ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల సమాచారం తెలిస్తే తమకు అందించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రజలకు ఎన్‌ఐఏ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల సమాచారం తెలిస్తే తమకు అందించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌లను ఎన్‌ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో ఇద్దరు ఉగ్రవాదులు తహసీన్ అక్తర్ అలియాస్ మోను, అలియాస్ హసన్, వకాస్ అలియాస్ జవేద్ అలియాస్ అహ్మద్‌లు దేశంలోనే ఉండివుంటారని అనుమానిస్తోంది. వీరిద్దరూ మళ్లీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉండొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దర్యాప్తు అధికారులు సూచించారు.
2010లో జరిగిన వారణాసి, 2011లో ముంబై పేలుళ్లకు కూడా వీరు బాధ్యులని ఎన్‌ఐఏ ప్రకటించింది. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల రివార్డును ఇప్పటికే ప్రకటించింది. వీరిద్దరి ఆచూకీ తెలిసినవారు ‘ఎస్పీ10.ఎన్‌ఐఏఎట్‌జీవోవీ.ఇన్’కు మెయిల్ పంపాలని, 011-23438200, 91-8540848216 నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఎస్పీ, సీబీఐ-1, ఎన్‌ఐఏ హెడ్ క్వార్టర్స్, 6వ అంతస్తు, ఎన్‌డీసీసీ బిల్డింగ్ -11, జై సింగ్ రోడ్, న్యూ ఢిల్లీ-110001 అడ్రస్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదుచేయవచ్చని వెల్లడించారు.
కూనంనేనిపై కేసు ఎత్తివేయాలి: నారాయణ
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహా తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన నాన్‌బెయిలబుల్ కేసుల్ని ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు.