Students Islamic Movement of India
-
సిమిపై మరో ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ శాంతి, మత సామరస్యానికి భంగం కలిగిస్తున్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)పై నిషేధాన్ని కేంద్ర ప్రభ్వుం మరో అయిదేళ్లు పొడిగించింది. ఈ విషయాన్ని హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం ‘ఎక్స్’లో ప్రకటించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)కింద సిమిని చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా సుమారు 10 రాష్ట్రాల వినతి మేరకు.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా మొదటిసారిగా కేంద్రం 2001లో సిమిని నిషేధించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 1977లో సిమి ఏర్పాటైంది. భారత్‌ను ముస్లిం దేశంగా మార్చాలన్న అజెండాతో పనిచేస్తున్నట్లు ఈ సంస్థపై ఆరోపణలొచ్చాయి. గత కొన్నేళ్లలో సిమి కార్యకర్తలపై ఉగ్రవాద సంబంధ 17 కేసులు నమోదు కాగా, 27 మంది సభ్యులను అరెస్ట్ చేసినట్లు హోం శాఖ తెలిపింది. -
అనంతగిరిలో టెర్రర్ క్యాంప్!
ఉగ్ర శిబిరం ఏర్పాటుకు కుట్ర ► సిమీ చీఫ్ సఫ్దార్ నగోరీపై సిట్‌లోనూ కేసు ► 2008లో నగరానికి వచ్చి వెళ్లిన సఫ్దార్ ► జీవితఖైదు విధించిన ఇండోర్ కోర్టు సాక్షి, హైదరాబాద్: నిషేధిత ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’(సిమీ) చీఫ్ సఫ్దార్హుసేన్ నగోరీ... దేశద్రోహం కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ప్రత్యేక న్యాయస్థానం సఫ్దార్కు సోమవారం జీవిత ఖైదు విధించింది. గతంలో ఈ నగోరీ నగరయువతనూ ఉగ్రవాదం వైపు మళ్లించడానికి యత్నించాడు. నగర శివారులోని అనంతగిరిలో ఉగ్రవాద శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. ఈ మేరకు నగోరీపై సిటీలోనూ ఓ కేసు ఉంది. ఇలా చేయడం ద్వారా దేశంపై యుద్ధానికి యత్నించారనే ఆరోపణలపై నగర నేర పరిశోధన విభాగం అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 2008లో ఈ కేసును నమోదు చేసింది. కోర్టు జీవిత ఖైదు విధించిన నేపథ్యంలో సిటీ పోలీసులు 2008 నాటి కేసు పూర్వాపరాలను పరిశీలించారు. సిమీకి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించిన సఫ్దార్పై దేశవ్యాప్తంగా అనేక కేసులున్నాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడడం, ప్రేరేపించడం, దేశద్రోహం తదితర ఆరోపణలపై ఇవి నమోదయ్యాయి. నగరంలో అనువైన ప్రాంతం కోసం గాలింపు... సిమీ ముసుగులో ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసిన నగోరీ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాడు. మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో ఈ శిబిరాలు పూర్తి చేసిన నగోరీ తదితరులు అనేక మందిని ఉగ్రవాదులుగా తయారు చేశారు. అనంతరం 2007లో ఇతడి కన్ను హైదరాబాద్‌పై పడింది. స్థాని కంగా ఉన్న కొందరి సహకారంతో నగర యువతనూ ఉగ్రవాదం వైపు మళ్లించడానికి కుట్ర పన్నాడు. ఆ ఏడాది మేలో హైదరాబాద్ వచ్చి వెళ్లిన నగోరీ... ఉగ్ర శిబిరం ఏర్పాటుకు అనువైన ప్రాంతం కోసం గాలించాడు. నగర శివార్లలో ఉన్న అనంతగిరి అడవుల్ని సందర్శించిన ఇతగాడు అక్కడే శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. 