
సీఎం కార్యాలయం ఎదుట సీమాంధ్ర ఉద్యోగుల నిరసన
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోరుతూ సచివాలయం ఉద్యోగులు ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. గురువారం ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం సమత బ్లాక్ వద్దకు దూసుకొచ్చి బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాన్ని విభజిస్తే ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. కొన్నాళ్ళుగా విధులకు దూరంగా ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా సమత బ్లాక్ వద్దకు ప్రదర్శనగా బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గని ఉద్యోగులు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ సమత బ్లాక్ వద్దకు చేరుకుని, అక్కడే బైఠాయించి సాయంత్రం వరకూ నిరసన తెలిపారు. కాగా, సమత బ్లాక్ వద్ద ఆందోళన సందర్భంగా సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీ బెన్సన్ స్పృహ కోల్పోవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: మురళీకృష్ణ
సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీకృష్ణ వెల్లడించారు. ఉద్యోగుల సర్వసభ్య సమావేశం డీ బ్లాక్‌లోని సమావేశ మందిరంలో దాదాపు ఐదు గంటల పాటు జరిగింది. తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చేపట్టాలనే అంశంపై ఈ సందర్భంగా అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం దిగివచ్చే వరకూ ఆందోళన చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్టు వెల్లడించారు. సమైక్యవాదుల మనోభావాలను గుర్తించాలని, సమైక్యవాదాన్ని కోరుకునే ఏ పార్టీకైనా తమ మద్దతు ఉంటుందని తెలిపారు.