భత్కల్‌కో ‘జీవిత చరిత్ర’
సాక్షి,సిటీబ్యూరో: అనేకమందిని పొట్టనపెట్టుకొని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) కో-ఫౌండర్ యాసీన్ భత్కల్ రాస్తున్న ఆటోబయోగ్రఫీపై నిఘా వర్గాలు ఆత్రుతుగా చూస్తున్నాయి. 2008 నుంచి దేశవ్యాప్తంగా జరిగిన అనేక పేలుళ్లకు సూత్రధారిగా ఉన్న యాసీన్‌భత్కల్ గతేడాది ఆగస్టు 29న నేపాల్‌లో చిక్కిన విషయం విదితమే. అక్కడ్నుంచి అనేక కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు.
దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సైతం హైదరాబాద్ తీసుకొచ్చి విచారించింది. ఇలా ఇతడు కేవలం తీహార్ జైల్లోనే కాదు ఏ పోలీసుల కస్టడీలో ఉన్నా...ప్రతిరోజూ ఇంటరాగేషన్ పూర్తయిన తర్వాత తన సెల్‌లోకి వెళ్లిపోతూ పోలీసుల నుంచి తీసుకున్న కాగితాలపై ‘జీవితచరిత్ర’ రాస్తున్నాడు.
ఎవరా ‘క్లోజ్‌ఫ్రెండ్’..?: యాసీన్ భత్కల్ ఉర్దూలో రాస్తున్న ఈ ‘జీవితచరిత్ర’లో కొన్ని కవితలు, పద్యాలు సైతం ఉన్నట్లు కేంద్ర నిఘావర్గాలకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. ఈ రాతలపై కన్నేసి ఉంచిన నిఘావర్గాలను ఓ అంశం ఆకర్షించింది. ఇప్పటివరకు యాసీన్ రాసిన దానిప్రకారం కేంద్ర నిఘా వర్గాలకు తన కదలికలపై ఉప్పందించింది ఓ ‘క్లోజ్‌ఫ్రెండ్’గా అతడి అనుమానం.
తన అరెస్టుకు కొన్నినెలల ముందు సదరు స్నేహితుడిని కలిసిన సంద ర్భంలో ‘అగ్లీ రంజాన్ షాయద్ తీహార్ మేహోగా’ (బహుశా వచ్చేడాది రంజాన్‌ను తీహార్ జైల్లో చేసుకోవాల్సి ఉంటుందేమో!) అని అతడితో వ్యాఖ్యానించానని యాసీన్ రాశాడు. ఈ విషయాన్ని జైలు, పోలీసు అధికారుల ద్వారా తెలుసుకున్న నిఘావర్గాలు ఆ ‘క్లోజ్‌ఫ్రెండ్’ ఎవరనే కోణంలో ఆరాతీస్తున్నాయి.
ఎక్కడా కనిపించని పశ్చాత్తాపం: ఆరేళ్లపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబులతో విధ్వంసం సృష్టించి, వందలాదిమంది చావుకు, వేలమంది క్షతగాత్రులు కావడానికి కారణమైన యాసీన్‌భత్కల్‌లో ఎలా ంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని నిఘావర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు అతగాడు రాసిన ‘జీవిత చరిత్ర’లోనూ ఈ కోణంలో ఎలాంటి ప్రస్తావన లేదని, ఓచోట తాను చేస్తున్న పనుల్ని ‘తమవారి కోసం చేస్తున్న త్యాగం’ అంటూ అభివర్ణించాడని అవి వివరించాయి.
మాకూ ప్రాణహానీ ఉంది..: పదుల సంఖ్యలో విద్రోహక చర్యలకు పాల్పడి, వందలమంది ప్రాణాలు తీసిన టై ద్వయం యాసీన్,అసదుల్లాఅక్తర్‌లు ప్రస్తుతం తమకు ప్రాణహాని ఉందని భయపడుతున్నారట. ఇదే విషయాన్ని తమ లాయర్ ద్వారా తీహార్ జిల్లా కోర్టుకు నివేదించారు. స్పందించిన న్యాయస్థానం నివేదిక ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖను ఆదేశిస్తూ కేసు విచారణను శుక్రవారానికి వాయిదావేసింది.