2008 మార్చి 27న నగోరీ సహా అతడి అనుచరుల్ని మధ్యప్రదేశ్ పోలీసులు ఇండోర్‌లో అరెస్టు చేశారు. అతడిని విచారించిన ఇండోర్ పోలీసులు హైదరాబాద్‌నూ టార్గెట్ చేసినట్లు గుర్తించారు. అనుమానితుడి అరెస్టుతో వెలుగులోకి... 2008 సెప్టెంబర్‌లో నగర పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారించిన తరువాత గానీ... సఫ్దార్ ఇక్కడకు వచ్చి వెళ్లిన విషయం వెలుగులోకి రాలేదు. సఫ్దార్తో పాటు అతడి సోదరుడు, అనుచరుల రాకపోకలు, అనంతగిరి ‘టూర్’విషయాలు బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు ఆ కేసులో నగోరీతో పాటు మిగిలిన వారినీ నిందితులుగా చేర్చారు. అప్పట్లో ఇండోర్ జైల్లో ఉన్న నగోరీ తదితరుల్ని పీటీ వారంట్‌పై సిటీకి తీసుకువచ్చి అరెస్టు చేయాలని సిట్ అధికారులు భావించారు. అయితే అరెస్టయిన నిందితుడు చెప్పిన వివరాలు మినహా ఇతర ఆధారాలు లభించకపోవడంతో ఇది కార్యరూపంలోకి రాలేదు. ఇండోర్ కోర్టు సోమవారం నగోరీతో సహా 10 మందికి జీవితఖైదు విధించడంతో సిటీ పోలీసులు నాటి కేసు పూర్వాపరాలను పరిశీలించారు. -
టెర్రర్ టూర్స్
- సిటీకి వచ్చి వెళ్లిన ‘ఇరువురు’ గజ ఉగ్రవాదులు - 2013లో అబు ఫైజల్‌కు చెందిన సిమి మాడ్యుల్ - 2015-16ల్లో ‘పర్యటించిన’ ఆలమ్ జెబ్ అఫ్రిది - ముష్కరుల విచారణల్లో వెలుగులోకి వాస్తవాలు సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా నేరాలకు పాల్పడి ఒడిశాలోని రూర్కెలాలో చిక్కిన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) గ్యాంగ్.., మోస్ట్‌వాంటెడ్‌గా ఉండి బెంగళూరులో పట్టుబడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది అఫ్రిదీల విచారణలో ‘సిటీ లింకులు’ వెలుగులోకి వస్తున్నాయి. అటు సిమి, ఇటు ఐఎం ఉగ్రవాదులు హైదరాబాద్ వచ్చి వెళ్లినట్లు అంగీకరించారు. ఒకరు ‘వ్యవహారం’ కోసం రాగా... మరొకరు ‘కోచింగ్’ కోసం వచ్చినట్లు స్పష్టమైంది. అబు ఫైజల్ నేతృత్వంలో సిమి గ్యాంగ్... రూర్కెలాలో పట్టుబడిన సిమి గ్యాంగ్ 2013లో అబు ఫైజల్ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుంది. దానికి ముందు ఈ గ్యాంగ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో అనేక దోపిడీలు, చోరీలు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబు ఫైజల్ ముంబైలో ఉన్న జుహూ కేంద్రంగా కార్యకలాపాలు సాగించాడు. సిమి మధ్యప్రదేశ్ శాఖకు ప్రెసిడెంట్‌గా పని చేసిన ఇతడు డాక్టర్‌గా చెలామణి అయ్యాడు. దోపిడీలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లోనూ పాల్గొన్నాడు. ఖాండ్వాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సిమి ఉగ్రవాదులు జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్, మహ్మద్ అస్లం అలియాస్ బిలాల్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్, మహ్మద్ ఎజాజుద్దీన్, అబిద్ మీర్జాలతో ముఠా కట్టాడు. పహాడీషరీఫ్ కేంద్రంగా ‘పంపకాలు’... పోలీసులకు చిక్కి ఖాండ్వా జైలుకు చేరడానికి ముందు నేరాల ద్వారా సంపాదించిన సొమ్మును వివిధ ఉగ్రవాద సంబంధ కేసుల్లో అరెస్టయి జైళ్లల్లో ఉన్న, ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు అందించడం తదితర కార్యకలాపాలు సాగించారు. ఇందులో భాగంగానే 2005-07 మధ్య ఈ ముఠా హైదరాబాద్‌కు చేరుకుంది. పహాడీషరీఫ్‌లో ఉన్న ఓ డెన్‌లో షెల్టర్ ఏర్పాటు చేసుకుని దాదాపు 20 రోజుల పాటు గడిపింది. ఈ సమయంలోనే నగరంలో ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ‘జిహాదీ భావజాలాన్ని’ ప్రచారం చేయడానికి ప్రయత్నించింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ కాయిదాకు చెందిన కీలక నేత అన్వర్ అల్ అవల్కీ రాసిన ‘44 వేస్ టు సపోర్ట్ జిహాద్’ అనే పుస్తకాన్ని సేకరించింది. దీన్ని స్థానిక భాషల్లోకి అనువదించి పంపకాలు చేపట్టింది. ఉర్దూలో ముద్రించిన ప్రతిని పహాడీషరీఫ్ కేంద్రంగా నగరంలో పంపిణీ చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఖాండ్వా ఎస్కేప్ తర్వాత ఫైజల్, అబిద్ వెంటనే పోలీసులకు చిక్కగా... ఎజాజ్, అస్లంలు గతేడాది నల్లగొండ జిల్లాలో ఎన్కౌంటర్ అయ్యారు. మిగిలిన వారితో జట్టు కట్టిన సాలఖ్ సహా నలుగురు రూర్కెలాలో పట్టుబడ్డారు. అఫ్రిది... ఐఎం టు జునూద్... గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జోహాపురాకు చెందిన ఆలమ్ జెబ్ అఫ్రిది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ద్వారా ఉగ్రవాదబాటపట్టాడు. 2008లో జరిగిన అహ్మదాబాద్, సూరత్, జైపూర్ పేలుళ్లలో కీలకపాత్ర పోషించాడు. పోలీసుల నిఘా పెరగడంతో బెంగళూరులోని దొడ్డనాగమంగళంలోని వినాయకనగర్‌లో మారు పేరుతో తలదాచుకున్నాడు. ఇక్కడ కొన్ని విద్రోహక చర్యలు చేయడం, సీసీ కెమెరా ఫుటేజ్‌లు బయటకు రావడంతో మళ్లీ పోలీసుల భయం పెరిగింది. దీంతో సిరియా కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నెరపుతున్న షఫీ ఆర్మర్‌ను సంప్రదించిన అఫ్రిది తానూ సిరియా వచ్చేస్తానన్నాడు. దీంతో కొత్తగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ విషయం ఇతడికి చెప్పిన షఫీ... హైదరాబాద్ వెళ్లి ఆ మాడ్యుల్‌కు సహకరించమని ఆదేశించాడు. రెండుసార్లు నగరానికి ‘టూర్’.... దీంతో సోషల్ మీడియా ద్వారా నగరానికి చెందిన నఫీస్ ఖాన్‌ను సంప్రదించిన అఫ్రిది గతేడాది టోలిచౌకి వచ్చి అతడిని కలిసి వెళ్లాడు. ఆ సమయంలో ఉగ్రవాదుల రిక్రూట్మెంట్తో పాటు శిక్షణ, లావాదేవీలు తదితర అంశాలను