54 మంది ఐఏఎస్‌లకు నోటీసులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై చర్యలకు సిద్ధమైపోయింది. రాజ్యాంగాన్ని అగౌరవ పరిచారంటూ పేర్కొంటూ ఉన్నతాధికారులందరికీ షో కాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో 54 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండటం విశేషం.
ఆగష్టు 15 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డెహ్రాడూన్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పలువురు అధికారులు గైర్హాజరయ్యారు. ఇది గమనించిన ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ సెక్రటరీ రామస్వామిని ఆదేశించారు. దీంతో స్పందించిన సీఎంవో కార్యాలయం 87 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు నోటీసులు పంపింది.
వీరిలో 10 మంది డిప్యూటేషన్ మీద ఉండగా, 46 మంది అదనపు సెక్రటరీలు, ఐదుగురు సెక్రటరీ ఇన్ ఛార్జీలు, ఒక ప్రిన్సిపాల్ సెక్రటరీ, మరో ఇద్దరు సెక్రటరీలు ఉన్నారు. వీరి నుంచి వివరణ కోరిన ప్రభుత్వం అది సహేతుకంగా లేని పక్షంలో వార్షిక నివేదిక సమయంలో వారిపై చర్యలు తీసుకునే ఆస్కారం ఉందని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గైర్హాజయ్యారయిన ఉద్యోగులపై కూడా తీసుకోవాలంటూ అధికారులకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రం ఏర్పడి 17 ఏళ్లు గడుస్తున్నా ఇంతకాలం అధికారిక కార్యక్రమాలకు హాజరుకాని వాళ్లను హెచ్చరించి వదిలేశారేగానీ, ఇలా క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం ఇదే ప్రథమమని ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి స్పందించారు.