టెర్రర్ టూర్స్ | City went to the 'two' terrorists | Sakshi
Sakshi News home page

టెర్రర్ టూర్స్

Published Thu, Mar 3 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

టెర్రర్ టూర్స్

 - సిటీకి వచ్చి వెళ్లిన ‘ఇరువురు’ గజ ఉగ్రవాదులు
 - 2013లో అబు ఫైజల్‌కు చెందిన సిమి మాడ్యుల్
 - 2015-16ల్లో ‘పర్యటించిన’ ఆలమ్ జెబ్ అఫ్రిది
 - ముష్కరుల విచారణల్లో వెలుగులోకి వాస్తవాలు

 
సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా నేరాలకు పాల్పడి ఒడిశాలోని రూర్కెలాలో చిక్కిన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) గ్యాంగ్.., మోస్ట్‌వాంటెడ్‌గా ఉండి బెంగళూరులో పట్టుబడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది అఫ్రిదీల విచారణలో ‘సిటీ లింకులు’ వెలుగులోకి వస్తున్నాయి. అటు సిమి, ఇటు ఐఎం ఉగ్రవాదులు హైదరాబాద్ వచ్చి వెళ్లినట్లు అంగీకరించారు. ఒకరు ‘వ్యవహారం’ కోసం రాగా... మరొకరు ‘కోచింగ్’ కోసం వచ్చినట్లు స్పష్టమైంది.
 
 అబు ఫైజల్ నేతృత్వంలో సిమి గ్యాంగ్...
రూర్కెలాలో పట్టుబడిన సిమి గ్యాంగ్ 2013లో అబు ఫైజల్ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుంది. దానికి ముందు ఈ గ్యాంగ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో అనేక దోపిడీలు, చోరీలు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబు ఫైజల్ ముంబైలో ఉన్న జుహూ కేంద్రంగా కార్యకలాపాలు సాగించాడు. సిమి మధ్యప్రదేశ్ శాఖకు ప్రెసిడెంట్‌గా పని చేసిన ఇతడు డాక్టర్‌గా చెలామణి అయ్యాడు. దోపిడీలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లోనూ పాల్గొన్నాడు. ఖాండ్వాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సిమి ఉగ్రవాదులు జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్, మహ్మద్ అస్లం అలియాస్ బిలాల్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్, మహ్మద్ ఎజాజుద్దీన్, అబిద్ మీర్జాలతో ముఠా కట్టాడు.

పహాడీషరీఫ్ కేంద్రంగా ‘పంపకాలు’...
పోలీసులకు చిక్కి ఖాండ్వా జైలుకు చేరడానికి ముందు నేరాల ద్వారా సంపాదించిన సొమ్మును వివిధ ఉగ్రవాద సంబంధ కేసుల్లో అరెస్టయి జైళ్లల్లో ఉన్న, ఎన్‌కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు అందించడం తదితర కార్యకలాపాలు సాగించారు. ఇందులో భాగంగానే 2005-07 మధ్య ఈ ముఠా హైదరాబాద్‌కు చేరుకుంది. పహాడీషరీఫ్‌లో ఉన్న ఓ డెన్‌లో షెల్టర్ ఏర్పాటు చేసుకుని దాదాపు 20 రోజుల పాటు గడిపింది. ఈ సమయంలోనే నగరంలో ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ‘జిహాదీ భావజాలాన్ని’ ప్రచారం చేయడానికి ప్రయత్నించింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ కాయిదాకు చెందిన కీలక నేత అన్వర్ అల్ అవల్కీ రాసిన ‘44 వేస్ టు సపోర్ట్ జిహాద్’ అనే పుస్తకాన్ని సేకరించింది. దీన్ని స్థానిక భాషల్లోకి అనువదించి పంపకాలు చేపట్టింది. ఉర్దూలో ముద్రించిన ప్రతిని పహాడీషరీఫ్ కేంద్రంగా నగరంలో పంపిణీ చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఖాండ్వా ఎస్కేప్ తర్వాత ఫైజల్, అబిద్ వెంటనే పోలీసులకు చిక్కగా... ఎజాజ్, అస్లంలు గతేడాది నల్లగొండ జిల్లాలో ఎన్‌కౌంటర్ అయ్యారు. మిగిలిన వారితో జట్టు కట్టిన సాలఖ్ సహా నలుగురు రూర్కెలాలో పట్టుబడ్డారు.
 
అఫ్రిది... ఐఎం టు జునూద్...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జోహాపురాకు చెందిన ఆలమ్ జెబ్ అఫ్రిది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ద్వారా ఉగ్రవాదబాటపట్టాడు. 2008లో జరిగిన అహ్మదాబాద్, సూరత్, జైపూర్ పేలుళ్లలో కీలకపాత్ర పోషించాడు. పోలీసుల నిఘా పెరగడంతో బెంగళూరులోని దొడ్డనాగమంగళంలోని వినాయకనగర్‌లో మారు పేరుతో తలదాచుకున్నాడు. ఇక్కడ కొన్ని విద్రోహక చర్యలు చేయడం, సీసీ కెమెరా ఫుటేజ్‌లు బయటకు రావడంతో మళ్లీ పోలీసుల భయం పెరిగింది. దీంతో సిరియా కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నెరపుతున్న షఫీ ఆర్మర్‌ను సంప్రదించిన అఫ్రిది తానూ సిరియా వచ్చేస్తానన్నాడు. దీంతో కొత్తగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ విషయం ఇతడికి చెప్పిన షఫీ... హైదరాబాద్ వెళ్లి ఆ మాడ్యుల్‌కు సహకరించమని ఆదేశించాడు.
 
రెండుసార్లు నగరానికి ‘టూర్’....
దీంతో సోషల్ మీడియా ద్వారా నగరానికి చెందిన నఫీస్ ఖాన్‌ను సంప్రదించిన అఫ్రిది గతేడాది టోలిచౌకి వచ్చి అతడిని కలిసి వెళ్లాడు. ఆ సమయంలో ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్‌తో పాటు శిక్షణ, లావాదేవీలు తదితర అంశాలను చర్చించాడు.  విధ్వంసాలకు అవసరమైన బాంబుల్ని తయారు చేసే ప్రయత్నాల్లో భాగంగా నఫీస్ ఖాన్ ‘స్థానిక పదార్థాల’తోనే నాలుగు బకెట్ బాంబుల్ని రూపొందించాడు. ఇవి పేలడానికి అవసరమైన డిటోనేటర్లును తయారు చేయడం మాత్రం ఇతడి వల్లకాలేదు. దీంతో నఫీస్ బాంబుల తయారీలో నిష్ణాతుడైన అఫ్రిదీ సహాయం కోరాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరిలో మరోసారి హైదరాబాద్ వచ్చిన అఫ్రిది... రసాయనాలు వినియోగించి డిటోనేటర్లు ఎలా తయారు చేయాలనేది ‘బోధించి’ వెళ్లాడు. ఈ ప్రయత్నాలు కార్యరూపంలోకి రాకముందే ‘జునూద్’ మాడ్యుల్‌తో పాటు అఫ్రిది సైతం చిక్కడంతో భారీ ముప్పు తప్పినట్లైంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement