ఆపరేషన్ ఐ | Operation I | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ ఐ

Published Tue, Jan 26 2016 2:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

ఆపరేషన్ ఐ - Sakshi

ఆపరేషన్ ఐ

ప్రత్యర్థులపై అభ్యర్థుల నిఘా
దెబ్బతీసేందుకుపణాళికలు..
రంగంలోకి సొంత షాడో టీమ్స్,ఇంటెలిజెన్స్, డిటెక్టివ్ బృందాలు
కోవర్టు ఆపరేషన్లకూ కుట్ర అప్రమత్తమైన పోలీసులు

 
 షాడో టీమ్స్.. ఇంటెలిజెన్స్ బ్యూరో.. ఇదేంటి రాజకీయంలో పోలీస్ విచారణ బృందాలు అనుకుంటున్నారా? అవును.. రాజకీయ నాయకులు ఇప్పుడు పోలీస్ భాష్యం నేర్చుకున్నారు. షాడో టీమ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో తరహాలో ప్రత్యర్థులపై అనుక్షణం నిఘా పెడుతున్నారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి ‘కోవర్ట్ ఆపరేషన్లు’ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు, నాయకులు ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయడం మామూలే. కానీ ఈ రకంగా ‘సీక్రెట్ ఆపరేషన్’లకు నాయకులు తెరదీయడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ఈ పోటాపోటీ చర్యల నేపథ్యంలో ఎలాంటి అపశృతులు, ఉద్రిక్తతలు జరగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు డేగకన్ను వేసి ఉంచుతున్నారు.

 ఎత్తులు తెలిస్తేనేగా పైఎత్తులు వేసేది.?
 అన్ని పార్టీల్లో కార్పొరేటర్ సీట్ల కోసం ఏర్పడిన విపరీతమైన పోటీయే ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించేలా చేస్తోంది. ఇందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యర్థి ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడంపైనే దృష్టి పెట్టారు. వారు ఎవరిని కలుస్తున్నారు? ఎక్కడ కలుస్తున్నారు? ఏమి హామీలు ఇస్తున్నారు? ఎలాంటి ప్రలోభాల ఘట్టం ప్రారంభించారు?.. తదితర అంశాలు స్పష్టంగా తెలిస్తేనే వాటిని దీటుగా తిప్పికొట్టొచ్చు. దీంతో పాటు ఓటర్లు వారి వైపు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘గ్రేటర్ అభ్యర్థులు’ అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు.

 అనుచరుల ఆపరేషన్...
 ఈ వ్యూహాన్ని అమలు చేయడంలో భాగంగా కొందరు తమ అనుచరుల్ని ప్రత్యేకంగా రంగంలోకి దింపుతున్నారు. వీరు తమ అభ్యర్థి తరఫున పని చేసినా, చేయకున్నా.. ప్రత్యర్థి ఏం చేస్తున్నాడనేది తెలుసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే మరికొందరితో కలిసి ‘షాడో టీమ్స్’ మాదిరిగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు తమ అభ్యర్థికి అప్‌డేట్స్ అందిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే మరో అడుగు ముందుకేసి ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలనూ ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అనునిత్యం తన పోటీదారులపై కన్నేసి ఉంచాల్సిన బాధ్యతల్ని వీరికి అప్పగిస్తున్నారు నాయక గణం.  

 ప్రత్యర్థి అనుచరులకు ఎర...
 తన వేగుగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వెంట తిరిగే వ్యక్తిని అవతలి వారు గుర్తించకూడదు. అలా జరిగితే మొదటికే మోసం వస్తుంది. అలాగని పూర్తిగా కొత్తవారిని రంగంలోకి దింపితే వారికి స్థానిక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండదు. వీటిని దృష్టిలో పెట్టుకున్న కొందరు ‘గ్రేటర్’ అభ్యర్థులు ఏకంగా కోవర్ట్ ఆపరేషన్లు ప్రారంభించారు. పోటీదారుడి వెనుక తిరుగుతున్న, అతడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులకు వివిధ రకాలుగా ఎర వేస్తూ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కోవర్ట్ ఆపరేషన్లకు సహకరించే వారికి భారీగానే నజరానాలు ఇస్తున్నారని సమాచారం.   

 దెబ్బతీసేందుకే...
 ఈ నిఘా పర్వంలో ప్రతి పార్టీ అభ్యర్థి పోటీదారుడిని వీలైనన్ని కోణాల్లో దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రత్యర్థి ఎలా ప్రచారం చేస్తున్నాడు? ఎవరిని కలుస్తున్నాడు? తదితర అంశాలతో పాటు వారి ‘డంప్స్’కు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడంపై దృష్టి పెడుతున్నారు. ప్రలోభాలకు అవసరమైన సామగ్రి, మద్యం, నగదు సమీకరణ పూర్తయిందా? వాటిని ఆయా అభ్యర్థులు ఎక్కడ దాచి ఉంచుతున్నారు? ఆ కోణంలో వీరికి సహకరిస్తోంది ఎవరు? అనే అంశాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడానికీ ‘నిఘా’ను వాడుతున్నారు. ఈ వివరాలు తెలిస్తే పోలీసులకు, ఎన్నికల సంఘానికి పరోక్షంగా సమాచారమిచ్చి వారిని దెబ్బతీయాలన్నది వీరి వ్యూహంగా కనిపిస్తోంది.
 
 రాజకీయం రణరంగం.. ఎదుర్కోవాలి.. ఎదురించాలి..అలాగైతేనే నిలిచేది.. గెలిచేది..
 ఇందుకు తగ్గేట్టే ‘గ్రేటర్’ నాయకులు ‘గ్రేట్’ ఐడియాలతో దూసుకుపోతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. రాజకీయంతోనే ‘ఆట’ ఆడుకుంటున్నారు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ‘స్కెచ్’ వేస్తూ ప్రత్యర్థికి ‘చెక్’ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా.. తనను తాను కాపాడుకుంటూనే ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇవేవో ఆషామాషీ ప్రణాళికలు కాదండోయ్.. పోలీస్ తరహా ఆపరేషన్లు.                 
- సాక్షి, సిటీబ్యూరో

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement