సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జానకీపురం ఎన్‌కౌంటర్ ఘటన నేపథ్యంలో జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అణువణువునా కూంబింగ్ చేస్తు న్నారు. దుండగులకు సంబంధించిన ఆధారాలతో పాటు ఇంకా ఎవరైనా ముష్కరులు జిల్లాలో ఉన్నారా.. అనే కోణంలో గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి కూంబింగ్ కొనసాగుతోంది. అర్వపల్లి గుట్టలు, సోలిపేట గుట్టలతో పాటు ఇతర మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆక్టోపస్‌దళాలతో కలిసి దాదాపు 200 మందికిపైగా సాయుధులైన పోలీసులు వెతుకుతున్నారని, ఈసారి ఎవరైనా కనిపిస్తే సహించేది లేదని పోలీసు వర్గాలంటున్నాయి. అయితే, కూంబింగ్ చేస్తుండగా దుండగులకు సంబంధించిన ఒక బ్యాగ్ లభించింది.
ఈ బ్యాగులో మూడు సెల్‌ఫోన్‌లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) వర్గాలు ఫోన్లలో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తూ ఆధారాల కోసం వెతుకుతున్నాయి. మరోవైపు దుండగులు తమ వద్ద ఉన్న కీలకసమాచారాన్ని వేరే వ్యక్తితో పంపించిన తర్వాతే బయటకు వచ్చారని, అప్పటివరకు 48 గంటలకు పైగా అజ్ఞాతంలోనే ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. అప్పటివరకు వారు అర్వపల్లి గుట్టల్లోనే ఉన్నారని, కాదు సూర్యాపేటలోనే ఉన్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా వారు శుక్రవారం అర్ధరాత్రి సమయంలోనే అర్వపల్లి సమీపంలో ఖాజా నసీరుద్దీన్‌బాబా దర్గాకు వచ్చారని తెలుస్తోంది. తమ వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ను ఢిల్లీ నుంచి వ్యక్తితో పంపిన తర్వాతే వారు బయటకు వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనా స్థలికి జాతీయ దర్యాప్తుసంస్థ అధికారులు
కాగా, దుండగులను ఎన్‌కౌంటర్ అయిన నేపథ్యంలో వారికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు జిల్లాకు వచ్చారు. వీరు మోత్కూరు మండలంలోని జానకీపురంలో జరిగిన ఎన్‌కౌంటర్ స్థలాన్ని వారు పరిశీలించారు. స్థానిక పోలీసులను, స్థానికులను అడిగి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడ లభించిన ఆధారాలను కూడా సేకరించారు. వీరితో పాటు ముంబైకి చెందిన యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు కూడా ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పోలీసు అధికారులతో పాటు మన రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మరోవైపు మృతదేహాలున్న కామినేని ఆసుపత్రికి ముంబై ఏటీఎస్ పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. వీరు మృత దేహాలను పరిశీలించి వేలిముద్రలను సేకరించారని పోలీసు వర్గాలంటున్నారు.
జాకీర్ కాదు ఎజాజ్
మరోవైపు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న అస్లాం అయూబ్, జాకీర్‌బాదల్‌లుగా తొలుత పోలీసులు భావించినా, జాకీర్ లే డని ఆ తర్వాత నిర్ధారించుకున్నారు. మృతదేహాలను పరిశీలించినప్పుడు ఒక దుండగుని ఎడమచేతి వేలు గోరు వరకు కట్ అయి ఉందని, అలా కట్ అయిన వేలు వ్యక్తి ఉన్న ఎజాజుద్దీన్ అని ఏటీఎస్ పోలీసులు నిర్ధారించారు. గతంలో వీరి నుంచి సేకరించిన వివరాలను బట్టి అతన్ని ఎజాజుద్దీన్‌గా గుర్తించారు.
ఇద్దరు కాదు.. నలుగురు
మరోవైపు సూర్యాపేట ఘటనకు సంబంధం ఉన్నది ఇద్దరికి కాదని, మొత్తం నలుగురు ఉన్నారని పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. వాస్తవానికి సూర్యాపేట ఘటన జరిగిన రోజు బస్సులో ముగ్గురు దుండగులున్నారని, అందులో ఇద్దరినే పోలీసులు అనుమానించారని, మరోవ్యక్తి ఘటన జరగ్గానే చడీచప్పుడు కాకుండా బస్టాండ్ నుంచి వెళ్లిపోయాడని పోలీసులు పరిశీలించిన వీడియోఫుటేజ్‌లో తేలింది. వీరితో పాటు మరో వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇద్దరిని కలిశారని, దీంతో ఈ ఘటనతో నలుగురికి సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు వీరు సిమి సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాదులుగా తేలడంతో సూర్యాపేట బస్టాండ్‌లో దొరికిన ఒడిశా రాష్ట్ర ఐడెంటిటీ కార్డు ఫేక్‌దని తేలింది. వీరు తమ ఆపరేషన్ల కోసం నకిలీ కార్డులు ఉపయోగిస్తారని, రైళ్లలో ప్రయాణించే సమయంలో కొట్టేసిన పర్సుల నుంచి ఈ కార్డులను ఉపయోగిస్తుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే గత ఏడాది ఒడిశాలో జరిగిన తీవ్రవాద క్యాంపునకు వీరేమైనా వెళ్లారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అణువణువూ గాలింపు
Published Mon, Apr 6 2015 4:07 AM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM
Advertisement
Advertisement