మోడీపై తప్పిన గురి!
‘మచిలీ-5’ పేరిట ఇండియన్ ముజాహిదీన్ పథకం
ఆత్మాహుతి దాడికి సిద్ధమైన ఉగ్రవాదులు
బాంబు ముందే పేలడంతో అడ్డం తిరిగిన కథ
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని హతమార్చాలని ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు కుట్రపన్నారా? బీహార్ రాజధాని పాట్నాలో ఈ నెల 27న మోడీ నిర్వహించిన హుంకార్ ర్యాలీలో ఆత్మాహుతి దాడులతో ఆయన్ను మట్టుబెట్టాలనుకున్నా గురి తప్పిందా? ఈ వరుస పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జరిపిన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన వివరాలు వెలుగు చూసినట్లు సమాచారం. ఐఎం ఉగ్రవాదులు ప్రధానంగా మోడీపైనే గురిపెట్టారని, ‘మచిలీ-5’ కోడ్ పేరుతో ఆత్మాహుతి దాడికి పథకం సిద్ధం చేసుకున్నారని ఈ పేలుళ్ల కేసులో పట్టుబడిన ఉగ్రవాది ఇంతియాజ్ అన్సారీ విచారణలో అంగీకరించినట్లు ‘గల్ఫ్ న్యూస్’ కథనాన్ని ఉటంకిస్తూ ‘ఇండియా టుడే’ వెల్లడించింది. అందులోని వివరాల ప్రకారం ... మోడీ హత్యకు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పథకం సిద్ధం చేసుకున్నారు. ఇంతియాజ్, అతడి సహచరుడు అయినుల్ తారిఖ్ మానవబాంబులుగా మారి, మోడీ వేదిక వద్దే పేలుడుకు పాల్పడేలా ఆత్మాహుతి దాడికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు.
పాట్నా రైల్వేస్టేషన్‌లోని పబ్లిక్ టాయిలెట్‌లో బాంబును సిద్ధం చేస్తుండగా, టైమర్, బ్యాటరీ అమర్చక ముందే అది అనుకోకుండా పేలిపోవడంతో కథ అడ్డం తిరిగింది. పేలుడులో తారిఖ్ తీవ్రంగా గాయపడ్డాడు. కీలక నిందితుడైన ఇంతియాజ్, అక్కడి నుంచి పరారవుతుండగా పట్టుబడ్డాడు. పాట్నాలో మోడీ సభ జరిగిన గాంధీ మైదాన్ వద్ద ఏడు వరుస పేలుళ్లలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. గాంధీ మైదాన్ పరిసరాల్లో ఉగ్రవాదులు మొత్తం 18 బాంబులను అమర్చగా, పేలకుండా మిగిలిన బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. మరోవైపు, ఆగస్టులో అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ కుట్రదారు యాసిన్ భత్కల్ కూడా మోడీనే తమ ప్రధాన ‘టార్గెట్’ అని ఎన్‌ఐఏ ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు. ఈ లక్ష్యాన్ని తాము సాధించినట్లయితే, అంతర్జాతీయంగా తమకు అందే నిధులు కూడా పెరుగుతాయని భత్కల్ చెప్పినట్లు సమాచారం. పాట్నా పేలుళ్లలో గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మోడీ శనివారం రానున్నారు.