన్ స్థాయి ఉద్యోగులకు, ముఖ్యంగా అనుభవం, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ప్రభుత్వంకన్నా ప్రైవేటు రంగమే ఎక్కువ జీతాలను చెల్లిస్తోంది. వివిధ స్థాయిల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగం ఉద్యోగుల వేతనాల్లో ఉన్న వ్యత్యాసాన్ని అహ్మదాబాద్‌లోని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ నిర్వహించిన సర్వే వివరాలు తెలియజేస్తున్నాయి. ఈ సర్వే వివరాలనే ప్రాతిపదికగా తీసుకొని ఏడవ వేతన సంఘం వివిధ ప్రభుత్వ రంగాల్లో ఎంట్రీ స్థాయి ఉద్యోగుల జీతాలను ఎక్కువగా ఉండేలా సిఫార్సులు చేసింది. అయినప్పటికీ ఇతర ఆసియా దేశాల ప్రభుత్వ రంగాలతో పోలిస్తే భారత్ ప్రభుత్వ వేతనాలు తక్కువే.
ప్రస్తుతం పెరిగిన వేతనాల ప్రకారం పెద్దగా అనుభవం లేని డ్రైవర్‌కు ప్రభుత్వరంగంలో నెలకు 25వేల రూపాయల జీతం వస్తుంటే ప్రైవేటు రంగంలో నెలకు 11వేల రూపాయలు వస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో ఓ ప్లంబర్‌కు వస్తున్న జీతంకంటే ప్రభుత్వరంగంలో ప్లంబర్‌కు రెట్టింపు జీతం వస్తోంది. ఆరోగ్యరంగంలో కూడా ఈ వ్యత్యాసం కొనసాగుతోంది. ప్రైవేట్‌లో ఓ నర్సుకు నెలకు ఏడువేల నుంచి పదిహేడు వేల రూపాయల మధ్యన వస్తుంటే ప్రభుత్వరంగంలో అంతకు మూడింతలు వస్తోంది. ఎంట్రీ లెవల్లో ఓ డాక్టర్‌కు ప్రైవేటు రంగంకన్నా ప్రభుత్వరంగంలో 60 శాతం జీతం ఎక్కువగా వస్తోంది. ఎంఎస్, ఎండీ చేసిన అనుభవంగల వైద్యులకు ప్రభుత్వంరంగం కన్నా ప్రైవేటు రంగంలో రెట్టింపు జీతాలు లభిస్తున్నాయి. ఇది వైద్య టీచింగ్ రంగంలో కూడా ఇలాంటి వ్యత్యాసాలే ఉన్నాయి.
ఇక విద్యారంగంలోని పాఠశాల, ఉన్నత విద్యారంలో కూడా ఎంట్రీ స్థాయిలో ప్రైవేటుకన్నా ప్రభుత్వరంగంలో టీచర్లకు, అధ్యాపకులకు ఎక్కువ జీతాలు వస్తున్నాయి. అనుభవం కలిగిన ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులకు, అధ్యాపకుల కొరత ఉన్న సబ్జెక్టుల్లో నిపుణులైన వారికి ప్రభుత్వంకన్నా ప్రైవేటురంగంలోనే జీతాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల్లో ఎంట్రి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రొఫెషనల్ స్థాయిలో ప్రైవేటు రంగంలో జీతాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా ప్రైవేటు రంగంతో పోలిస్తే ప్రభుత్వరంగంలో అటెండర్, డ్రైవర్, ప్లంబర్ స్థాయి వర్కింగ్ క్లాస్, దిగువ, మధ్యస్థాయి ఉద్యోగులకు ఏడవ వేతనం సిఫార్సుల వల్ల లాభం చేకూరిందనడంలో ఎలాంటి సందేహం లేదు.