మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో.. ఆ ఇద్దరూ మిస్సింగ్‌! | Yasin Bhatkal, Shafi Armar names missing in UNO most wanted list | Sakshi
Sakshi News home page

మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో.. ఆ ఇద్దరూ మిస్సింగ్‌!

Published Mon, Sep 19 2016 9:32 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో.. ఆ ఇద్దరూ మిస్సింగ్‌!

మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో.. ఆ ఇద్దరూ మిస్సింగ్‌!

యూఎన్‌ జాబితాలో..కనిపించని భత్కల్,  షఫీ ఆర్మర్‌
సిటీ పోలీసులకూ వీరు ‘బాగా కావాల్సిన వారే’
విస్మయం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర పోలీసు వర్గాలు


సాక్షి, సిటీబ్యూరో: విషవృక్షంగా విస్తరిస్తున్న ఉగ్రవాదాన్ని తమవంతుగా అడ్డుకోవడానికి ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) సమాయత్తమవుతోంది. దీని కోసం సభ్యదేశాలకు తమకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాదుల జాబితా అందించమని ఇటీవల కోరింది. భారత్‌ ఇచ్చిన జాబితాలో దేశానికి, నగరానికి మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్, ఐసిస్‌కు అనుబంధంగా అన్సార్‌ ఉల్‌ తవ్హిద్‌ ఫి బిలాద్‌ అల్‌ హింద్‌ (ఏయూటీ) ఏర్పాటు చేసిన షఫీ ఆర్మర్‌ పేర్లు ఆ జాబితాలో లేవని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇది నిర్లక్ష్యమా? వ్యూహంలో భాగమా? అనేది అర్థంకాక విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

సిటీకీ అవే అత్యంత ప్రమాదకరం...
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ప్రస్తుతం ముప్పు ‘రెండు’రకాలుగా పొంచి ఉంది. ఇందులో ప్రధానమైనది ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) కాగా, రెండోది ఐసిస్‌.  ఇటీవల ఎనిమిది నెలల కాలంలోనే హైదరాబాద్‌లో ఐసిస్‌కు చెందిన రెండు ప్రధాన మాడ్యుల్స్‌ చిక్కాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐఎం, ఐసిస్‌కు చెందిన గజఉగ్రవాదులు రియాజ్‌ భత్కల్, షఫీ ఆర్మర్‌ పేర్లను యూఎన్‌కు ఇచ్చిన జాబితాలో చేర్చకపోవడం వెనుకా వ్యూహం దాగి ఉండచ్చని అధికారులు చెప్తున్నారు. అత్యంత రహస్య ఆపరేషన్లు చేస్తున్న సందర్భంలోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటారని అభిప్రాపడుతున్నారు.

భత్కల్‌ ఎందరికో మోస్ట్‌వాంటెడ్‌...
2007 ఆగస్టు 25, 2013 ఫిబ్రవరి 21న రాజధాని నగరం జంట పేలుళ్లతో దద్దరిల్లింది. మొదటిది గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో జరగ్గా... రెండోది దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్‌ సెంటర్, 107 బస్టాప్‌లో చోటు చేసుకున్నాయి. ఈ రెండింటిలోనూ రియాజ్‌ భత్కల్‌ది కీలక పాత్ర.  కర్ణాటకలోని భత్కల్‌ ప్రాంతానికి చెందిన ఇతడు స్థానిక యువతను ఆకర్షించి విధ్వంసాల సృష్టించాడు. 2005 నుంచి దేశ వ్యాప్తంగా 19 పేలుళ్లకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఫరీదాబాద్, వారణాసి కోర్టుల్లో, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్లతో పాటు రామ్‌పూర్‌ సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై దాడి, సూరత్‌లో పేలుళ్లకు కుట్రల్లోనూ వాంటెడ్‌. ప్రస్తుతం ఇతను పాకిస్థాన్‌లోని కరాచీలో తలదాచుకున్నాడు. అక్కడ నుంచే హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నుతున్న ఇతడికి ఆ దేశ ఆర్మీ, ఐఎస్‌ఐ భద్రత కల్పిస్తోంది.
 
ఆర్మర్‌తో ఆషామాషీ కాదు...
ఐసిస్‌కు అనుబంధంగా ఏయూటీని ఏర్పాటు చేసిన షఫీ ఆర్మర్‌ సైతం మామూలోడు కాదు. హైదరాబాద్‌కు సంబంధించి ఇప్పటి వరకు పట్టుబడిన ఐసిస్‌ ఉగ్రవాదులు, సానుభూతిపరుల వెనుక ఇతడే ఉన్నాడు. 2014లో శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడిన సల్మాన్‌ మొయినుద్దీన్‌ నుంచి తాజాగా పాతబస్తీలో చిక్కిన ఇబ్రహీం యజ్దానీ మాడ్యుల్‌ వరకు అందరినీ ఇతడే ఆ బాటపట్టించాడు. ప్రస్తుతం సిరియా కేంద్రంగా వ్యవహారాలు నడిపిస్తున్న షఫీ ఆర్మర్‌ అక్కడ అమెరికా జరిపిన డ్రోన్‌ దాడుల్లో తాను చనిపోయినట్లు అనేకసార్లు వదంతులు వ్యాపించజేశాడు. నిఘా వర్గాల దృష్టి మళ్లించడానికే ఈ పంథా అనుసరించినట్లు అధికారులు చెప్తున్నారు. కర్ణాకటలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ షఫీ ఆర్మర్‌ భారత్‌లో ఐఎస్‌ కార్యకలాపాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం తన అన్న సుల్తాన్‌ ఆర్మర్‌తో కలిసి దేశం దాటేశాడు. ఐఎస్‌కు అనుబంధంగా ‘అన్సార్‌ ఉల్‌ తౌహిద్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. సిరియాలో అమెరికా సేనలు చేసిన దాడుల్లో సుల్తాన్‌ చనిపోగా... షఫీ మాత్రం భారత్‌ టార్గెట్‌గా ఐఎస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement