బీ అలెర్ట్!
♦ నిఘా వర్గాల హెచ్చరిక
♦ రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం
♦ తనిఖీలు ముమ్మరం
♦ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రిహార్సల్స్
తమిళనాట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల విచ్ఛి్చన్నానికి పాకిస్తానీ ముష్కరులు కుట్ర చేసినట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. కేంద్రం హెచ్చరికలతో రాష్ట్రంలో గురువారం నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. చెన్నైతోపాటు మీనాక్షి అమ్మవారు కొలువుదీరిన మదురైలో ఐదు అంచెల భద్రతను పెంచారు.
సాక్షి, చెన్నై : రాష్ట్ర రాజధాని నగరం చెన్నై, ఆధ్యాత్మిక నగరం మదురై తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తోంది. కేంద్రం, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు నిఘాతో వ్యవహరిస్తూ వస్తోంది. అయితే, ఇటీవల రాష్ట్రంలో వెలుగుచూస్తున్న పరిణామాలు భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది.
గతంలో జరిగిన బెంగళూరు బాంబు పేలుళ్ల కేసు రాష్ట్రం చుట్టూ తిరగడం, ఐఎస్‌ఐఎస్ మద్దతుదారుల కార్యకలాపాలు వెలుగులోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆందోళన తప్పడం లేదు. అలాగే, హిందూ సంఘాలు, బీజేపీ నేతల్ని గురి పెట్టి దాడులకు వ్యూహ రచనలు జరిగినట్టుగా సంకేతాలు వస్తుండడాన్ని బట్టి చూస్తే, రాష్ట్రం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోందనే అనుమానాలున్నాయి. చాప కింద నీరులా సంఘ విద్రోహశక్తులు కార్యకలాపాల్ని విస్తృతం చేస్తున్నారా? అన్న ఆందోళన తప్పడం లేదు.
భద్రత కట్టుదిట్టం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల విచ్ఛిన్నానికి కుట్ర జరిగిన సమాచారం ఆందోళన కల్గిస్తోంది. పాకిస్తానీ ముష్కరులు సముద్రమార్గం గుండా రాష్ట్రంలో చొరబడేందుకు వ్యూహరచన చేసినట్టు కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టినట్టు సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు సంయుక్తంగా గస్తీలో నిమగ్నం అయ్యారు. ఇక రాష్ట్రంలోని చెన్నై, మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్, సేలం విమానాశ్రయాల్లో, ఆ నగరాల్లో భద్రతను పటిష్టం చేశారు.
ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లు, బస్టాండులు, ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో భద్రతను పెంచారు. ఆయా నగరాల సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యారు. చెన్నైలో అయితే, మెరీనాతీరంలో భద్రత పెంచారు. సెంట్రల్, ఎగ్మూర్, తాంబరంలతో పాటుగా అన్ని రైల్వే స్టేషన్లను నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. కోయంబేడు బస్టాండ్‌లో భద్రతపరంగా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ప్రతి ప్రయాణికుడ్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. సెంట్రల్, ఎగ్మూర్‌లకు వచ్చే రైళ్ల మీద నిఘా పెంచారు.
రిహార్సల్
స్వాతంత్ర దినోత్సవ వేడుకకు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ దృష్ట్యా, సచివాలయం నుంచి కామరాజర్ సాలై వైపుగా ఏర్పాట్ల మీద అధికారులు దృష్టి పెట్టారు. సచివాలయంలో ప్రప్రథమంగా సీఎం హోదాలో పళని స్వామి ఈసారి జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు. ఈ వేడుకలు మరింత ఘనంగా సాగే విధంగా ఏర్పాట్లు విస్తృతం అయ్యాయి. ఇందులో త్రివర్ణ దళాలు, రాష్ట్ర పోలీసు శాఖలోని వివిధ విభాగాల కవాతులు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు సాగనున్నాయి. ఈ ప్రదర్శనల నిమిత్తం రిహార్సల్స్‌కు శ్రీకారం చుట్టారు. గురువారం పోలీసుల నేతృత్వంలో ఉదయాన్నే రిహార్సల్స్ సాగాయి. ఇక, శుక్రవారం నుంచి అన్ని విభాగాల నేతృత్వంలో రిహార్సల్స్ ఓవైపు, శకటాల ముస్తాబు మరోవైపు సాగనున్నాయి. ఈ పనులు జరిగే ప్రాంతాల్లోనూ భద్రత పటిష్టం చేశారు.