
పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి హఠాన్మరణం
గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూత
* కేసీఆర్, రాహుల్, ఉత్తమ్, జానా సంతాపం
* నేడు మెదక్ జిల్లా పంచగామలో అంత్యక్రియలు
* హాజరవనున్న సీఎం, కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్/నారాయణఖేడ్ రూరల్: ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పట్లోళ్ల కిష్టారెడ్డి (73) మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. హైదరాబాద్‌లోని నివాసంలో సోమవారం రాత్రి రోజువారీ కార్యక్రమాలు ముగించుకుని నిద్రపోయిన ఆయన మంగళవారం ఉదయానికి నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
సమీపంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. నిద్రలో తీవ్రమైన గుండెపోటు రావడమే మరణానికి కారణమని తేల్చారు. అభిమానుల సందర్శనార్థం కిష్టారెడ్డి భౌతిక కాయాన్ని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు తరలించారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్వగ్రామం పంచగామలోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొననున్నారు.
కిష్టారెడ్డి మృతిపట్ల ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కిష్టారెడ్డి కుటుంబసభ్యులతో రాహుల్ ఫోనులో మాట్లాడారు. వారికి ధైర్యవచనాలు చెప్పారు. కిష్టారెడ్డి, తాను ఒకే జిల్లాకు చెందిన వారిమంటూ కేసీఆర్ తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిష్టారెడ్డి మరణవార్త తెలియగానే ప్రజాప్రతినిధులు, ఆయన అభిమానులు కిమ్స్‌కు చేరుకున్నారు.
మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు డి.శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తదితరులు పార్థివదేహానికి నివాళులర్పించారు.
నేతల నివాళులు
కిష్టారెడ్డి నిరంతరం ప్రజల కోసం పరితపించే మనిషని ఉత్తమ్ అన్నారు. ఆయన హఠాన్మరణం వ్యక్తిగతంగా తనకు, పార్టీకి తీరని లోటన్నారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారన్నారు. ఆయన 50 ఏళ్లుగా తనతో కలిసి పనిచేసిన మంచి మిత్రుడని జైపాల్‌రెడ్డి అన్నారు. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు జితేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, డీకే అరుణ, దామోదర్ రాజనరసింహ, రాంరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, విజయరామారావు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, మదన్‌మోహన్, వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు కిష్టారెడ్డి పార్థివదేహానికి నిమ్స్‌లో నివాళులు అర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్ సంతాపం ప్రకటించారు.
పంచాయతీ స్థాయి నుంచి...
1942 అక్టోబర్ 2న జన్మించిన కిష్టారెడ్డి ఉస్మానియా నుంచి న్యాయవిద్యలో డిగ్రీ పొందారు. సంగారెడ్డి కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. స్వాతంత్య్రయోధుడు చివురావు షెట్కార్ శిష్యుడైన ఆయన, తన బావ, కాంగ్రెస్ సీనియర్ నేత బాగారెడ్డి ప్రభావంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1970 నుంచి 1980 దాకా పంచగామ సర్పంచ్‌గా, 1981 నుంచి 1986 దాకా పంచాయతీ సమితి అధ్యక్షునిగా పనిచేశారు.
1989, 1999, 2009, 2014ల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999-2004 మధ్య రెండుసార్లు పీఏసీ చైర్మన్‌గా చేశారు. ఆర్నెల్ల క్రితమే మూడోసారి పీఏసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పీఏసీ భేటీలో పాల్గొనేందుకే సోమవారం హైదరాబాద్ వచ్చారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సంజీవరెడ్డి నారాయణఖేడ్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు.