ఇంకా చిక్కలేదట!
రూర్కెలాలో పట్టుబడ్డ‘సిమి’ ఉగ్రవాదులు
ఎన్‌ఐఏ వెబ్‌సైట్‌లో వీరు ఇంకా వాంటెడ్‌గానే..
వివరాలు అప్‌డేట్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం
సిటీబ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని... కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భారీ బ్యాంకు చోరీతో పాటు దేశవ్యాప్తంగా నేరాలకు పాల్పడిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులు ఇంకా చిక్కలేదట. గత నెల 17న ఒడిశాలోని రూర్కెలాలో పట్టుబడ్డారు కదా..! అనుకుంటున్నారా? వాస్తవానికి వీరు దొరికినా... జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వెబ్‌సైట్ ప్రకారం మాత్రం ఇంకా వాంటెడే. ఆ ముష్కరులపై రివార్డులూ ఇంకా కొనసాగుతున్నాయి.
ముప్పతిప్పలు పెట్టిన ముష్కరులు...
సిమి ఉగ్రవాది అబు ఫైజల్ నేతృత్వంలో జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్, మహ్మద్ అస్లం అలియాస్ బిలాల్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్, మహ్మద్ ఎజాజుద్దీన్ తదితరులు 2013 అక్టోబర్ 1న మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. అదే ఏడాది డిసెంబర్‌లో అబు ఫైజల్‌ను అరెస్టుచేశారు. మిగిలిన ఐదుగురు ఉగ్రవాదులు ‘మాల్-ఏ-ఘనీమఠ్’ (ఉగ్రవాద చర్యలకు నిధుల సమీకరణ) కోసం ‘జమాత్ అల్ ముజాహిదీన్’ పేరుతో కొత్త మాడ్యుల్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని ఓ ఫైనాన్స్ సంస్థతో పాటు దేశ వ్యాప్తంగా అనేక నేరాలు చేశారు. గతేడాది మెదక్ జిల్లా సంగారెడ్డికి చేరుకున్న మహ్మద్ అస్లం అలియాస్ బిలాల్, మహ్మద్ ఎజాజుద్దీన్ అక్కడి ప్రభుత్వ కళాశాల సమీపంలో ఓ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. సూర్యాపేట ఉదంతంతో 2015 ఏప్రిల్ 4న జానకీపురంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరూ హతమయ్యారు.
బిజ్నూర్ కేసులో రివార్డ్స్ ప్రకటన..
జానకీపురం ఎన్‌కౌంటర్‌కు ముందే ఈ ఐదుగురు ముష్కరులతో ఖాండ్వా ప్రాంతానికే చెందిన మరో ఉగ్రవాది మహ్మద్ సాలఖ్ జత కట్టాడు. అనేక నేరాలను జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్ అలియాస్ పప్పులతో కలిసి చేశాడు. జానకీపురం ఉదంతం జరిగినప్పుడు మాత్రం మిగిలిన నలుగురూ తెలంగాణకు రాలేదు. దీనికి ముందు ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లాలో వీరు ఆశ్రయం పొందుతున్న ఇంట్లో 2014 సెప్టెంబర్ 12న ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్ తీవ్రంగా గాయపడ్డాడు. జానకీపురం ఉదంతం తర్వాత గతేడాది ఏప్రిల్ 24న ఈ కేసు ఎన్‌ఐఏకు బదిలీ అయింది.
చిక్కినా ఆ జాబితాలోనే...
దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు ఈ నలుగురు ఉగ్రవాదుల్ని వాంటెడ్ జాబితాలో చేర్చిన దర్యాప్తు సంస్థ ఒక్కొక్కరిపై రూ.10 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. ఈ అంశాన్ని తమ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘వాంటెడ్ జాబితా’లో పొందుపరిచారు. గత నెల 17న ఒడిశాలోని రూర్కెలా ప్రాంతంలో తెలంగాణ-ఒడిశా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులతో పాటు వారికి సహాయంగా ఉంటున్న ఓ ఉగ్రవాది తల్లి సైతం పట్టుబడింది. వీరిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇది జరిగి నెల దాటినా... ఇప్పటికీ ఎన్‌ఐఏ వెబ్‌సైట్ ప్రకారం మాత్రం ఈ ముష్కరులు వాంటెడ్‌గానే ఉన్నారు. సైట్‌ను అప్‌డేట్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎన్‌ఐఏ వెబ్‌సైట్ ప్రకారం సిమి ఉగ్రవాదులు ‘పరారీలోనే’ ఉండిపోయారు.