మోత్కూరు: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోత్కూరు మండలం జానకిపురం గ్రామంలో ఎన్‌కౌంటర్ జరిగి మంగళవారంతో ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 4, 2015న జానకిపురం గ్రామ శివారులో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అప్పటి ఆత్మకూరు(ఎం) ఎస్‌ఐ సిద్దయ్యతో పాటు అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ చౌగోని నాగరాజు అమరులయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అప్పటి రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, పోలీసు సిబ్బందికి, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో సీఐ బాలగంగిరెడ్డికి గాయాలయ్యాయి. పోలీసు సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు అస్లాం ఆయూబ్, జాకీర్ బాదల్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఎన్‌కౌంటర్ అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎన్‌కౌంటర్‌కు ముందు రోజు సూర్యాపేట బస్టాండ్‌లో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యారు. వారి కోసం పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది.
ఉగ్రవాదులు అర్వపల్లి దర్గా ప్రాంతంలో తలదాచుకొని తిరుమలగిరి మీదుగా మోత్కూరు మండలం చిర్రగూడూరు నుంచి డొంక మార్గం గుండా వెళ్తూ దారితప్పి జానకిపురం గ్రామ శివారుకు చేరుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బైక్‌పై వెళ్లగా బైక్ వాగులోని ఇసుకలో కూరుకుపోవడంతో మరో బైక్ తీసుకొని గ్రామ శివారులోకి ప్రవేశిస్తుండగా ఎదురుగా వచ్చిన పోలీసు వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డ్రైవర్ సీటులో ఉన్న కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మృతిచెందగా, ఎస్‌ఐ సిద్దయ్య పొట్ట, తలలోకి తూటాలు దిగడంతో కుప్పకూలిపోయాడు. వారిని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెండు రోజుల అనంతరం ఎస్‌ఐ సిద్దయ్య మృతిచెందాడు. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులను యావత్ దేశ ప్రజలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment