మానని గాయం..! | Fire events in the city | Sakshi
Sakshi News home page

మానని గాయం..!

Published Sun, Apr 5 2015 11:30 PM | Last Updated on Wed, Sep 5 2018 9:51 PM

మానని గాయం..! - Sakshi

మానని గాయం..!

నగరంలో కాల్పుల ఘటనలు ఎన్నో...
ఇప్పటికీ బాధితుల   నరకయాతన
తాజాగా ‘జానకీపురం’ ఘటనతో కలకలం
అప్రమత్తంగా లేకుంటే ముప్పే!
 

సిటీబ్యూరో:  నగరంలో మరోసారి ‘సిమి’ కలకలం చెలరేగింది. పోలీసుల్లో ఆందోళన మొదలైంది. నల్గొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్ మృతులు నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) మాడ్యూల్‌కు చెందిన టైస్టులు అస్లం, ఎజాస్ అని తేలడం.. ఎన్‌కౌంటర్‌కు ముందు వీరు నగరంలో షెల్టర్ తీసుకున్నారని తెలియడంతో నగర ప్రజలతోపాటు పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. సూర్యాపేట, జానకీపురం ఘటనలు వెలుగు చూడకుంటే నగరంలో వీరు పంజా విసిరేవారేమోనని ఆందోళనచెందారు. ఎన్‌కౌంటర్ పుణ్యమా అని నగరానికి ముప్పు తప్పింది. కాగా నగరంలో పోలీసులపై ఇప్పటికి ఎనిమిది సార్లు తూటాలు పేలాయి. గడిచిన 20 ఏళ్ళుగా జరిగిన ఈ ఉదంతాల్లో ఏడుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.

కాల్పులు జరిపిన వారిలో నక్సలైట్లు, ఉగ్రవాదులు, రౌడీషీటర్లు ఉన్నారు. ముఖ్యంగా ఫలక్‌నుమా నాగుల చింత పోలీసు చెక్‌పోస్టుపై 2009, మే 18న  ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హోంగార్డు బాలస్వామి మృతి చెందగా కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ తలలోకి బుల్లెట్ దూరి  గాయపడ్డాడు. అప్పటి నుంచి నేటి వరకు కూడా అతనికి శస్త్రచికిత్స జరగలేదు. ఇప్పటికీ తలలోని చిన్నమెదడు, పెద్దమెదడు మధ్యలో ఉగ్ర బుల్లెట్ అలాగే ఉండిపోయింది. శస్త్రచికిత్స జరిపితే ప్రాణాలకు హాని ఉంటుందని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో తూటాను ఆరేళ్లుగా అలాగే తలలో భరిస్తున్నాడు. బుల్లెట్ తలలోనే ఉండిపోవడంతో 60 శాతం కంటి చూపు మందగించింది. రానున్న రోజుల్లో కంటి చూపు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో మెరుగైన వైద్యం అందిస్తే బుల్లెట్ తీసే అవకాశాలు ఉన్నాయి.
 
గత సంఘటనలు ఇవే...

1990, మతకల్లోలాల్లో 113 మంది మరణించిన కేసు దర్యాప్తులో ఛత్రినాక ఏసీపీ సత్తయ్య కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహంచిన కానిస్టేబుల్ ఖదీర్ సత్తయ్యను కాల్చి చంపాడు. ప్రస్తుతం ఖదీర్ చర్లపల్లి జైలులో ఉన్నాడు.

1990లోనే పట్టుకోవడానికి వెళ్లగా..టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ నర్సింహారెడ్డిని రౌడీషీటర్ సర్దార్ కాల్చి చంపాడు.

1992, నవంబర్ 29..హిజ్‌బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ టౌలీచౌకి బృందావన్‌కాలనీలో దాడి చేశారు. ఉగ్రావాది ముజీబ్ ఏకే-47తో ఎదురుదాడికి దిగి కృష్ణప్రసాద్, ఆయన గన్‌మాన్‌ను కాల్చిచంపాడు.

  1993 జనవరి 25..ఎల్బీస్టేడియంలో మార్నింగ్ వాక్‌కు వచ్చిన ఐపీఎస్ అధికారి వ్యాస్‌ను శేషయ్య, తిరుపతి, బాలయ్య తదితరులు కాల్చి చంపి పరారయ్యారు.

1999 సెప్టెంబర్ 4...ఎస్సార్‌నగర్ చౌరస్తాలో పోలీసు అధికారి ఉమేష్‌చంద్రపై నక్సలైట్లు కాల్పులు జరిపి హతమార్చారు.

2008 డిసెంబర్ 3న సంతోష్‌నగర్‌లో సీఐ సెల్ పోలీ సులపై ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

2009 మే 18 న ఫలక్‌నుమా నాగులచింత పోలీసు చెక్‌పోస్టుపై ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పుల్లో హోం గార్డు బాలస్వామి మృతి. కానిస్టేబుల్ రాజేంద్రప్రసా ద్ తలలో బుల్లెట్ దూరింది. నేటికి శస్త్ర చికిత్స జరపలేదు. బుల్లెట్ అలాగే తలలోనే ఉండిపోయింది.
     
2010 మే 14న శాలిబండ ప్రాంతంలో వికారుద్దీన్ తుపాకితో ఏపీఎస్పీ కానిస్టేబుల్ రమేష్‌ను కాల్చి చంపాడు. ప్రస్తుతం వికారుద్దీన్ జైలులో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement