మహా ముదుర్లు
‘ఖాండ్వా’ తర్వాత రైలు పట్టాలపై నడక
కుక్కలపై ‘కాల్పుల’ {పాక్టీస్
రూర్కెలాలో చిక్కిన ఉగ్రవాదుల తీరిదీ
నాలుగేసి స్కెచ్‌లతో పోలీసుల వేట
సిటీబ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి అబు ఫైజల్ నేతృత్వంలో తప్పించుకుని... కరీంనగర్ సహా దేశ వ్యాప్తంగా నేరాలు చేసి... ఒడిశాలోని రూర్కెలాలో బుధవారం చిక్కిన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాకు (సిమి) చెందిన నలుగురు ఉగ్రవాదులు జకీర్ హుస్సేన్, షేక్ మహబూబ్, అంజాద్, సలాఖ్ మహాముదుర్లని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు మహబూబ్ తల్లి నజ్మాబీ కూడా చిక్కింది. వీరిని పట్టుకోవడానికి తెలంగాణ పోలీసులతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దాదాపు ఏడాదిగా వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్బీఐలో చోరీ చేసిన ఈ ముఠాలో ఇద్దరు ఉగ్రవాదులు గత ఏడాది నల్లగొండ జిల్లా జానకీపురంలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. గత నెలలో బెంగళూరులో తెలంగాణ పోలీసు అధికారిపై హత్యాయత్నం చేసిన ఆలం జబ్ అఫ్రిదీతోనూ వీరికి సంబంధా లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పట్టాలపై 180 కి.మీ. ప్రయాణం
ఈ గ్యాంగ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబు ఫైజల్ నేతృత్వంలో 2013 అక్టోబర్ 1న ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుంది. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో కానిస్టేబుళ్లపై హత్యాయత్నం చేసి పారిపోయింది. దీంతో అంతా అప్రమత్తమై తనిఖీలు, సోదాలు చేపడతారనే ఉద్దేశంతో ముఠా సభ్యులు రైలు పట్టాల బాట పట్టారు. ఖాండ్వా నుంచి 180 కి.మీ. దూరంలో ఉన్న బర్వానీ వరకు పట్టాలపై నడుచుకుంటూనే వెళ్లారు. దారిలో ఉన్న రైల్వే స్టేషన్లలోనే తింటూ, పట్టాల పక్కనే విశ్రాంతి తీసుకుంటూ జారుకున్నారు.
కుక్కలపై కాల్పులతో సాధన
కరడుగట్టిన ఈ ఉగ్రవాదులు నిల్చున్న వారినే కాదు... పరిగెత్తుతున్న.. కదులుతున్న వారినీ గురి తప్పకుండా కాల్చడంలో దిట్టలని అధికారులు చెబుతున్నారు. బుల్లెట్లు తేలిగ్గా దొరకవు కాబట్టి.. ఒక్క తూటా కూడా వృథా కాకుండా... ఒక్కోదానికి ఒక్కో ప్రాణం పోయేలా ప్రాక్టీస్ చేయాలని నిశ్చయించుకున్నారు. దీని కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోని అనేక అటవీ ప్రాంతాలతో పాటు గోవా శివార్లలోనూ పరుగెత్తే కుక్కలపై కాల్పులు జరుపుతూ తర్ఫీదు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. 2014 జనవరి 16న ఒడిశా అటవీ ప్రాంతం... కేరళలోని అలూవా ప్రాంతంలో వీరు శిక్షణ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
మోటార్ సైకిళ్లపై తిరుగుతూనే...
ఈ ముష్కరులు దాదాపు ప్రతి నేరంలోనూ కేవలం మోటార్ సైకిళ్లనే వినియోగించారు. వీటిలో అత్యధికం చోరీ చేసినవే. ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నప్పుడు అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న బైక్స్‌పై పారిపోయారు. చొప్పదండి బ్యాంకు చోరీ తర్వాతా ద్విచక్ర వాహనాల పైనే ఉడాయించారు. గత ఏడాది సూర్యాపేట కాల్పుల తర్వాత జానకీపురం పరిసరాల్లో సంచరించిన ఎజాజుద్దీన్, అస్లంలు స్థానికులను బెదిరించి లాక్కున్నబైక్స్ పైనే పారిపోవాలని చూశారు. మహబూబ్‌నగర్ టౌన్‌లోనూ మోటార్ సైకిళ్లు చోరీ చేశారు.
నాలుగేసి స్కెచ్‌లతో రంగంలోకి...
జానకీపురం ఎన్‌కౌంటర్ తర్వాత మిగిలిన ముష్కరులను పట్టుకోవడానికి నిఘా వర్గాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వీరు ఎప్పుడైనా బస చేసిన రాష్ట్రం దాటి పారిపోవడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే షెల్టర్ తీసుకునేవారు. సంగారెడ్డిని ఎంచుకోవడానికీ... రూర్కెలాలో తల దాచుకోవడానికీ ఇదే కారణమని అధికారులు చెబుతున్నారు. వేషాలు మార్చడంలోనూ వీరు దిట్టలని గుర్తించిన అధికారులు ఒక్కో ఉగ్రవాదికి సంబంధించి నాలుగేసి స్కెచ్‌లు (రూపాలు) తయారు చేసి దేశవ్యాప్తంగా గాలించారు.
అఫ్రిదీతోనూ లింకులు
2014 మే 1న చెన్నై రైల్వేస్టేషన్‌లో బెంగళూరు-గువాహటి రైల్లో పేలుడు... అదే ఏడాది డిసెంబర్ 29న బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్ పేలుడుతోనూ ఈ ముఠాకు సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి గత నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు బెంగళూరులో ఆలం జబ్ అఫ్రిదిని అరెస్టు చేశారు. నిందితుడు గతంలో సిమిలో పని చేయడంతో ఈ ముష్కరులతోనూ సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. రూర్కెలాలో చిక్కిన ఉగ్రవాదులు విధ్వంసాలకు అవసరమైన నిధుల కోసం కొన్ని జ్యువెలరీ దుకాణాలు, ఫైనాన్స్ సంస్థల్లో చోరీలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ ఉగ్రవాదులు తలదాచుకోవడంతో పాటు బాంబులు తయారు చేయడానికి వినియోగించేలా స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్, నెల్లూరు, చిత్తూరు పరిసరాల్లో స్థలాల కొనుగోలుకు యత్నించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.