ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన సీమాంధ్ర | seemandhra employees strike in seemandra regions | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన సీమాంధ్ర

Published Wed, Aug 14 2013 4:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన సీమాంధ్ర

ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన సీమాంధ్ర

సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర ప్రదేశ్ పరిరక్షణే లక్ష్యంగా నినదిస్తున్న ప్రజకు ఇప్పుడు ఉద్యోగుల సమ్మె తోడవడంతో సీమాంధ్ర స్తంభించింది. మంగళవారం నుంచి మొదలైన సకలజనుల బంద్‌కు తోడు ప్రజలు వివిధరూపాల్లో ఆందోళనలు హోరెత్తించారు. రాష్ట్ర విభజన  యత్నాలను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలూ  స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. రెండు వారాలుగా వెల్లువలా సాగుతున్న ఉద్యమానికి ఊపునిస్తూ మంగళవారం నాడూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటాయి. మారుమూల పల్లెల్లో సైతం గ్రామస్తులు వినూత్నరీతిలో నిరసనలు చేపట్టడం ఉద్యమరూపు ఏ స్థాయి వరకు విస్తరించిందో అవగతమవుతోంది.
 
 సూర్యనమస్కారాలతో అర్చకుల నిరసన
 శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవస్థానం అర్చకులు స్థానిక పొట్టిశ్రీరాములు జంక్షన్‌లో సూర్య నమస్కారాలు చేసి నిరసన తెలిపారు. బలగ ప్రాంతంలో సర్వమత ప్రార్థనలు జరిపి అక్కడే వేల మందికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పట్టణంలో మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో చేపల బుట్టలు పట్టుకొని ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఎచ్చెర్లలో బి.ఆర్.అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధించడంతో కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. రజకులు ఇస్త్రీపెట్టెలు చేతపట్టి రోడ్డుపైకి వచ్చి బట్టలు ఇస్త్రీచేసి తమ నిరసన తెలిపారు.
 
 పల్లెవాసుల ధర్నాలు
 కృష్ణాజిల్లా కలిదిండి మండలం గుర్వాయిపాలెం వద్ద గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. మద్వానిగూడెం వద్ద కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద జాతీయ రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. విజయవాడ మాచవరంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో, మచిలీపట్నం కోనేరుసెంటరులో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని సారధ్యంలో వేలాదిమందితో వంటావార్పు నిర్వహించారు.
 
ఆటోడ్రైవర్ల ర్యాలీలు
 ఒంగోలులో ఆటో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో  కేసీఆర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి, చెప్పులతో కొడుతూ మద్యం బాటిళ్లు మెడకు కట్టి నగర వీధులలో ఊరేగించారు. జిల్లాలో మున్సిపల్ ఉద్యోగుల సమ్మెకు వైఎస్‌ఆర్ సీపీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి సంఘీభావం ప్రకటించారు. కలెక్టరేట్ ఎదురుగా వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను  ఆయన ప్రారంభించారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ఎన్జీవోల అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
 
 నాయూబ్రాహ్మణుల వినూత్న నిరసన
 పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సామూహిక క్షురకర్మలు చేసి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెంలో పురోహితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన మహిళలు సమైక్యాంధ్ర కంకణాలు ధరించారు. కడపలో గెజిటెడ్ ఉద్యోగులు  స్టేట్ గెస్ట్‌హౌస్ నుంచి భారీర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి సమైక్య ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు. ఎర్రగుంట్లలో 3800 మంది ఆర్టీపీపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. రాజంపేటలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. రాయచోటిలో జాతీయ రహదారిపై ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా వంటా వార్పు చేపట్టారు.
 
 పాస్టర్ల ప్రదర్శన
 తూర్పుగోదావరి  జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 300 సంఘాలతో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడలో తోలు బొమ్మలాట వృత్తి కళాకారుల సమాఖ్య తోలుబొమ్మల ప్రదర్శన చేస్తూ సమైక్యాంధ్రపై ప్రజలను చైతన్యం చేశారు.
 
 ఏజెన్సీలో స్తంభించిన పర్యాటకం
 విశాఖ ఏజెన్సీలో పర్యాటకం పూర్తిగా స్తంభించిపోయింది. పర్యాటకులు లేక అరకు బోసిపోయింది.  విశాఖ నగరంలోని జీవీఎంసీ వద్ద ఉద్యోగులు న్యాయవాదులు దీక్షలు కొనసాగిస్తున్నారు. వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు సిరిపురం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు.
 
 పార్వతీపురంలో రైల్‌రోకో
 విజయనగరం జిల్లా పార్వతీపురం స్టేషన్‌లో  రాయగడ నుంచి విశాఖ వెళ్లే రైలును సమైక్య వాదులు కొద్దిసేపు అడ్డుకున్నారు.  విజయనగరంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి  జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్, వీఆర్‌సీ, గాంధీబొమ్మ సెంటర్లలో రోడ్డుపైన అల్పాహారం తిని, తలకిందులుగా నడిచి నిరసన వ్యక్తం చేశారు. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి  ఆధ్వర్యంలో  భారీ ర్యాలీ చేపట్టారు. నెల్లూరులో మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును సమైక్యవాదులు అడ్డుకున్నారు. తిరుపతిలో భారీ ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, వంటావార్పు, నిరాహార, రిలేదీక్షలు కొనసాగాయి. అలిపిరి వద్ద ఆర్టీసీ ఉద్యోగ, కార్మికుల ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా విద్యార్థులతో మాక్ స్కూల్ నిర్వహించారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది డప్పులు వాయిస్తూ ర్యాలీ చేశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట బైఠాయించారు.
 