చర్చించాడు. విధ్వంసాలకు అవసరమైన బాంబుల్ని తయారు చేసే ప్రయత్నాల్లో భాగంగా నఫీస్ ఖాన్ ‘స్థానిక పదార్థాల’తోనే నాలుగు బకెట్ బాంబుల్ని రూపొందించాడు. ఇవి పేలడానికి అవసరమైన డిటోనేటర్లును తయారు చేయడం మాత్రం ఇతడి వల్లకాలేదు. దీంతో నఫీస్ బాంబుల తయారీలో నిష్ణాతుడైన అఫ్రిదీ సహాయం కోరాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరిలో మరోసారి హైదరాబాద్ వచ్చిన అఫ్రిది... రసాయనాలు వినియోగించి డిటోనేటర్లు ఎలా తయారు చేయాలనేది ‘బోధించి’ వెళ్లాడు. ఈ ప్రయత్నాలు కార్యరూపంలోకి రాకముందే ‘జునూద్’ మాడ్యుల్‌తో పాటు అఫ్రిది సైతం చిక్కడంతో భారీ ముప్పు తప్పినట్లైంది. -
మహా ముదుర్లు
‘ఖాండ్వా’ తర్వాత రైలు పట్టాలపై నడక కుక్కలపై ‘కాల్పుల’ {పాక్టీస్ రూర్కెలాలో చిక్కిన ఉగ్రవాదుల తీరిదీ నాలుగేసి స్కెచ్‌లతో పోలీసుల వేట సిటీబ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి అబు ఫైజల్ నేతృత్వంలో తప్పించుకుని... కరీంనగర్ సహా దేశ వ్యాప్తంగా నేరాలు చేసి... ఒడిశాలోని రూర్కెలాలో బుధవారం చిక్కిన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకు (సిమి) చెందిన నలుగురు ఉగ్రవాదులు జకీర్ హుస్సేన్, షేక్ మహబూబ్, అంజాద్, సలాఖ్ మహాముదుర్లని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు మహబూబ్ తల్లి నజ్మాబీ కూడా చిక్కింది. వీరిని పట్టుకోవడానికి తెలంగాణ పోలీసులతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దాదాపు ఏడాదిగా వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్బీఐలో చోరీ చేసిన ఈ ముఠాలో ఇద్దరు ఉగ్రవాదులు గత ఏడాది నల్లగొండ జిల్లా జానకీపురంలో ఎన్కౌంటర్లో హతమయ్యారు. గత నెలలో బెంగళూరులో తెలంగాణ పోలీసు అధికారిపై హత్యాయత్నం చేసిన ఆలం జబ్ అఫ్రిదీతోనూ వీరికి సంబంధా లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టాలపై 180 కి.మీ. ప్రయాణం ఈ గ్యాంగ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబు ఫైజల్ నేతృత్వంలో 2013 అక్టోబర్ 1న ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుంది. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో కానిస్టేబుళ్లపై హత్యాయత్నం చేసి పారిపోయింది. దీంతో అంతా అప్రమత్తమై తనిఖీలు, సోదాలు చేపడతారనే ఉద్దేశంతో ముఠా సభ్యులు రైలు పట్టాల బాట పట్టారు. ఖాండ్వా నుంచి 180 కి.మీ. దూరంలో ఉన్న బర్వానీ వరకు పట్టాలపై నడుచుకుంటూనే వెళ్లారు. దారిలో ఉన్న రైల్వే స్టేషన్లలోనే తింటూ, పట్టాల పక్కనే విశ్రాంతి తీసుకుంటూ జారుకున్నారు. కుక్కలపై కాల్పులతో సాధన కరడుగట్టిన ఈ ఉగ్రవాదులు నిల్చున్న వారినే కాదు... పరిగెత్తుతున్న.. కదులుతున్న వారినీ గురి తప్పకుండా కాల్చడంలో దిట్టలని అధికారులు చెబుతున్నారు. బుల్లెట్లు తేలిగ్గా దొరకవు కాబట్టి.. ఒక్క తూటా కూడా వృథా కాకుండా... ఒక్కోదానికి ఒక్కో ప్రాణం పోయేలా ప్రాక్టీస్ చేయాలని నిశ్చయించుకున్నారు. దీని కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోని అనేక అటవీ ప్రాంతాలతో పాటు గోవా శివార్లలోనూ పరుగెత్తే కుక్కలపై కాల్పులు జరుపుతూ తర్ఫీదు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. 2014 జనవరి 16న ఒడిశా అటవీ ప్రాంతం... కేరళలోని అలూవా ప్రాంతంలో వీరు శిక్షణ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మోటార్ సైకిళ్లపై తిరుగుతూనే... ఈ ముష్కరులు దాదాపు ప్రతి నేరంలోనూ కేవలం మోటార్ సైకిళ్లనే వినియోగించారు. వీటిలో అత్యధికం చోరీ చేసినవే. ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నప్పుడు అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న బైక్స్‌పై పారిపోయారు. చొప్పదండి బ్యాంకు చోరీ తర్వాతా ద్విచక్ర వాహనాల పైనే ఉడాయించారు. గత ఏడాది సూర్యాపేట కాల్పుల తర్వాత జానకీపురం పరిసరాల్లో సంచరించిన ఎజాజుద్దీన్, అస్లంలు స్థానికులను బెదిరించి లాక్కున్నబైక్స్ పైనే పారిపోవాలని చూశారు. మహబూబ్‌నగర్ టౌన్‌లోనూ మోటార్ సైకిళ్లు చోరీ చేశారు. నాలుగేసి స్కెచ్‌లతో రంగంలోకి... జానకీపురం ఎన్కౌంటర్ తర్వాత మిగిలిన ముష్కరులను పట్టుకోవడానికి నిఘా వర్గాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వీరు ఎప్పుడైనా బస చేసిన రాష్ట్రం దాటి పారిపోవడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే షెల్టర్ తీసుకునేవారు. సంగారెడ్డిని ఎంచుకోవడానికీ... రూర్కెలాలో తల దాచుకోవడానికీ ఇదే కారణమని అధికారులు చెబుతున్నారు. వేషాలు మార్చడంలోనూ వీరు దిట్టలని గుర్తించిన అధికారులు ఒక్కో ఉగ్రవాదికి సంబంధించి నాలుగేసి స్కెచ్‌లు (రూపాలు) తయారు చేసి దేశవ్యాప్తంగా గాలించారు. అఫ్రిదీతోనూ లింకులు 2014 మే 1న చెన్నై రైల్వేస్టేషన్లో బెంగళూరు-గువాహటి రైల్లో పేలుడు... అదే ఏడాది డిసెంబర్ 29న బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్ పేలుడుతోనూ ఈ ముఠాకు సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి గత నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు బెంగళూరులో ఆలం జబ్ అఫ్రిదిని అరెస్టు చేశారు. నిందితుడు గతంలో సిమిలో పని చేయడంతో ఈ ముష్కరులతోనూ సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. రూర్కెలాలో చిక్కిన ఉగ్రవాదులు విధ్వంసాలకు అవసరమైన నిధుల కోసం కొన్ని జ్యువెలరీ దుకాణాలు, ఫైనాన్స్ సంస్థల్లో చోరీలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ ఉగ్రవాదులు తలదాచుకోవడంతో పాటు బాంబులు తయారు చేయడానికి వినియోగించేలా స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్, నెల్లూరు, చిత్తూరు పరిసరాల్లో స్థలాల కొనుగోలుకు యత్నించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. -
ఏపీ రాజధాని ప్రాంతమే లక్ష్యం!
విజయవాడ, గుంటూరుల్లో దోపిడీకి ‘సిమి’ ఉగ్రవాదుల రెక్కీ మృతుల బస్ టికెట్ల ఆధారంగా అంచనా హైదరాబాద్: స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులు.. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలోని ఏపీ రాజధాని ప్రాంతాన్ని టార్గెట్‌గా పెట్టుకుని దోపిడీకి రెక్కీ పూర్తి చే సినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ నిర్వహించడానికి వెళ్తుండగానే అనుకోకుండా సూర్యాపేట ఉదంతం చోటు చేసుకుందని అంచనా వేస్తున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టి... దాదాపు 60 గంటల తర్వాత జానకీపురం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదుల వద్ద లభించిన బస్సు టిక్కెట్ల ఆధారంగా అధికారులు ఈ అభిప్రాయానికి వచ్చారు. శనివారం ఉదయం జానకీపురం ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు మృతులిద్దరి జేబులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సెల్‌ఫోన్ బ్యాటరీ, పర్సు, రూ.23 వేల నగదు, బాదం పప్పులు, మామిడి కాయ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు బస్సు టికెట్లు కూడా పోలీసులకు దొరికాయి. వాటిలో.. గత నెల 28వ తారీఖు నాటి హైదరాబాద్-విజయవాడ టికెట్ ఒకటి కాగా.. రెండోది 30న గుంటూరు-విజయవాడల మధ్య ప్రయాణానికి సంబంధించిన ది. 29న విజయవాడ చేరుకున్న ఉగ్రవాదులు 29, 30 తేదీల్లో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో తిరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ముష్కరులు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలుకు చేరడానికి ముందు, అక్కడ నుంచి తప్పించుకున్నాక చేసిన నేరాల్లో దోపిడీలు, బందిపోటు దొంగతనాలే ఎక్కువ. దోపిడీ డబ్బును ఉగ్ర కార్యకలాపాలకు, జైళ్లలోని ఉగ్రవాదుల కుటుంబాలకు అందించడానికి వినియోగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరి కదలికలు చొప్పదండి ఉదంతం స్పష్టం చేసింది. ముష్కరులు 2014లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ సంచరించినట్లుగా నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి. వారాంతంలో కొల్లగొట్టే పథకం... గత వారాంతంలోనే తమ లక్ష్యాన్ని కొల్లగొట్టాలనే ఉద్దేశంతో.. ముష్కరులు తమ షెల్టర్ జోన్ నుంచి ఆయుధాలతో విడివిడిగా బయలుదేరి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. చొప్పదండి దోపిడీతో పాటు 2013 నుంచి వీరు చేసిన ఐదు దోపిడీలు, బందిపోటు దొంగతనాల్లో మూడు వారాంతాల్లో చేసినవే కావడం గమనార్హం. అదేవిధంగా గత వారాంతంలో రాష్ట్రంలో ఎంపిక చేసుకున్న టార్గెట్‌ను కొల్లగొట్టేందుకు వారు కుట్ర పన్నినట్లు స్పష్టమవుతోంది. బుధవారం రాత్రి (ఒకటో తేదీ) హైదరాబాద్ నుంచి ముష్కరులు విజయవాడకు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. గురువారమే అక్కడకు చేరుకున్నా... ఆ రోజు స్థానిక పరిస్థితుల్ని మరోసారి గమనించి శుక్ర, శనివారాల్లో (3, 4 తేదీలు) పంజా విసిరేవారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తు చేయడానికి నిఘా విభాగానికి చెందిన ప్రత్యేక బృందం తెలంగాణ నుంచి రాష్ట్రానికి చేరుకుంది. ఆర్థిక లావాదేవీలు ఆకర్షించాయి... రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోని పరిణామాలను ఉగ్రవాదులు నిశితంగా గమనించి ఉంటారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. రాజధాని ప్రాంతంలో భూ విలువలు, ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని.. రాజధాని ప్రాంతమైన విజయవాడ-గుంటూరులను టార్గెట్ చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. తమ పథకాన్ని అమలు చేయడంలో భాగంగా హైదరాబాద్ లేదా నగర శివారు జిల్లాల్లో మకాం పెట్టిన ఉగ్రవాదులు విజయవాడ-గుంటూరు మధ్య సంచరిస్తూ దోపిడీకి రెక్కీలు నిర్వహించి ఉంటారని నిర్థారిస్తున్నారు. చివరగా గత నెల 30న గుంటూరు ప్రాంతంలోని బ్యాంకునో, ఫైనాన్స్ సంస్థనో టార్గెట్‌గా ఎంపిక చేసుకుని రెక్కీలు పూర్తి చేసినట్లు విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాతే గుంటూరు నుంచి విజయవాడ వచ్చి అక్కడ నుంచి తమ షెల్టర్ జోన్‌కు చేరుకున్నారని అంచనా వేస్తున్నారు. -
మానని గాయం..!
నగరంలో కాల్పుల ఘటనలు ఎన్నో... ఇప్పటికీ బాధితుల నరకయాతన తాజాగా ‘జానకీపురం’ ఘటనతో కలకలం అప్రమత్తంగా లేకుంటే ముప్పే! సిటీబ్యూరో: నగరంలో మరోసారి ‘సిమి’ కలకలం చెలరేగింది. పోలీసుల్లో ఆందోళన మొదలైంది. నల్గొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్ మృతులు నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) మాడ్యూల్‌కు చెందిన టైస్టులు అస్లం, ఎజాస్ అని తేలడం.. ఎన్‌కౌంటర్‌కు ముందు వీరు నగరంలో షెల్టర్ తీసుకున్నారని తెలియడంతో నగర ప్రజలతోపాటు పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. సూర్యాపేట, జానకీపురం ఘటనలు వెలుగు చూడకుంటే నగరంలో వీరు పంజా విసిరేవారేమోనని ఆందోళనచెందారు. ఎన్కౌంటర్ పుణ్యమా అని నగరానికి ముప్పు తప్పింది. కాగా నగరంలో పోలీసులపై ఇప్పటికి ఎనిమిది సార్లు తూటాలు పేలాయి. గడిచిన 20 ఏళ్ళుగా జరిగిన ఈ ఉదంతాల్లో ఏడుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వారిలో నక్సలైట్లు, ఉగ్రవాదులు, రౌడీషీటర్లు ఉన్నారు. ముఖ్యంగా ఫలక్‌నుమా నాగుల చింత పోలీసు చెక్‌పోస్టుపై 2009, మే 18న ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హోంగార్డు బాలస్వామి మృతి చెందగా కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ తలలోకి బుల్లెట్ దూరి గాయపడ్డాడు. అప్పటి నుంచి నేటి వరకు కూడా అతనికి శస్త్రచికిత్స జరగలేదు. ఇప్పటికీ తలలోని చిన్నమెదడు, పెద్దమెదడు మధ్యలో ఉగ్ర బుల్లెట్ అలాగే ఉండిపోయింది. శస్త్రచికిత్స జరిపితే ప్రాణాలకు హాని ఉంటుందని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో తూటాను ఆరేళ్లుగా అలాగే తలలో భరిస్తున్నాడు. బుల్లెట్ తలలోనే ఉండిపోవడంతో 60 శాతం కంటి చూపు మందగించింది. రానున్న రోజుల్లో కంటి చూపు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో మెరుగైన వైద్యం అందిస్తే బుల్లెట్ తీసే అవకాశాలు ఉన్నాయి. గత సంఘటనలు ఇవే... 1990, మతకల్లోలాల్లో 113 మంది మరణించిన కేసు దర్యాప్తులో ఛత్రినాక ఏసీపీ సత్తయ్య కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహంచిన కానిస్టేబుల్ ఖదీర్ సత్తయ్యను కాల్చి చంపాడు. ప్రస్తుతం ఖదీర్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. 1990లోనే పట్టుకోవడానికి వెళ్లగా..టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ నర్సింహారెడ్డిని రౌడీషీటర్ సర్దార్ కాల్చి చంపాడు. 1992, నవంబర్ 29..హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ టౌలీచౌకి బృందావన్‌కాలనీలో దాడి చేశారు. ఉగ్రావాది ముజీబ్ ఏకే-47తో ఎదురుదాడికి దిగి కృష్ణప్రసాద్, ఆయన గన్‌మాన్‌ను కాల్చిచంపాడు. 1993 జనవరి 25..ఎల్బీస్టేడియంలో మార్నింగ్ వాక్కు వచ్చిన ఐపీఎస్ అధికారి వ్యాస్‌ను శేషయ్య, తిరుపతి, బాలయ్య తదితరులు కాల్చి చంపి పరారయ్యారు. 1999 సెప్టెంబర్ 4...