సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే: వి.హనుమంతరావు | Seemandhra employees should be go: V. hanumantha rao | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే: వి.హనుమంతరావు

Published Sun, Aug 18 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

Seemandhra employees should be go: V. hanumantha rao

సాక్షి, తిరుమల, తిరుపతి, హైదరాబాద్: కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం చేసుకొనేందుకు తిరుమల వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు ఉండడానికి వీల్లేదని, ఒకవేళ ఉండాలనుకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయాలని తిరుమలలో మీడియా ముందు వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన సమైక్యవాదులు నిరసన తెలిపేందుకు తిరుగుప్రయాణమైన వీహెచ్ వాహనాన్ని అలిపిరి వద్ద అడ్డుకున్నారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి నిరసన తెలపడానికి నిరసనకారులు ప్రయత్నిస్తుండగానే.. పోలీసులు లాఠీచార్జికి దిగారు. దాంతో ఆందోళనకారుల్లో ఒకరు వీహెచ్ వాహనంపైకి చెప్పు విసిరారు. చివరకు పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించి, వీహెచ్ వాహనాన్ని అక్కడినుంచి పంపేశారు. వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యల వల్లే తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు చెప్పారు. మరోవైపు వీహెచ్ కారుపై దాడికి ఓ ప్రైవేటు న్యూస్ చానల్ సిబ్బంది ఉసిగొల్పారని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
 తిరుమలలో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణ, సీమాంధ్ర అన్నదమ్ములుగా విడిపోదాం. ఒక్క ఉద్యోగులు మినహా హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చు. ఆ ఉద్యోగులు కూడా ఉద్యోగాలకు రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఉండవచ్చు. రేషియో ప్రకారం ఉద్యోగులు పోయేటోళ్లు పోతారు. మిగతావారు ఉండొచ్చు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వాళ్లను వెళ్లగొట్టరు. అది ఒక అపోహ మాత్రమే.
 
  వీ విల్ గివ్ ఫుల్ సపోర్ట్ దెమ్’’ అని పేర్కొన్నారు. ఎన్జీవోల ఉద్యమాన్ని రాజకీయ నాయకులు వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. వీహెచ్ వ్యాఖ్యలను తెలుసుకున్న కొందరు సమైక్యవాదులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి నిరసన తెలపడానికి అలిపిరి టోల్‌గేటు వద్ద కాపుకాశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వీహెచ్ కారు ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దాంతో సమైక్యవాదులు కారుకు అడ్డంగా పడుకుని వీహెచ్‌ను కిందికి దిగాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆయన దిగకపోవడంతో, పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించేయత్నం చేశారు. అయినా.. వారు వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జి ప్రారంభించారు. అదేసమయంలో ఆందోళనకారుల్లో ఒకరు వీహెచ్ వాహనంపైకి చెప్పు విసిరారు. చివరికి పోలీసులు వీహెచ్ కారును పంపించివేశారు. ఈ ఘటనలో పది మంది ఉద్యమకారులకు, ఒక పోలీసు కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వీహెచ్ వాహనాన్ని తిరుపతి లీలామహల్ సెంటర్ వద్ద, విమానాశ్రయం వద్ద కూడా అడ్డుకునేందుకు సమైక్యవాదులు యత్నించారు.
 
 వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ఉద్రిక్తత: ఎస్పీ
 వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్లే తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్పారు. వీహెచ్ కారును అడ్డగించిన 20 మందిపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
 
 నేడు రాయలసీమ బంద్‌కు పిలుపు
 లాఠీచార్జికి నిరసనగా ఆదివారం రాయలసీమ బంద్‌కు సమైక్యవాదులు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ శాంతియుతంగా పుష్పగుచ్ఛాలు ఇవ్వడానికి వచ్చామని, తమపై పోలీసులు అమానుషంగా దాడి చేశారని చెప్పారు.
 
 నాపై దాడి దారుణం: వీహెచ్
 సమైక్యవాదులు తనపై దాడికి యత్నించడం దారుణమని ఎంపీ వీహెచ్ హైదరాబాద్‌లో పేర్కొన్నారు. కొందరు తనకు పూలు ఇచ్చి నిరసన తెలుపుతున్న సమయంలోనే వెనుక నుంచి కొందరు చెప్పులు విసిరారన్నారు. తెలంగాణపై వైఎస్సార్ జమానాలో నోరెత్తని నాయకులు ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. దాడికి ప్రయత్నించింది ఎవరో తనకు తెలుసని వీహెచ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement