ఆటోలో వచ్చావు.. ఎమ్మెల్యేవి కావు!
కోట్ల రూపాయల విలువ చేసే కారు.. మడత నలగని ఖద్దరు చొక్కా.. రెండు చేతులకు ఉన్న నాలుగేసి వేళ్లకు పెద్ద పెద్ద బంగారు ఉంగరాలు.. కనీసం ఇవన్నీ ఉంటేనే ఓ ఎమ్మెల్యే అనేది మనవాళ్ల లెక్క. రాజకీయ నాయకుల హంగు, ఆర్భాటాలకు పోలీసులు కూడా అంతలా అలవాటు పడిపోయారు. గురువారం తెలంగాణ సచివాలయంలో ఓ ఎమ్మెల్యేకు జరిగిన ఘోర అవమానమే ఇందుకు తాజా నిదర్శనం!
ఆర్భాట రాజకీయాలు ఇంకా వంటబట్టని గిరిజన నాయకుడిగా, సీపీఎం శాసనసభా పక్ష నేతగా సుపరిచితుడైన ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యను సచివాలయం ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారణం.. ఆయన సామాన్యులు ప్రయాణించే ఆటోలో వెళ్లారట! గేటు బయటే రాజయ్యను అడ్డుకున్న పోలీసులు.. 'ఆటోలో వచ్చావ్.. నువ్వు ఎమ్మెల్యేవంటే మేము నమ్మం' అనడంతో తన ఐడెంటిటీ కార్డు తీసి పోలీసులకు చూపారు రాజయ్య. ఐడీ కార్డును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట గానీ ఎమ్మెల్యే రాజయ్యను పోలీసులు లోనికి అనుమతించలేదు!