Khandwa jail
-
ఇంకా చిక్కలేదట!
రూర్కెలాలో పట్టుబడ్డ‘సిమి’ ఉగ్రవాదులు ఎన్ఐఏ వెబ్సైట్లో వీరు ఇంకా వాంటెడ్‌గానే.. వివరాలు అప్డేట్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం సిటీబ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని... కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భారీ బ్యాంకు చోరీతో పాటు దేశవ్యాప్తంగా నేరాలకు పాల్పడిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులు ఇంకా చిక్కలేదట. గత నెల 17న ఒడిశాలోని రూర్కెలాలో పట్టుబడ్డారు కదా..! అనుకుంటున్నారా? వాస్తవానికి వీరు దొరికినా... జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెబ్సైట్ ప్రకారం మాత్రం ఇంకా వాంటెడే. ఆ ముష్కరులపై రివార్డులూ ఇంకా కొనసాగుతున్నాయి. ముప్పతిప్పలు పెట్టిన ముష్కరులు... సిమి ఉగ్రవాది అబు ఫైజల్ నేతృత్వంలో జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్, మహ్మద్ అస్లం అలియాస్ బిలాల్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్, మహ్మద్ ఎజాజుద్దీన్ తదితరులు 2013 అక్టోబర్ 1న మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. అదే ఏడాది డిసెంబర్లో అబు ఫైజల్‌ను అరెస్టుచేశారు. మిగిలిన ఐదుగురు ఉగ్రవాదులు ‘మాల్-ఏ-ఘనీమఠ్’ (ఉగ్రవాద చర్యలకు నిధుల సమీకరణ) కోసం ‘జమాత్ అల్ ముజాహిదీన్’ పేరుతో కొత్త మాడ్యుల్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని ఓ ఫైనాన్స్ సంస్థతో పాటు దేశ వ్యాప్తంగా అనేక నేరాలు చేశారు. గతేడాది మెదక్ జిల్లా సంగారెడ్డికి చేరుకున్న మహ్మద్ అస్లం అలియాస్ బిలాల్, మహ్మద్ ఎజాజుద్దీన్ అక్కడి ప్రభుత్వ కళాశాల సమీపంలో ఓ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. సూర్యాపేట ఉదంతంతో 2015 ఏప్రిల్ 4న జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరూ హతమయ్యారు. బిజ్నూర్ కేసులో రివార్డ్స్ ప్రకటన.. జానకీపురం ఎన్‌కౌంటర్‌కు ముందే ఈ ఐదుగురు ముష్కరులతో ఖాండ్వా ప్రాంతానికే చెందిన మరో ఉగ్రవాది మహ్మద్ సాలఖ్ జత కట్టాడు. అనేక నేరాలను జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్ అలియాస్ పప్పులతో కలిసి చేశాడు. జానకీపురం ఉదంతం జరిగినప్పుడు మాత్రం మిగిలిన నలుగురూ తెలంగాణకు రాలేదు. దీనికి ముందు ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లాలో వీరు ఆశ్రయం పొందుతున్న ఇంట్లో 2014 సెప్టెంబర్ 12న ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్ తీవ్రంగా గాయపడ్డాడు. జానకీపురం ఉదంతం తర్వాత గతేడాది ఏప్రిల్ 24న ఈ కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. చిక్కినా ఆ జాబితాలోనే... దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు ఈ నలుగురు ఉగ్రవాదుల్ని వాంటెడ్ జాబితాలో చేర్చిన దర్యాప్తు సంస్థ ఒక్కొక్కరిపై రూ.10 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. ఈ అంశాన్ని తమ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘వాంటెడ్ జాబితా’లో పొందుపరిచారు. గత నెల 17న ఒడిశాలోని రూర్కెలా ప్రాంతంలో తెలంగాణ-ఒడిశా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులతో పాటు వారికి సహాయంగా ఉంటున్న ఓ ఉగ్రవాది తల్లి సైతం పట్టుబడింది. వీరిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇది జరిగి నెల దాటినా... ఇప్పటికీ ఎన్ఐఏ వెబ్సైట్ ప్రకారం మాత్రం ఈ ముష్కరులు వాంటెడ్‌గానే ఉన్నారు. సైట్‌ను అప్డేట్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎన్ఐఏ వెబ్సైట్ ప్రకారం సిమి ఉగ్రవాదులు ‘పరారీలోనే’ ఉండిపోయారు. -
‘టార్గెట్ చొప్పదండి’ ఎలా సాధ్యమైంది?
స్థానిక సహకారం లేకుండా ఆపరేషన్ అసాధ్యం హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని, జమాత్ అల్ ముజాహిదీన్ పేరుతో కొత్త ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిన ముష్కరులకు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఉన్న ఎస్బీఐ బ్యాంకును టార్గెట్ చేయడం ఎలా సాధ్యమైంది..? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర నిఘా వర్గాలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సైతం ఇదే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. స్థానిక సహకారం లేకుండా అంత పక్కాగా దోపిడీ ఆపరేషన్ చేపట్టడం సాధ్యం కాదనే కోణంలో ఆరా తీస్తోంది. కరీంనగర్లో గతంలోనూ ఉగ్రవాద ఛాయలు ఉండటంతో వారి అనుచరులు, సానుభూతిపరులపై కూపీ లాగుతోంది. మరోవైపు ఈ ఏడాది ఆగస్టులో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రూ.నాలుగు కోట్ల విలువైన సొత్తు, నగదు దుండగులు ఎత్తుకుపోయారు. ఈ కేసూ ఇప్పటివరకు కొలిక్కిరాకపోవడంతో ఉగ్రవాదుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పక్కా రెక్కీ తరవాతే దోపిడీ... కరీంనగర్ జిల్లాలో ఏడో నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న చొప్పదండిలో జరిగిన ఎస్బీఐ బ్యాంకు దోపిడీకి ఉగ్రవాదులు పక్కా ప్రణాళిక ప్రకారం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న తుపాకులతో వచ్చిన నలుగురు ముష్కరులు బ్యాంకు పని చేయడం ప్రారంభించడానికి ముందే లోపలకు ప్రవేశించారు. అప్పటినుంచి ఉదయం 9.30 గంటల వరకు ఖాతాదారులతో సహా వచ్చిన వారందరినీ ఓ గదిలో బంధించారు. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లకు తుపాకులు గురిపెట్టి లాకర్‌ను తెరిపించారు. అందులో ఉన్న రూ.46 లక్షల నగదు బ్యాగుల్లో సర్దుకుని ముందే సిద్ధంగా ఉంచుకున్న రెండు ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. దీనికోసం స్థానికంగా కొందరి సహకారంతో ఏదో ఒక ప్రాంతంలో బస చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దోపిడీకి సహకరించిన వారిని కనిపెట్టడంపై దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు బుర్ధ్వాన్ కుట్రలో పశ్చిమ బెంగాల్లో వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణమైన శారదా గ్రూప్ స్కామ్ నగదు సైతం వినియోగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలను సేకరించింది. దీంతో బుర్ధ్వాన్ కుట్ర కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు, నిఘా వర్గాలు ప్రధానంగా పశ్చిమబెంగాల్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఉన్న అక్రమ మదర్సాలపై దృష్టి పెట్టాయి. వీటిలో కొన్నింటిని జమాత్ అల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు బాంబు ఫ్యాక్టరీలుగా వినియోగించుకునే అవకాశం ఉందని అనుమానిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పశ్చిమ బెంగాల్, బీహార్‌ల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనసమర్థ ప్రాంతాలతో పాటు విమానాశ్రయాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేయాల్సిందిగా సూచించడంతో పోలీసు వర్గాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. బాంబులు బంగ్లాదేశ్ పంపేందుకే: ఎన్ఐఏ జమాత్ అల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు బుర్ధ్వాన్‌లో తయారు చేస్తున్న బాంబులు బంగ్లాదేశ్‌కు రవాణా చేసేందుకేనని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన నలుగురిలో ఇద్దరు మహిళలు జ్యుడీషియల్ కస్టడీలో, అబ్దుల్ హకీం ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపింది. నాలుగో నిందితుడు బద్రే ఆలంను ఆర్థిక సహకారం సహా వివిధ కోణాల్లో విచారిస్తున్నట్లు పేర్కొంది. బుర్ధ్వాన్లోని పేలుడు స్థలాన్ని ఎన్ఐఏ డీజీ శరద్‌కుమార్ శుక్రవారం సందర్శించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసి, వీరిపై రివార్డు సైతం ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఉగ్రవాదుల కదలికలపై మరింత నిఘా హైదరాబాద్: రాష్ట్రంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల, స్వదేశీ ఉగ్రవాదుల కార్యకలాపాలైపై ఇంటెలిజెన్స్ అధికారులతో రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ శుక్రవారం సమీక్ష జరిపారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని బ్యాంకు నుంచి గత పిబ్రవరిలో రూ.46 లక్షల దోపిడీ ఘటనను డీజీపీ తీవ్రంగా పరిగణించారు. జాతీయ దర్యాప్త సంస్థ (ఎన్ఐఎ) జరిపిన విచారణలో దోపిడీకి పాల్పడింది ఫైజల్ ముఠాగా తేలింది. దోపిడి సొమ్మును ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుతున్నారని తెలిసింది. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఒక ప్రముఖ ఐటీ కంపెనీ దిల్షుక్నగర్ పేలుళ్లతో వెనుకకు వెళ్లిపోయిందంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో గుర్తు చేసిన సీఎం కేసీఆర్.. మళ్లీ ఇలాంటివి పునరావృతం కారాదన్నారు. చొప్పదండి ఘటన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో సిమి కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు తెలిసింది. -
ఖాండ్వా జైలు నుంచి పరారైన సిమి సభ్యుల్లో ఒకరు అరెస్ట్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జైలు నుంచి ఈ రోజు తెల్లవారుజామున స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కు చెందిన ఏడుగురు సభ్యులు పరారైయ్యారని జైలు అధికారులు వెల్లడించారు. జైలు అధికారులు వెంటనే అప్రమత్తమై ఒకరిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించినట్లు తెలిపారు. అయితే మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. అందుకోసం పోలీసు బలగాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. అందులోభాగంగా ఖాండ్వా పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. జైలులోని స్నానపు గదులు పగలకొట్టి వారంతా జైలు నుంచి తప్పించుకున్నట్లు వివరించారు. సిమి సభ్యుల పరారీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వారు కత్తులతో దాడి చేశారన్నారు. కానిస్టేబుళ్ల ఇద్దరిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సిమి సభ్యులంతా విచారణ ఖైదీలుగా జైలులో ఉన్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.