ఎస్సార్‌నగర్ చౌరస్తాలో పోలీసు అధికారి ఉమేష్‌చంద్రపై నక్సలైట్లు కాల్పులు జరిపి హతమార్చారు. 2008 డిసెంబర్ 3న సంతోష్‌నగర్‌లో సీఐ సెల్ పోలీ సులపై ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. 2009 మే 18 న ఫలక్‌నుమా నాగులచింత పోలీసు చెక్‌పోస్టుపై ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పుల్లో హోం గార్డు బాలస్వామి మృతి. కానిస్టేబుల్ రాజేంద్రప్రసా ద్ తలలో బుల్లెట్ దూరింది. నేటికి శస్త్ర చికిత్స జరపలేదు. బుల్లెట్ అలాగే తలలోనే ఉండిపోయింది. 2010 మే 14న శాలిబండ ప్రాంతంలో వికారుద్దీన్ తుపాకితో ఏపీఎస్పీ కానిస్టేబుల్ రమేష్‌ను కాల్చి చంపాడు. ప్రస్తుతం వికారుద్దీన్ జైలులో ఉన్నాడు. -
నగరంలో నిషేధిత సిమీ ఉగ్రవాదుల అరెస్ట్
హైదరాబాద్: నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) సంస్థకు చెందిన ఉగ్రవాదులను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన సా ముదాసిర్, సోహెబ్ లుగా పోలీసులు గుర్తించారు. సా ముదాసిర్ గతంలో సిమీలో పనిచేశారు. ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన మన్సూర్ ఆలీకి సోహెబ్ సహచరుడని పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా జిహద్ ప్రచారం నిర్వహిస్తున్న సాముదాసిద్, సోహెబ్ లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఫేస్ బుక్ ద్వారా పాకిస్థాన్ కు చెందిన అబూ సైఫ్, కమ్రాన్ షాలతో చాటింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారత దేశంలో బాంబులతో విధ్వంసం సృష్టించాలని సాముదాసిర్, సోహెబల్ లను ఫేస్ బుక్ చాటింగ్ లో అబూసైఫ్, కమ్రాన్ షాలు కోరినట్టు పోలీసులు వెల్లడించారు. -
ఖాండ్వా జైలు నుంచి పరారైన సిమి సభ్యుల్లో ఒకరు అరెస్ట్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జైలు నుంచి ఈ రోజు తెల్లవారుజామున స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కు చెందిన ఏడుగురు సభ్యులు పరారైయ్యారని జైలు అధికారులు వెల్లడించారు. జైలు అధికారులు వెంటనే అప్రమత్తమై ఒకరిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించినట్లు తెలిపారు. అయితే మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. అందుకోసం పోలీసు బలగాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. అందులోభాగంగా ఖాండ్వా పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. జైలులోని స్నానపు గదులు పగలకొట్టి వారంతా జైలు నుంచి తప్పించుకున్నట్లు వివరించారు. సిమి సభ్యుల పరారీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వారు కత్తులతో దాడి చేశారన్నారు. కానిస్టేబుళ్ల ఇద్దరిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సిమి సభ్యులంతా విచారణ ఖైదీలుగా జైలులో ఉన్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.