విజయవాడ, గుంటూరుల్లో దోపిడీకి ‘సిమి’ ఉగ్రవాదుల రెక్కీ
మృతుల బస్ టికెట్ల ఆధారంగా అంచనా
హైదరాబాద్: స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులు.. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలోని ఏపీ రాజధాని ప్రాంతాన్ని టార్గెట్‌గా పెట్టుకుని దోపిడీకి రెక్కీ పూర్తి చే సినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ నిర్వహించడానికి వెళ్తుండగానే అనుకోకుండా సూర్యాపేట ఉదంతం చోటు చేసుకుందని అంచనా వేస్తున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టి... దాదాపు 60 గంటల తర్వాత జానకీపురం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదుల వద్ద లభించిన బస్సు టిక్కెట్ల ఆధారంగా అధికారులు ఈ అభిప్రాయానికి వచ్చారు. శనివారం ఉదయం జానకీపురం ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు మృతులిద్దరి జేబులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సెల్‌ఫోన్ బ్యాటరీ, పర్సు, రూ.23 వేల నగదు, బాదం పప్పులు, మామిడి కాయ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు బస్సు టికెట్లు కూడా పోలీసులకు దొరికాయి. వాటిలో.. గత నెల 28వ తారీఖు నాటి హైదరాబాద్-విజయవాడ టికెట్ ఒకటి కాగా.. రెండోది 30న గుంటూరు-విజయవాడల మధ్య ప్రయాణానికి సంబంధించిన ది. 29న విజయవాడ చేరుకున్న ఉగ్రవాదులు 29, 30 తేదీల్లో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో తిరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ముష్కరులు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలుకు చేరడానికి ముందు, అక్కడ నుంచి తప్పించుకున్నాక చేసిన నేరాల్లో దోపిడీలు, బందిపోటు దొంగతనాలే ఎక్కువ. దోపిడీ డబ్బును ఉగ్ర కార్యకలాపాలకు, జైళ్లలోని ఉగ్రవాదుల కుటుంబాలకు అందించడానికి వినియోగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరి కదలికలు చొప్పదండి ఉదంతం స్పష్టం చేసింది. ముష్కరులు 2014లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ సంచరించినట్లుగా నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి.
వారాంతంలో కొల్లగొట్టే పథకం...
గత వారాంతంలోనే తమ లక్ష్యాన్ని కొల్లగొట్టాలనే ఉద్దేశంతో.. ముష్కరులు తమ షెల్టర్ జోన్ నుంచి ఆయుధాలతో విడివిడిగా బయలుదేరి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. చొప్పదండి దోపిడీతో పాటు 2013 నుంచి వీరు చేసిన ఐదు దోపిడీలు, బందిపోటు దొంగతనాల్లో మూడు వారాంతాల్లో చేసినవే కావడం గమనార్హం. అదేవిధంగా గత వారాంతంలో రాష్ట్రంలో ఎంపిక చేసుకున్న టార్గెట్‌ను కొల్లగొట్టేందుకు వారు కుట్ర పన్నినట్లు స్పష్టమవుతోంది. బుధవారం రాత్రి (ఒకటో తేదీ) హైదరాబాద్ నుంచి ముష్కరులు విజయవాడకు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. గురువారమే అక్కడకు చేరుకున్నా... ఆ రోజు స్థానిక పరిస్థితుల్ని మరోసారి గమనించి శుక్ర, శనివారాల్లో (3, 4 తేదీలు) పంజా విసిరేవారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తు చేయడానికి నిఘా విభాగానికి చెందిన ప్రత్యేక బృందం తెలంగాణ నుంచి రాష్ట్రానికి చేరుకుంది.
ఆర్థిక లావాదేవీలు ఆకర్షించాయి...
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోని పరిణామాలను ఉగ్రవాదులు నిశితంగా గమనించి ఉంటారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. రాజధాని ప్రాంతంలో భూ విలువలు, ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని.. రాజధాని ప్రాంతమైన విజయవాడ-గుంటూరులను టార్గెట్ చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. తమ పథకాన్ని అమలు చేయడంలో భాగంగా హైదరాబాద్ లేదా నగర శివారు జిల్లాల్లో మకాం పెట్టిన ఉగ్రవాదులు విజయవాడ-గుంటూరు మధ్య సంచరిస్తూ దోపిడీకి రెక్కీలు నిర్వహించి ఉంటారని నిర్థారిస్తున్నారు. చివరగా గత నెల 30న గుంటూరు ప్రాంతంలోని బ్యాంకునో, ఫైనాన్స్ సంస్థనో టార్గెట్‌గా ఎంపిక చేసుకుని రెక్కీలు పూర్తి చేసినట్లు విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాతే గుంటూరు నుంచి విజయవాడ వచ్చి అక్కడ నుంచి తమ షెల్టర్ జోన్‌కు చేరుకున్నారని అంచనా వేస్తున్నారు.
ఏపీ రాజధాని ప్రాంతమే లక్ష్యం!
Published Tue, Apr 7 2015 1:43 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement