Janakipuram encounter
-
జానకిపురం ఎన్‌కౌంటర్‌కు ఎనిమిదేళ్లు
మోత్కూరు: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోత్కూరు మండలం జానకిపురం గ్రామంలో ఎన్కౌంటర్ జరిగి మంగళవారంతో ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 4, 2015న జానకిపురం గ్రామ శివారులో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అప్పటి ఆత్మకూరు(ఎం) ఎస్ఐ సిద్దయ్యతో పాటు అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ చౌగోని నాగరాజు అమరులయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అప్పటి రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, పోలీసు సిబ్బందికి, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సీఐ బాలగంగిరెడ్డికి గాయాలయ్యాయి. పోలీసు సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు అస్లాం ఆయూబ్, జాకీర్ బాదల్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఎన్కౌంటర్ అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎన్‌కౌంటర్‌కు ముందు రోజు సూర్యాపేట బస్టాండ్‌లో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యారు. వారి కోసం పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఉగ్రవాదులు అర్వపల్లి దర్గా ప్రాంతంలో తలదాచుకొని తిరుమలగిరి మీదుగా మోత్కూరు మండలం చిర్రగూడూరు నుంచి డొంక మార్గం గుండా వెళ్తూ దారితప్పి జానకిపురం గ్రామ శివారుకు చేరుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బైక్‌పై వెళ్లగా బైక్ వాగులోని ఇసుకలో కూరుకుపోవడంతో మరో బైక్ తీసుకొని గ్రామ శివారులోకి ప్రవేశిస్తుండగా ఎదురుగా వచ్చిన పోలీసు వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డ్రైవర్ సీటులో ఉన్న కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మృతిచెందగా, ఎస్ఐ సిద్దయ్య పొట్ట, తలలోకి తూటాలు దిగడంతో కుప్పకూలిపోయాడు. వారిని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెండు రోజుల అనంతరం ఎస్ఐ సిద్దయ్య మృతిచెందాడు. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులను యావత్ దేశ ప్రజలు అభినందించారు. -
సంఘ విద్రోహశక్తులపై ఉక్కుపాదం
పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటాం ఎస్పీగా బాధ్యతల స్వీకరణ దుగ్గల్‌కు జిల్లా పరిస్థితిని వివరించిన తాజా మాజీ ఎస్పీ ప్రభాకర్‌రావు నల్లగొండక్రైం : ‘సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతాం. జిల్లాలో శాంతిభద్రతలపై రాజీపడేదిలేదు. సమర్థంగా నిర్వహిస్తాం. ప్రజల మాన, ప్రాణ రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ మా యంత్రాంగం పనిచేస్తుంది’ అని కొత్త ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. సోమవారం ఆయన తాజామాజీ ఎస్పీ ప్రభాకర్‌రావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాను పూర్తిగా ఆకళింపు చేసుకుంటానన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఎంతటి వ్యక్తులను వదిలిపెట్టేది లేదన్నారు. పోలీసు అమరుల కుటుంబాలను తాను వ్యక్తిగతంగా, అదే విధంగా రాష్ట్ర పోలీసు సంఘం నుంచి, జిల్లా అసోసియేషన్ నుంచి ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం అమరుల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఆయా కుటుంబాలను కలిసి భరోసా కల్పిస్తానన్నారు. సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్ విషయం గురించి తెలుసుకుంటానన్నారు. ఇంకా ఎవరైనా పారిపోయారా, లేక జిల్లాలోనే ఉన్నారా అనే వివరాలపై ఆరా తీస్తానన్నారు. జిల్లా పరిస్థితిని, పెండింగ్ కేసుల వివరాలు, జిల్లాలో తీవ్రవాదం, ఇటీవల సంఘటనను నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దుగ్గల్‌కు బదిలీపై వెళ్తున్న ఎస్పీ ప్రభాకర్‌రావు వివరించారు. అంతకుమందు దుగ్గల్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. నూతన ఎస్పీకి పోలీసు సంక్షేమ సంఘం వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఇరుగు సునిల్‌కుమార్, రామచంద్రంగౌడ్, అమర్‌సింగ్, యాదగిరి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అమరులకు నివాళి ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన పోలీసు అమరుల చిత్రపటానికి పోలీసు కార్యాలయంలో తాజామాజీ ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
అణువణువూ గాలింపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జానకీపురం ఎన్కౌంటర్ ఘటన నేపథ్యంలో జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అణువణువునా కూంబింగ్ చేస్తు న్నారు. దుండగులకు సంబంధించిన ఆధారాలతో పాటు ఇంకా ఎవరైనా ముష్కరులు జిల్లాలో ఉన్నారా.. అనే కోణంలో గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి కూంబింగ్ కొనసాగుతోంది. అర్వపల్లి గుట్టలు, సోలిపేట గుట్టలతో పాటు ఇతర మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆక్టోపస్దళాలతో కలిసి దాదాపు 200 మందికిపైగా సాయుధులైన పోలీసులు వెతుకుతున్నారని, ఈసారి ఎవరైనా కనిపిస్తే సహించేది లేదని పోలీసు వర్గాలంటున్నాయి. అయితే, కూంబింగ్ చేస్తుండగా దుండగులకు సంబంధించిన ఒక బ్యాగ్ లభించింది. ఈ బ్యాగులో మూడు సెల్ఫోన్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) వర్గాలు ఫోన్లలో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తూ ఆధారాల కోసం వెతుకుతున్నాయి. మరోవైపు దుండగులు తమ వద్ద ఉన్న కీలకసమాచారాన్ని వేరే వ్యక్తితో పంపించిన తర్వాతే బయటకు వచ్చారని, అప్పటివరకు 48 గంటలకు పైగా అజ్ఞాతంలోనే ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. అప్పటివరకు వారు అర్వపల్లి గుట్టల్లోనే ఉన్నారని, కాదు సూర్యాపేటలోనే ఉన్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా వారు శుక్రవారం అర్ధరాత్రి సమయంలోనే అర్వపల్లి సమీపంలో ఖాజా నసీరుద్దీన్‌బాబా దర్గాకు వచ్చారని తెలుస్తోంది. తమ వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ను ఢిల్లీ నుంచి వ్యక్తితో పంపిన తర్వాతే వారు బయటకు వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి జాతీయ దర్యాప్తుసంస్థ అధికారులు కాగా, దుండగులను ఎన్కౌంటర్ అయిన నేపథ్యంలో వారికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు జిల్లాకు వచ్చారు. వీరు మోత్కూరు మండలంలోని జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్ స్థలాన్ని వారు పరిశీలించారు. స్థానిక పోలీసులను, స్థానికులను అడిగి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడ లభించిన ఆధారాలను కూడా సేకరించారు. వీరితో పాటు ముంబైకి చెందిన యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు కూడా ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పోలీసు అధికారులతో పాటు మన రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మరోవైపు మృతదేహాలున్న కామినేని ఆసుపత్రికి ముంబై ఏటీఎస్ పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. వీరు మృత దేహాలను పరిశీలించి వేలిముద్రలను సేకరించారని పోలీసు వర్గాలంటున్నారు. జాకీర్ కాదు ఎజాజ్ మరోవైపు ఎన్కౌంటర్లో మృతి చెందింది సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న అస్లాం అయూబ్, జాకీర్బాదల్లుగా తొలుత పోలీసులు భావించినా, జాకీర్ లే డని ఆ తర్వాత నిర్ధారించుకున్నారు. మృతదేహాలను పరిశీలించినప్పుడు ఒక దుండగుని ఎడమచేతి వేలు గోరు వరకు కట్ అయి ఉందని, అలా కట్ అయిన వేలు వ్యక్తి ఉన్న ఎజాజుద్దీన్ అని ఏటీఎస్ పోలీసులు నిర్ధారించారు. గతంలో వీరి నుంచి సేకరించిన వివరాలను బట్టి అతన్ని ఎజాజుద్దీన్‌గా గుర్తించారు. ఇద్దరు కాదు.. నలుగురు మరోవైపు సూర్యాపేట ఘటనకు సంబంధం ఉన్నది ఇద్దరికి కాదని, మొత్తం నలుగురు ఉన్నారని పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. వాస్తవానికి సూర్యాపేట ఘటన జరిగిన రోజు బస్సులో ముగ్గురు దుండగులున్నారని, అందులో ఇద్దరినే పోలీసులు అనుమానించారని, మరోవ్యక్తి ఘటన జరగ్గానే చడీచప్పుడు కాకుండా బస్టాండ్ నుంచి వెళ్లిపోయాడని పోలీసులు పరిశీలించిన వీడియోఫుటేజ్లో తేలింది. వీరితో పాటు మరో వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చి ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరిని కలిశారని, దీంతో ఈ ఘటనతో నలుగురికి సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు వీరు సిమి సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాదులుగా తేలడంతో సూర్యాపేట బస్టాండ్‌లో దొరికిన ఒడిశా రాష్ట్ర ఐడెంటిటీ కార్డు ఫేక్‌దని తేలింది. వీరు తమ ఆపరేషన్ల కోసం నకిలీ కార్డులు ఉపయోగిస్తారని, రైళ్లలో ప్రయాణించే సమయంలో కొట్టేసిన పర్సుల నుంచి ఈ కార్డులను ఉపయోగిస్తుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే గత ఏడాది ఒడిశాలో జరిగిన తీవ్రవాద క్యాంపునకు వీరేమైనా వెళ్లారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
మానని గాయం..!
నగరంలో కాల్పుల ఘటనలు ఎన్నో... ఇప్పటికీ బాధితుల నరకయాతన తాజాగా ‘జానకీపురం’ ఘటనతో కలకలం అప్రమత్తంగా లేకుంటే ముప్పే! సిటీబ్యూరో: నగరంలో మరోసారి ‘సిమి’ కలకలం చెలరేగింది. పోలీసుల్లో ఆందోళన మొదలైంది. నల్గొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్ మృతులు నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) మాడ్యూల్‌కు చెందిన టైస్టులు అస్లం, ఎజాస్ అని తేలడం.. ఎన్‌కౌంటర్‌కు ముందు వీరు నగరంలో షెల్టర్ తీసుకున్నారని తెలియడంతో నగర ప్రజలతోపాటు పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. సూర్యాపేట, జానకీపురం ఘటనలు వెలుగు చూడకుంటే నగరంలో వీరు పంజా విసిరేవారేమోనని ఆందోళనచెందారు. ఎన్కౌంటర్ పుణ్యమా అని నగరానికి ముప్పు తప్పింది. కాగా నగరంలో పోలీసులపై ఇప్పటికి ఎనిమిది సార్లు తూటాలు పేలాయి. గడిచిన 20 ఏళ్ళుగా జరిగిన ఈ ఉదంతాల్లో ఏడుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వారిలో నక్సలైట్లు, ఉగ్రవాదులు, రౌడీషీటర్లు ఉన్నారు. ముఖ్యంగా ఫలక్‌నుమా నాగుల చింత పోలీసు చెక్‌పోస్టుపై 2009, మే 18న ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హోంగార్డు బాలస్వామి మృతి చెందగా కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ తలలోకి బుల్లెట్ దూరి గాయపడ్డాడు. అప్పటి నుంచి నేటి వరకు కూడా అతనికి శస్త్రచికిత్స జరగలేదు. ఇప్పటికీ తలలోని చిన్నమెదడు, పెద్దమెదడు మధ్యలో ఉగ్ర బుల్లెట్ అలాగే ఉండిపోయింది. శస్త్రచికిత్స జరిపితే ప్రాణాలకు హాని ఉంటుందని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో తూటాను ఆరేళ్లుగా అలాగే తలలో భరిస్తున్నాడు. బుల్లెట్ తలలోనే ఉండిపోవడంతో 60 శాతం కంటి చూపు మందగించింది. రానున్న రోజుల్లో కంటి చూపు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో మెరుగైన వైద్యం అందిస్తే బుల్లెట్ తీసే అవకాశాలు ఉన్నాయి. గత సంఘటనలు ఇవే... 1990, మతకల్లోలాల్లో 113 మంది మరణించిన కేసు దర్యాప్తులో ఛత్రినాక ఏసీపీ సత్తయ్య కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహంచిన కానిస్టేబుల్ ఖదీర్ సత్తయ్యను కాల్చి చంపాడు. ప్రస్తుతం ఖదీర్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. 1990లోనే పట్టుకోవడానికి వెళ్లగా..టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ నర్సింహారెడ్డిని రౌడీషీటర్ సర్దార్ కాల్చి చంపాడు. 1992, నవంబర్ 29..హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ టౌలీచౌకి బృందావన్‌కాలనీలో దాడి చేశారు. ఉగ్రావాది ముజీబ్ ఏకే-47తో ఎదురుదాడికి దిగి కృష్ణప్రసాద్, ఆయన గన్‌మాన్‌ను కాల్చిచంపాడు. 1993 జనవరి 25..ఎల్బీస్టేడియంలో మార్నింగ్ వాక్కు వచ్చిన ఐపీఎస్ అధికారి వ్యాస్‌ను శేషయ్య, తిరుపతి, బాలయ్య తదితరులు కాల్చి చంపి పరారయ్యారు. 1999 సెప్టెంబర్ 4...ఎస్సార్‌నగర్ చౌరస్తాలో పోలీసు అధికారి ఉమేష్‌చంద్రపై నక్సలైట్లు కాల్పులు జరిపి హతమార్చారు. 2008 డిసెంబర్ 3న సంతోష్‌నగర్‌లో సీఐ సెల్ పోలీ సులపై ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. 2009 మే 18 న ఫలక్‌నుమా నాగులచింత పోలీసు చెక్‌పోస్టుపై ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పుల్లో హోం గార్డు బాలస్వామి మృతి. కానిస్టేబుల్ రాజేంద్రప్రసా ద్ తలలో బుల్లెట్ దూరింది. నేటికి శస్త్ర చికిత్స జరపలేదు. బుల్లెట్ అలాగే తలలోనే ఉండిపోయింది. 2010 మే 14న శాలిబండ ప్రాంతంలో వికారుద్దీన్ తుపాకితో ఏపీఎస్పీ కానిస్టేబుల్ రమేష్‌ను కాల్చి చంపాడు. ప్రస్తుతం వికారుద్దీన్ జైలులో ఉన్నాడు. -
ప్రాణాలకు తెగించిన ‘సాక్షి’ విలేకరి
* పారిపోతున్న దుండగులను కెమెరాలో బంధించిన అర్వపల్లి ప్రతినిధి వెంకన్న * దుండగులు బెదిరించినా వెరవని వైనం తిరుమలగిరి: జానకీపురం ఎన్కౌంటర్ ఘటన సందర్భంగా అర్వపల్లి మండల కేంద్రం ‘సాక్షి’ విలేకరి శ్రీరంగం వెంకన్న మాటలకందని సాహసం ప్రదర్శించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముష్కరులకు ఎదురెళ్లి మరీ, వారిని సజీవంగా తన బుల్లి కెమెరాలో బంధించారు. ఇందుకోసం ఆయన అక్షరాలా ప్రాణాలకు తెగించారనే చెప్పాలి. ఎందుకంటే వెంకన్న ఫొటో తీస్తున్న విషయాన్ని ముష్కరుల్లో ఒకడు గమనించాడు. వెంటనే వెంకన్న వైపు తుపాకీ చూపెట్టి హిందీలో గట్టిగా అరిచాడు. దాంతో వెంకన్న తన కెమెరాను పక్కకు దాస్తూ.. తానూ దాక్కునే ప్రయత్నం చేశారు. అయినా దుండగులు ఆయన్ను వదిలిపెట్టేవారు కాదేమో! కానీ అనుకోకుండా వచ్చిన ఓ బస్సు వెంకన్నకు, దుండగులకు మధ్య నిలిచింది. అదే సమయంలో తుంగతుర్తి సీఐ వాహనం వెనుక నుంచి రావడంతో దుండగులు పలాయనం చిత్తగించారు. ‘‘సమయానికి ఆ బస్సు రాకుంటే నా పరిస్థితేమిటనేది ఇప్పుడు తలచుకుంటే భయమేస్తోంది గానీ, ఫొటోలు తీస్తున్నప్పుడు మాత్రం దాన్ని ప్రజలకు చేరవేయాలన్న ఆలోచన మాత్రమే ఉంది. అదే పరమావధిగా భావించి వారి ఫోటో తీశా..’’ అన్నారు వెంకన్న. వెంకన్న సాహసోపేతంగా తీసిన ఈ ఫొటో... ‘రేపటికి ముందడుగు’ వేస్తూ పాఠకుల మెడలో ‘సాక్షి’ ప్రతినిత్యం వేస్తున్న అక్షర మణిమాలలో మరో ఆణిముత్యం.