మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జైలు నుంచి ఈ రోజు తెల్లవారుజామున స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కు చెందిన ఏడుగురు సభ్యులు పరారైయ్యారని జైలు అధికారులు వెల్లడించారు. జైలు అధికారులు వెంటనే అప్రమత్తమై ఒకరిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించినట్లు తెలిపారు. అయితే మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.
అందుకోసం పోలీసు బలగాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. అందులోభాగంగా ఖాండ్వా పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. జైలులోని స్నానపు గదులు పగలకొట్టి వారంతా జైలు నుంచి తప్పించుకున్నట్లు వివరించారు. సిమి సభ్యుల పరారీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వారు కత్తులతో దాడి చేశారన్నారు. కానిస్టేబుళ్ల ఇద్దరిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సిమి సభ్యులంతా విచారణ ఖైదీలుగా జైలులో ఉన్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.