 చిత్తూరు నుంచి కాణిపాకం వరకు న్యాయశాఖ ఉద్యోగుల పాదయాత్ర
 న్యాయశాఖ ఉద్యోగులు  చిత్తూరు నుంచి కాణిపాకం వరకు పాదయాత్ర నిర్వహించి రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాలని ప్రార్థించారు. అనంతరం ఈనెల 18 నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌సీపీ నేతల ర్యాలీ, ఆలయ పూజారులు హోమం నిర్వహించారు.
 
 సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మల సమాధికి పోలీసుల బ్రేక్
 కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలకు సమాధి కట్టేందుకు ఆందోళనకారులు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. డోన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నేత బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు.   గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరులో నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీలు జరిగాయి.
 
 నేడు సమైక్య సింహ గర్జన
 విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం సమైక్య సింహ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవింద్ తెలిపారు.
 
 జెండా ఎగరేసే అర్హత మంత్రులకు లేదు: సమైక్యాంధ్ర జేఏసీ
 సీమాంధ్రుల ప్రయోజనాలను, ఆకాంక్షలను కాపాడలేని ఈ ప్రాంత మంత్రులకు ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసే అర్హత లేదని సమైక్యాంధ్ర జేఏసీ స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గత 14 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తుంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు వారి ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో నిందించారు. మంత్రులు జెండాలు ఎగురవేస్తే విద్యార్థి ఉద్యోగ సంఘాలు, ప్రజలు వారిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
 
 జగన్ ప్రభంజనం తట్టుకోలేకే....
 వేర్పాటుకు కిరణ్, బాబు పచ్చజెండా  ధ్వజమెత్తిన శోభానాగిరెడ్డి
 రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకోలేకే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎంఎల్‌ఏ శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో   మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలో వేలాదిమంది సమైక్యవాదులతో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  కిరణ్, చంద్రబాబుల చేతకాని తనమే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి కారణమన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఏల తరహాలోనే ఆ రెండు పార్టీల శాసనసభ్యులు రాజీనామాలు చేసినట్లయితే తెలంగాణ ప్రకటన వెలువడేది కాదన్నారు.
 
  కాంగ్రెస్, టీడీపీ నేతలపై జనాగ్రహం
 విభజన నిర్ణయాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యతిరేకించని టీడీపీ నేతలపై జనాగ్రహం కొనసాగుతోంది. సోనియా, చంద్రబాబు, టీఆర్‌ఎస్ అధనేత కేసీఆర్  దిష్టిబొమ్మల దహనాలు ఎక్కడికక్కడ జరగ్గా, పలుచోట్ల కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి ఎన్జీవోల ఆగ్రహం చవిచూడాల్సివచ్చింది. పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని అడ్డుకుని రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ప్రధాన కారణమంటూ ఆయనపై మండిపడ్డారు.  గుంతకల్లులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తాను సమైక్యవాదులు అడ్డుకుని రాజీనామా చేయాలని పట్టుబట్టగా, ఆయన వారినుద్దేశించి బ్లడీ ఫూల్స్ అంటూ దూషించడం వివాదాస్పదంగా మారింది.
 
 ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. విశాఖలో చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు  కార్యాలయాన్ని విద్యార్ధులు ముట్టడించారు. చిత్తూరులో సత్యవేడులో టీడీపీ ఎమ్మెల్యే హేమలతను అడ్డుకోవటంతో తప్పని పరిస్థితిలో ర్యాలీలో పాల్గొన్నారు.

గడికోట, రవీంద్రనాథ్‌ల నిరశనకు నీరా ‘జనం’ రెండోరోజుకు చేరిన దీక్షలు
 సాక్షి నెట్‌వర్క్: వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీమేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి  చేపట్టిన ఆమరణ దీక్ష రెండవరోజుకు చేరుకుంది. వేలసంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తరలివచ్చి దీక్షలకు సంఘీభావం ప్రకటించారు.  రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు ఎస్.రఘురామిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీకర్ కె.సురేష్‌బాబు దీక్షాశిబిరాన్ని సందర్శించారు. సమైక్యాంధ్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  ప్రకాశం జిల్లా పర్చూరులో వైఎస్సార్ సీపీ నేత గొట్టిపాటి నర్సయ్య కుమారుడు భరత్ చేపట్టిన    ఆమరణ దీక్ష నాలుగోరోజుకు చేరింది. విశాఖ జిల్లా  ఆనందపురంలో వైఎస్సార్‌సీపీ నేత కోరాడ రాజబాబు చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది.  విజయనగరం జిల్లా గజపతినగరంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు మక్కువ శ్రీధర్ మంగళవారం నుంచి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement