డేగ కళ్లతో పహారా
♦ పంద్రాగస్టు వేడుకలకు పటిష్ట భద్రతా చర్యలు
♦ సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల మోహరింపు
♦ ముంబైలో 30 వేల మంది పోలీసులతో భద్రత
సాక్షి, ముంబై : స్వాతంత్య్ర దినవేడుకలు ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. పతాకావిష్కరణ జరిగే ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు, సమస్యత్మాక, రద్దీ ప్రాంతాల్లో భారీ పోలీసు బలగాలు మోహరించింది. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు డేగ కళ్లతో పహార కాస్తున్నారు.మెట్రో నగరాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించడంతో ముంబైతోపాటు నాగపూర్, పుణే, నాసిక్ తదితర ప్రధాన నగరాలలో భద్రత పటిష్టం చేసింది. ముంబైలో 30 వేలకుపైగా పోలీసులు పహారా కాస్తున్నారు.
వేడుకల సందర్భంగా పోలీసుల వారాంతపు, దీర్ఘకాలిక సెలవులు ప్రభుత్వం రద్దు చేసింది. నగరానికి వచ్చే వివిధ ప్రవేశ ద్వారాల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాత్రిళ్లు నాకాబందీలు నిర్వహిస్తున్నారు. లాడ్జ్జింగులు, హోటళ్లు, పబ్‌లు, బార్లలో తనిఖీ ముమ్మరం చేశారు. హోటళ్లు, లాడ్జిల్లో బస చేసిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు.
జూలై, ఆగస్టుల్లోనే..
గతంలో ఉగ్రదాడులు, బాంబు పేలుళ్లు అత్యధికం జూలై, ఆగస్టులోనే జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2003 ఆగస్టులో గేట్ వే ఆఫ్ ఇండియా, 2006 జూలైలో లోకల్ రైళ్లలో సీరియల్ బాంబు పేలుళ్లు, 2012 జూలైలో జవేరీ బజార్, దాదర్ కబూతర్ ఖానా, అపేరా హౌజ్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, పుణేలో జర్మన్ బేక్రిలో, తాజాగా పంజాబ్‌లో ఉగ్రవాదులు జూలైలోనే దాడులు చేశారు. మరోవైపు యాకూబ్ మెమన్‌కు ఉరి శిక్షకు ప్రతీకారం తీర్చుకుంటామని అతడి సోదరుడు టైగర్ మెమన్, అండర్ వరల్డ్ డాన్ చోటా షకీల్, ఉగ్రవాదులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంద్రాగస్టు వేడుకలను ఒక సవాలుగా తీసుకుని ప్రశాంతగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
పోలీసుల ఆధీనంలో..
నగరాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారని, దీంతో ముంబైకర్లు అందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ పోలీసు కమిషనర్ (దర్యాప్తు శాఖ) ధనంజయ్ కులకర్ణి తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు గాని, వస్తువులు గాని కనిపిస్తే వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారమివ్వాలని సూచించారు. వదంతులను నమ్మొద్దన్నారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేశామని చెప్పారు.